ఆశాలపై పోలీసుల పిడిగుద్దులు

Police fists on hopes– మంత్రి గంగుల ఇంటి ఎదుట ఉద్రిక్తత అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు కాళ్లతో తన్నుతూ లాక్కెళ్లి అరెస్ట్‌
సమస్యలను పరిష్కరించాలని వినతి పలుచోట్ల అడ్డుకున్న పోలీసులు
ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18వేలు ఇవ్వాలి.. పారితోషికంలో లేని పనులను తమతో చేయించొద్దంటూ సమ్మె చేస్తున్న ఆశాల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వాలంటీర్‌ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, మంత్రుల కార్యాలయాల ముట్టడి చేపట్టారు. ఈ క్రమంలో కరీనంగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ ఇంటి వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఐటీయూ నాయకులు, ఆశాలపై పిడిగుద్దులు గుద్దుతూ.. కాలితో తన్నుతూ బట్టలు చింపేపి దాడి చేశారు. మంత్రిని కలిపిస్తాం.. లోపలికెళ్లండంటూ తీసుకెళ్లి అరెస్టు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే కార్యాలయాల ముట్టడి
నవతెలంగాణ – విలేకరులు
కరీంనగర్‌లో భారీ ర్యాలీ తీసి మంత్రి గంగుల కమలాకర్‌ ఇంటి ముట్టడి చేపట్టారు. శాంతియుతంగా నిరసన చేపట్టి వినతిపత్రం ఇస్తామని, మంత్రిని కల్పించాలని కోరిన సీఐటీయూ నాయకులను పోలీసులు అడ్డుకోగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సీఐటీయూ నాయకులు ఎడ్ల రమేష్‌, గుడికందుల సత్యం, ఉప్పునుటి శ్రీనివాస్‌పై పోలీసులు పిడి గుద్డులు గుద్దారు. కాలితో తన్నుతూ బట్టలు చింపేసి దాడి చేశారు. ఆశా కార్యకర్తలైన మహిళలపై పోలీసులు చేతులు వేస్తూ తోసేశారు. కరీంనగర్‌ టౌన్‌ ఏసీపీ నరేందర్‌ వచ్చి పది మంది మాత్రమే లోపలికి వెళ్లాలని సూచించగా, వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న తరుణంలో ముకుమ్మడిగా అరెస్టు చేశారు. నాయకులను టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. ఆశావర్కర్లు 40మందిని త్రీటౌన్‌కు తరలించారు. 75మంది ఆశా కార్య కర్తలును సీపీటీసీకి తరలించారు. ఈ కార్య క్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ కరీంనగర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత, జిల్లా కోశాధికారి విజయలక్ష్మి, నాయకులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
హైదరాబాద్‌ ముషీరాబాద్‌ గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ వరకు నల్ల జెండాలు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన మధ్యంతర భృతిలో ఆశాల పేరు లేకపోవడం వారిని దగా చేయడమే సీఐటీయూ నేతలు అన్నారు. మధ్యంతర భృతి, పీఆర్సీతో సంబంధం లేకుండా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశాలకు రూ.18,000 ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ర్యాలీకి వస్తున్న 40 మంది ఆశాలను సికింద్రాబాద్‌ రేతి ఫైల్‌ బస్‌ స్టేషన్‌ వద్ద అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆశా వర్కర్లు ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా వినతిపత్రాలు అందజేశారు. బాలానగర్‌ నర్సాపూర్‌ చౌరస్తాలోని మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆశావర్కర్లు రిక్షా తొక్కుతూ నిరసన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు, చేవెళ్లలో ఎమ్మెల్యే కాలే యాదయ్యకు వినతిపత్రం అందజేశారు.
హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని ప్రభుత్వ చీఫ్‌ విప్‌, ఎమ్మెల్యే వినరుభాస్కర్‌ క్యాంప్‌ ఆఫీస్‌ ఎదుట ఆశాలు ధర్నా చేపట్టారు. తొలుతు పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడే బైటాయించారు. చివరకు పోలీసులు వారిని వినరుభాస్కర్‌ వద్దకు తీసుకెళ్లారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి వద్ద ధర్నా చేశారు.
ఖమ్మంలోని మంత్రి పువ్వాడ అజరు కుమార్‌ క్యాంప్‌ కార్యాలయం వద్దకు ధర్నాకు వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే బైటాయించారు. ఆశాలను లోపలికి అనుమతివ్వాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు, ఆశా కార్యకర్తలకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం టూ టౌన్‌ సీఐ ఆశాలను మంత్రి వద్దకు తీసుకెళ్లగా వినతిపత్రం అందజేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు.
వైరాలో ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట బైటాయించిన నిరసన తెలిపారు. భద్రాచలంలో ఆశా కార్యకర్తలు ఎమ్మెల్యే కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఇల్లందులో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మెల్యే బయటకు వచ్చి వారి సమస్యలు విన్నారు.
ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఆయన లేకపోవడంతో ప్రధాన ద్వారానికి వినతిపత్రాన్ని అంటించారు. ఖానాపూర్‌ పట్టణంలో ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకునికి వినతిపత్రాన్ని అందించారు. నిర్మల్‌లో ర్యాలీగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి క్యాంపు కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.

Spread the love