– ఎలక్టోరల్ బాండ్లతో ప్రజల్లో ఇప్పటికే మోడీకి నెగెటివ్ మార్క్
– దేశంలో నిరుద్యోగం.. ఆకలి సూచీ..పోషకాహార లోపం
– పలు సూచీల్లో భారత్ వెనకంజే
– బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదు : విశ్లేషకులు, నిపుణుల అంచనా
అవినీతి విషయంలో తనకు ఇంకా తగినంత క్రెడిట్ ఉన్నదనీ, ప్రజల మనోగతాన్ని మార్చగలననుకుంటున్న మోడీ.. తమ(ఆయన, బీజేపీ) గురించి ఎక్కువగా ఊహించు కుంటున్నారనీ, ఎన్నికల బాండ్ల వంటి అనేక అంశాలు రాబోయే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ‘చార్ సౌ పార్’ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న మోడీ అతి విశ్వాసానికి తోడు.. ఆయనకు భజన చేసే ప్రధాన స్రవంతి మీడియా, సోషల్ మీడియాలు ప్రజల్లో అబద్దపు వార్తలతో ఒక ఊహాజనిత ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయని అంటున్నారు.
న్యూఢిల్లీ : తాను ఏది చేసినా దేశ ప్రజలు విశ్వసిస్తారనే భ్రమలో ప్రధాని మోడీ ఉన్నారనీ, అయితే.. దేశ ప్రజల ఆలోచన మాత్రం భిన్నంగా ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మోడీపై దేశ ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారనీ, ఈ సారి వారు మార్పును కోరుకుంటున్నారని చెప్తున్నారు. ఇప్పటికే దేశంలో ఎలక్టోరల్ బాండ్ల(ఈబీ) పథకం కేంద్రంలోని అధికార బీజేపీకి ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సమాచార బహిర్గతం మోడీ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం అని కొందరు రాజకీయ నాయకులు ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని అభివర్ణిస్తున్న విషయం విదితమే. బాండ్ల ద్వారా కాషాయయపార్టీకి వివిధ సంస్థలు, కంపెనీల (ఇందులో చాలా వరకు కేంద్ర దర్యాప్తు సంస్థ ల విచారణను ఎదుర్కొంటున్నవి కూడా ఉన్నాయి) ద్వారా రూ.6 వేల కోట్లకు పైగా సమకూరాయి. ఇది దేశంలోని ఏ ఇతర రాజకీయ పార్టీకి సమకూరిన దాని కంటే అధికం కావటం గమనార్హం. ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని తీసుకొచ్చిన మోడీ సర్కారు.. దానిలో గోప్యతను పాటించింది. అయితే, పలు సంస్థలు, కంపెనీలను దర్యాప్తు సంస్థల ద్వారా బెదిరించి, నిధులను పొందే ఉద్దేశంతోనే మోడీ సర్కారు అలా చేసి ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అయితే, సర్వోన్నత న్యాయస్థానం రంగప్రవేశంతో మోడీ సర్కారు ప్రయత్నాలు ఫలించలేదనీ, చివరకు ఆ పార్టీ అసలు బాగోతం ఎస్బీఐ సమాచార వెల్లడితో బయటపడిందని చెప్తున్నారు.
400కు పైగా సీట్లను గెలవాలనుకుంటున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు అది సాధ్యమయ్యే పనే కాదని సాక్షాత్తూ ఆ పార్టీకి అనుకూలంగా వార్తలను ప్రసారం చేసే మీడియా సంస్థ లూ చెప్తున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అయితే, రాబోయే రోజుల్లో బాండ్స్ స్కీమ్‌కి సంబంధించి మరిన్ని కఠిన విషయాలు బహిర్గతమవుతాయని అంచనా వేస్తున్నారు. వారంట్ లేకుండా విదేశీ నిధులను స్వీకరిం చినందుకు ప్రభుత్వం కొన్ని ఎన్జీవోలను రద్దు చేసిందనీ, అలాంటి చర్యలు బాధ్యత గల రాజకీయ పార్టీపై ఎందుకు ఉండకూడదని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నా రు. ఈ విషయంలో అధికార పార్టీగా బీజేపీ నైతిక విలువలు పాటించలేదనీ, నిధుల సేకరణే ధ్యేయంగా అడ్డదారులను ఆశ్రయించి ఈబీల ద్వారా లబ్ది పొందిందని గుర్తు చేస్తున్నారు.
వికాస్(అభివృద్ధి) ఎక్కడీ
‘సబ్‌కా సాత్.. సబ్ కా విశ్వాస్..’ అంటూ నినాదాలిచ్చే మోడీ.. దేశంలోని అభివృద్ధిని మరిచి.. పార్టీ ‘వికాసం’ కోసమే దృష్టిని సారించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య 271కి పెరిగితే, 60 శాతం కంటే ఎక్కువ మంది పౌరులు నిజమైన పేదరికాన్ని ఎదుర్కొంటున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో దాదాపు 81 కోట్ల మంది భారతీయులకు ఉచిత రేషన్‌ను అందిస్తున్నామన్న ప్రభుత్వ గణాంకాలే దేశ ప్రజల పేదరిక స్థాయిలను నిర్వచిస్తున్నాయని అంటున్నారు.
తలసరి ఆదాయం, నిరుద్యోగం శాతం, పోషకాహార లోపం, పిల్లలలో కుంటుపడిన పెరుగుదల, ప్రపంచ ఆకలి సూచీలో భారత ర్యాంకింగ్, మహిళల్లో రక్తహీనత, వినియోగ వస్తువుల ధరలకు సంబంధించిన గణాంకాలు ఇప్పుడు అందరికీ తెలిసిన సూచికలుగా మారాయనీ, వీటిలో భారత ప్రదర్శన అత్యంత దారుణంగా ఉన్నదని పలు గణాంకాలు, నివేదికలను నిపుణులు ఉటంకిస్తున్నారు. ఇలాంటి అంశాలు దూరం పెట్టి.. అయోధ్య, కాశ్మీర్ వంటి భావోద్వేగ, మత అంశాలతో బీజేపీ గట్టెక్కాలని భావిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే, భారత్.. ప్రజాస్వామ్య దేశంగా ఉంటుందా? లేదా నియంతృత్వం వైపు పయనిస్తుందా? అనేది రాబోయే సాధారణ ఎన్నికల్లో ప్రజా తీర్పు పైనే ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో మోడీ ఆశలు అడియాశలవుతాయనీ, బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగులుతుందని వారు అంచనా వేస్తున్నారు.