భూగర్భ శోకం

Underground Grief– అడుగంటుతున్న జలాలు 
– వర్షాభావంకు తోడు తీవ్రమైన ఎండలు
– 10 మీటర్లకు పైగా పడిపోయిన నీటిమట్టం
– ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో తాగునీటి కష్టాలే..!
– సాగర్‌లో నీరు లేక కృష్ణా పరివాహకంలో ఆందోళన
– ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామంటున్న అధికారులు
నవతెలంగాణ- ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధుల బృందం/విలేకరులు
ఐదారు నెలలుగా చినుకు రాలకపోవడంతో రాష్ట్రంలో పలుచోట్ల భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు ఫిబ్రవరి నెల నుంచే ఎండలు తీవ్రం కావడంతో భూగర్భ నీటిమట్టం పడిపోతున్నది. ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో తాగునీటి కష్టాలు తప్పేలా లేదు. ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు తగ్గుతుండడంతో బావులలో నీరు ఉండటం లేదు. పలుచోట్ల నెర్రలు బారిన పొలాలు పశువుల మేతగా మారాయి. 10 మీటర్లకు పైగా భూగర్భ నీటిమట్టం పడిపోవడం కూడా ఈ ఆందోళనకు కారణమైంది. గతేడాది ఫిబ్రవరితో పోల్చుకుంటే భూగర్భ జలాల్లో 3 మీటర్లకు పైగా వ్యత్యాసం ఉంది. ప్రాజెక్టులు, చెరువులు, బావుల్లో నీటిమట్టం అడుగంటుతుండటం యాసంగి పంటలపై ప్రభావం చూపుతోంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.
కృష్ణాతో పాటు గోదావరి పరివాహకంలోనూ నీటి వెతలు
రాష్ట్రానికి ఆదరువుగా ఉన్న కృష్ణా, గోదావరి పరివాహంలో నీటి వెతలు నెలకొన్నాయి. గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. శ్రీరాంసాగర్‌ నుంచి కూడా నీరు రావట్లేదు. ఇటు కృష్ణా నదిలోనూ నీరు అడుగంటడంతో నాగార్జున సాగర్‌ ఆయకట్టూ ఎండుతోంది. కృష్ణా, గోదావరిని అనుసంధానం చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్‌ జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు నీరందించేందుకు 2016లో చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం 2019 నాటికి పూర్తి కావాల్సి ఉండగా నేటికీ నిర్మాణ దశలోనే ఉంది.
మండుతున్న ఎండలు
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 3.50 లక్షల బోరు బావులున్నాయి. వీటి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2వేల వరకు చెరువులున్నాయి. ఎండల తీవ్రతకు నీరు అడుగంటడంతో తాగునీటి కష్టాలు చుట్టుముట్టుతున్నాయి.
విస్తీర్ణంలో 30శాతం వరి పంట సాగు
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎడమ కాల్వ పరిధిలో 3 లక్షలా 94 వేలా 285 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉన్నది. ఇందులో 3,03,350 ఎకరాలు సాగునీటిపై ఆధారపడి ఆయకట్టు ఉండగా 41 ఎత్తిపోతల పథకం కింద 90,922 ఎకరాలు ఆయకట్టు ఉన్నది. ఈ సీజన్లో తీవ్ర వర్షాభావం కారణంగా సాగునీరు విడుదల కాకపోవడంతో ఆయకట్టులో 30శాతం బోర్లు బావుల కింద సుమారు1.20 లక్షల ఎకరాలలో వరి పంట సాగు చేశారు. ఈ కాలంలో పంట పొట్ట దశకు వచ్చి అవకాశముంది ఆ సమ యంలో వరి పంటకు నీటి అవసరం ఎక్కువగా ఉం టుంది. సకాలంలో నీరు అందితేనే పంట చేతికి వస్తుంది. లేకపోతే పంట ఎండిపోయే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. పెట్టిన వేలాది రూపాయలు పెట్టుబడులు వృథా అవుతామని రైతులు ఆందోళనగా ఉన్నారు.
