కలిసి పనిచేద్దాం.. గెలిచి చూపిద్దాం

Let's work together.. Let's win and show– ఉమ్మడి నల్లగొండకు ప్రియాంక గాంధీ
– వచ్చే నెలలో మిర్యాలగూడ, చౌటుప్పల్‌లో సభలు
– ప్రచారానికి నాతోపాటు కోమటిరెడ్డి బ్రదర్స్‌
– జనగామలో కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ పక్కా
– ఈ నెల 21న చామల నామినేషన్‌ దాఖలు
– భువనగిరి ప్రచార వ్యూహంపై సీఎం రేవంత్‌రెడ్డి దిశా నిర్దేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వచ్చే నెల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ రానున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆ సందర్భంగా ఒకే రోజు మిర్యాలగూడ, చౌటుప్పల్‌ పట్టణాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. అందుకనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని నేతలను ఆదేశించారు. భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 21న నామినేషన్‌ దాఖలు చేస్తారని తెలిపారు. ఆ కార్యక్రమానికి తాను కూడా వస్తాననీ, తనతోపాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాజరవుతారని వివరించారు. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని జనగామకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లేరనీ, అయినా ఎవరూ అధైర్యపడొద్దనీ, అక్కడి నుంచి కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నివాసంలో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రచార వ్యూహాంపై దిశా నిర్దేశం చేశారు. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ ప్రచార బాధ్యతలు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అప్పగిస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గెలుపు కోసం ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా పని చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ఆరు గ్యారంటీలను ప్రతి గడపకూ తీసుకెళ్లి ప్రచారం చేయాలని కోరారు. భువనగిరి కోమటిరెడ్డి బ్రదర్స్‌ కంచుకోట అని గుర్తు చేశారు. ఈ టిక్కెట్‌ను కోమటిరెడ్డి కుటుంబం ఆశించిందనీ, కానీ అధినాయకత్వం ఎవరికి ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తామని ఆ కుటుంబ సభ్యులు హామీ ఇచ్చారని తెలిపారు. జనగామ కో ఆర్డినేషన్‌ బాధ్యతను డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి చూసుకుంటారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పర్యటనలు కూడా ఉంటాయని చెప్పారు. సమావేశంలో భువనగిరి ఎంపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజగోపాల్‌రెడ్డి, అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేల్‌, వేముల వీరేశం, మల్‌రెడ్డి రంగారెడ్డి, బీర్ల ఐలయ్యతోపాటు ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
త్వరలో ఇందిరమ్మ కమిటీలు…ప్రతి సభ్యుడికి రూ 6 వేల వేతనం
కాంగ్రెస్‌ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చే విధంగా ఇందిరమ్మ కమిటీలు పని చేస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. త్వరలో ఆ కమిటీలను నియమిస్తామనీ, ప్రతి సభ్యుడికి రూ. 6వేల గౌరవ వేతనం ఇస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికలు ముగియగానే జూన్‌ మాసంలో సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బూత్‌లో మోజార్టీని బట్టి టిక్కెట్లు ఇస్తామన్నారు. అన్ని స్థాయిల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత మిగతా నాలుగేండ్లు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తామని సీఎం వివరించారు.
17 నియోజవర్గాలకు హాజరవుతా: రేవంత్‌
రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి హాజరవుతానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అదే రోజు ఆయా నియోజకవర్గాల్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల 21న భువనగిరి అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమానికి హాజరు కానున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్‌లో చేరిన పలువురు నేతలు
పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బుధవారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో వీరంతా కాంగ్రెస్‌ గూటికి చేరారు. కంటోన్మెంట్‌ మాజీ వైస్‌ చైర్మెన్‌ జంపన ప్రతాప్‌, మేడ్చల్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ రమేష్‌, 11 మంది కౌన్సిలర్లు పార్టీలో చేరారు.
మహాత్మాజ్యోతిబా ఫూలే స్ఫూర్తితో వినూత్న కార్యక్రమాలు : సీఎం రేవంత్‌
మహాత్మా జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నదని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన్ను స్మరించుకున్నారు. ఫూలే త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వెనుకబడిన వర్గాలు, దళిత జనోద్ధరణకు ఆయన ఎంచుకున్న బాట, అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సును కాంక్షించే వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నదని ఈ సందర్భంగా తెలిపారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే ప్రగతి భవన్‌కు మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు పెట్టి ప్రజా భవన్‌గా మార్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నామని వివరించారు. ఫూలే జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని వివరించారు.
నేడు ఢిల్లీకి రేవంత్‌
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 14 సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం… మరో మూడు సీట్లను పెండింగ్‌లో ఉంచింది. ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ అభ్యర్థులపై అధిష్టానం తో సీఎం చర్చించనున్నారు. రంజాన్‌ పండుగను పురస్కరించుకుని గురువా రం ఉదయం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ నివాసానికి సీఎం వెళ్లనున్నారు. అక్కడి నుంచి నేరుగా రేవంత్‌ ఢిల్లీకి బయలుదేరనున్నారు.

Spread the love