జాడలేని రైతు మద్దతు

Traceless farmer support– ఊసేలేని నిరుద్యోగ యువత ఆకాంక్షలు
– జమిలి ఎన్నికలు అమలు చేస్తా
– సంకల్ప్‌ పత్ర్‌ పేర 14 అంశాలతో బీజేపీ మ్యానిఫెస్టో
– విడుదల చేసిన ప్రధాని మోడీ, అమిత్‌ షా, నడ్డా, రాజ్‌ నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
రైతులకు బీజేపీ గతంలో వాగ్దానం చేసిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను మ్యానిఫెస్టో నుంచి తొలగించింది. అలాగే నిరుద్యోగ యువత ఆకాంక్షలను సైతం మ్యానిఫెస్టోలో పొందుపరచలేదు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ‘సంకల్ప్‌ పత్ర్‌’ పేరుతో 14 అంశాలతో కూడిన మ్యానిఫెస్టోను ఆదివారం నాడిక్కడ బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కలిసి ప్రధాని మోడీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ బీజేపీ ఆలోచన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమేనని అన్నారు. బీజేపీ పాలనలో అభివృద్ధి, సంస్కృతి రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడించారు. మానవ కల్యాణం, ప్రపంచ హితం కోసం ఎప్పుడూ ముందుంటామన్నారు. దేశాభివృద్ధికి అవినీతి ఆటంకంగా మారిందన్నారు. నాలుగు స్తంభాలతో ‘సంకల్ప్‌ పత్ర’కు పునాదులు వేశామని తెలిపారు. యువశక్తి, నారీశక్తి, గరీబ్‌, కిసాన్‌ను దృష్టిలో ఉంచుకుని దీనిని తయారు చేశామని వెల్లడించారు. దేశ యువత ఆకాంక్షలను తమ సంకల్ప్‌ పత్ర్‌ ప్రతిబింబిస్తున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు.
మ్యానిఫెస్టోలో ప్రధాన అంశాలు
వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌, మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు చేస్తామని పేర్కొంది. పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామని, పెట్రోలు వినియోగాన్ని అవకాశం ఉన్నంత మేరకు తగ్గిస్తామంది. 2036లో ఒలింపిక్స్‌ దేశంలో నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామంది. ఉచిత రేషన్‌ను వచ్చే ఐదేండ్లు కూడా అందిస్తామంది. 70 ఏండ్లు పైబడిన వృద్ధులను ఆయుష్మాన్‌ భారత్‌లో చేరుస్తామని తెలిపింది. రూ.5 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని, పేదలకు మూడు కోట్ల ఇండ్లు కట్టించి ఇస్తామని, వికలాంగుల ప్రత్యేక అవసరాలకనుగుణంగా ఇండ్ల నిర్మాణం చేపడతామని, సీనియర్‌ సిటిజన్లతో పాటు ట్రాన్స్‌జెండర్లకూ ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని వర్తింపజేస్తామని, భవిష్యత్తులో పైపులైన్‌ ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ అందిస్తామంది. సూర్య ఘర్‌ పథకం ద్వారా లబ్దిదారులు తమ ఇంట్లో తయారైన కరెంటును అమ్ముకోవచ్చని, ముద్ర పథకం కింద ఇచ్చే రుణాన్ని రూ.20 లక్షలు చేస్తామని, చిరు వ్యాపారులకు వడ్డీల బాధ తొలగిస్తామని పేర్కొన్నారు.
వచ్చే ఐదేండ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేస్తాం. పెద్ద సంఖ్యలో డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెంపు, కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, వ్యవసాయ రంగంలో డ్రోన్‌ల వినియోగం, భారత్‌ను గ్లోబల్‌ న్యూటిషన్‌ హబ్‌గా మారుస్తామని ప్రకటించారు. ”శ్రీ అన్న్‌ రకం పండించడం ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహిస్తాం. భారత్‌ను ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌గా మారుస్తాం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వల్ల గ్రామాల ఆదాయం పెరుగుతుంది. నానో యూరియా వినియోగం మరింత పెంచుతాం” అని అన్నారు.
”భారత్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుస్తాం. ఏజెన్సీల్లో పర్యాటకం ప్రోత్సహించి గిరిజనులకు మేలు చేస్తాం. ‘సోషల్‌, డిజిటల్‌, ఫిజికల్‌ రంగాల్లో మౌలిక వసతులు పెంచుతాం. దేశంలో అనేక చోట్ల శాటిలైట్‌ పట్టణాలు నిర్మిస్తున్నాం. విమానయాన రంగాన్ని ప్రోత్సహించి లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. త్వరలో వందే భారత్‌ స్లీపర్‌, వందే భారత్‌ మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తాయి. దేశం నలుమూలల బుల్లెట్‌ రైళ్లు తెస్తాం. దక్షిణ, ఉత్తర, తూర్పు వైపు కూడా బుల్లెట్‌ రైలు మార్గాలు వేస్తాం. భారత్‌ను గ్రీన్‌ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రానిక్‌, ఆటోమొబైల్‌, సెమీ కండక్టర్‌ హబ్‌గా మారుస్తాం” అని పేర్కొన్నారు.
సంకల్ప్‌ పత్ర్‌లోని 14 అంశాలు..
1. విశ్వబంధు
2. సురక్షిత భారత్‌
3. సమృద్ధ భారత్‌
4. గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌
5. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు
6. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌
7. సాంస్కృతిక వికాసం
8. గుడ్‌ గవర్నెన్స్‌
9. స్వస్థ భారత్‌
10. అత్యుత్తమ శిక్షణ
11. క్రీడా వికాసం
12. సంతులిత అభివృద్ధి
13. సాంకేతిక వికాసం
14. సుస్థిర భారత్‌

Spread the love