ఆందోళనకరం రంగారెడ్డి జిల్లాలో భూగర్భజలాలు
రంగారెడ్డి జిల్లాలో భూగర్భ జలాలు పాతాళానికి చేరాయి. గతేడాది కంటే 12 మీటర్ల లోతులోకి జలాలు పడిపోయాయి. వేసవి కాలం ప్రారంభానికి ముందే జనవరి నెలలో అర్భన్‌ ప్రాంతమైన శేరిలింగంపల్లిలో 30 మీటర్ల లోతులోకి వాటర్‌ లెవల్స్‌ పడిపోయాయి. తలకొండపల్లిలో 16.86 మీటర్లు, ఇబ్రహీంపట్నం 14.55 మీటర్లు, హయత్‌నగర్‌ 13.77 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు పడిపోయాయి. వర్షాలు లేకుంటే మార్చి, ఏప్రిల్‌, మే నెలలో జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
పెద్దవూరలో 40 మీటర్ల లోతులోకి…
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో భూగర్భ జలమట్టం భారీగా పడిపోయింది. మండలంలో 40.05 మీటర్లలోతులో నీరు ఉంది. వ్యవసాయ బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చిం ది. చివరికి పశువుల మేతకు సైతం ఇబ్బంది ఏర్పడే పరి స్థితులున్నాయి. మండలంలో 70శాతం బోర్లు మూలన పడ్డాయి. జిల్లావ్యాప్తంగా 2,860 చెరువులు, కుంటలు ఉండగా ఒకటి, రెండింటిలోనే కొద్దిపాటి నీరు ఉంది.
మరికొన్నిచోట్ల …
ఖమ్మం జిల్లాలో గతేడాది జనవరితో పోల్చితే ఈ ఏడాది ఒక మీటర్‌ లోతుకు భూగర్భ నీటిమట్టం పడిపోయింది. జనవరి నాటికి సాధారణ వర్షపాతం 956.9 మి.మీ కురవాల్సి ఉండగా కేవలం 854.4 మి.మీ మాత్రమే నమోదైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఐదు జిల్లాల్లో 9 మిల్లిమీటర్ల కనిష్ట స్థాయికి భూగర్భజలాలు పడిపోయాయి. జిల్లాలో సాధారణంగా ప్రతి ఏటా 642.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ఈ సారి 592.1 మిల్లిమీటర్లకు మించి వర్షపాతం నమోదు కాలేదు. సంగారెడ్డి జిల్లాలో సగటు భూగర్భ నీటిమట్టాలు 7.35 మీటర్లు ఉండగా ఈ ఏడాది జనవరి చివరి నాటికి 9.71 మీటర్లకు తగ్గాయి. జిల్లాలోని కంది, చౌటకూరు మండలలాల్లో 11.50 మీటర్లకు పైగా నీటిమట్టం పడిపోయింది.
16 అడుగుల టీఎంసీల లోపే మిడ్‌ మానేరు ప్రాజెక్టు
సిరిసిల్ల జిల్లాలో మిడ్‌ మానేరు ప్రాజెక్టు సామర్థ్యం 27.5 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 16 అడుగుల టీఎంసీల లోపే నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా అన్నపూర్ణ ప్రాజెక్టులోకి నీరు ఎత్తిపోయాల్సి ఉంది. 3.50 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో నీటిని రంగనాయక సాగర్‌కు మళ్లించడంతో ఒక టీఎంసీ కూడా లేకపోవడంతో ప్రాజెక్టు అడుగంటిపోయింది.
పాలేరులో ఎండుదశకు పంటపొలాలు
పాలేరు జలాశయంలో నీరు లేకపోవడంతో పాత కాలువ పరిధిలో 8వేల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి. మిషన్‌ భగీరథ తాగునీటి పథకానికి సైతం సరిపడా నీరందే పరిస్థితి లేదు. ఇటీవల సాగర్‌ నీరు వదిలినా నెలల తరబడి వర్షాభావం, ఎగువ రైతుల మోటార్లతో నీరు వాడుకోవడం వంటి కారణాలతో ఫిబ్రవరి 2, 3 తేదీల నాటికి కానీ నీరు జలాశయానికి చేరలేదు. పాలేరు నీటిమట్టం 23 అడుగులకు గాను 11 అడుగుల వరకు పడిపోయింది. పాలేరు నీటి ఆధారంగా ఎన్నెస్పీ పరిధిలో లక్ష ఎకరాలకు పైగా రబీ పంటలు సాగు చేశారు. తాగునీటికే కటకట ఏర్పడుతున్న పరిస్థితుల్లో బోర్లున్నా నీరు లేక ఈ పంటలు చేతికి వచ్చేలా లేవు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని, గోదావరి నీటిమట్టం అడుగంటడంతో అక్కడి పంటల పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారింది.
ప్రాజెక్టుల కింద తగ్గిన సాగు..
మహబూబ్‌నగర్‌ జిల్లాలో యాసంగి 8 లక్షల ఎకరాలకు పైగా సాగవుతుంది. జూరాల ప్రాజెక్టు కింద ప్రతియేటా 40వేల ఎకరాల వరి సాగు చేసేవారు. ఈ ఏడాది రబీలో పదివేల ఎకరాలు కూడా సాగు కాలేదు. కెఎల్‌ఐ ద్వారా కొల్లాపూర్‌, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి నియోజకవర్గాల పరిధిలో సుమారు వరి, మొక్క, మిర్చి, వేరుశనగ వంటి పంటలు లక్ష ఎకరాలకు పైగా సాగయ్యేది. ఈసారి 25 వేల ఎకరాలకు మించి సాగు కాలేదు. దుందుబీ నది ఆయకట్టు కింద ప్రతియేటా 70 వేల ఎకరాల్లో సాగయ్యే పంటలు ఈసారి 15వేల ఎకరాలకు మించలేదు. ఉమ్మడి జిల్లాలోని శ్రీశైలం, జూరాల రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి. జూరాలలో 1045 అడుగులు ఉండాల్సిన నీటిమట్టం 345 అడుగులు మాత్రమే ఉంది. శ్రీశైలంలో గతేడాది ఈ సమయానికి 885 అడుగుల నీరుండగా ఇప్పుడు 301 అడుగులకు పడిపోయింది. నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలో ఉండే సాగు భూములు బీళ్లుగా మారాయి. ఎటువంటి సాగు వనరులు లేని ఈ రెండు జిల్లాల్లో రబీ సాగు కనిష్ట స్థాయికి పడిపోయింది.
అరుతడి పంటలకు నీటిని విడుదల చేయాలి- పాల్తీ మంగ్లా నాయక్‌ (పాల్తీ తండా)రెండెకరాలు వరి పంట సాగు
రెండెకరాలు చేశాను. పొట్ట దశలో ఉంది. బోర్లలో నీళ్లు రాక, చెరువులు ఎండిపోయి, భూగర్భజలాలు లేక పొలాలు వాడుబడుతున్నాయి. ఏఎంఆర్‌పీ 8, 9 డిస్ట్రిబ్యూటరీ కాలువలకు వారబంధి ప్రకారమైనా నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.
పంటలు ఎండిపోతున్నాయి – కట్ట సైదిరెడ్డి మంగాపురం, వేములపల్లి మండలం
చెరువుల ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. యాసంగి పంట మొదట్లో బోర్లు ఆశాజనకంగా పోయడంతో ఆరు ఎకరాలు సాగు చేశాం. భూగర్భ జలాలు అడుగంటడంతో రెండు బోర్లు ఎండిపోయాయి. రెండు ఎకరాల మేర వరి పంటఎండిపోయింది

Spread the love