కవిత అరెస్టు పొలిటికల్‌ డ్రామా

Kavitha arrested A political drama– అది మోడీ, కేసీఆర్‌ ముందస్తు స్క్రిప్ట్‌
– పార్లమెంటు ఎన్నికల్లో సానుభూతి కోసమే..
– కూతుర్ని అరెస్టు చేస్తే తండ్రి స్పందించడా…?
– ఈసారి మోడీ- ఈడీ కలిసేవచ్చారు
– పార్లమెంట్‌ ఎన్నికలు మాకు రిఫరెండమే…:
– మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు ఓ పొలిటికల్‌ డ్రామా అని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి కొట్టిపారేశారు. పార్లమెంటు ఎన్నికల్లో సానుభూతి కోసం బీఆర్‌ఎస్‌, అవినీతిపై చర్యలు తీసుకున్నాం అని చెప్పుకుని ఓట్లు రాబట్టుకోవాలని బీజేపీ పడుతున్న తాపత్రయం, ఆడుతున్న నాటకాలు తప్ప దీనిలో ఇంకేం లేదని తేల్చిచెప్పారు. గడచిన పదేండ్లలో ప్రజలకు ఏం చేశామో చెప్పుకొనే పరిస్థితి మోడీకి లేదనీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ఏం చేశారో ప్రజలకు అర్థం అయ్యిందనీ, అందుకే ఎన్నికలకు ముందు సెంటిమెంట్‌ డ్రామాకు తెరతీశారని విమర్శించారు. ”కూతుర్ని అరెస్టు చేస్తే తండ్రి స్పందించకపోవడం విచిత్రంగా ఉందన్నారు. అలా కాదనుకున్నా ఆమె ఆపార్టీకి చెందిన ఎమ్మెల్సీ. కనీసం పార్టీ అధ్యక్షుడిగా అయినా ఆయన స్పందించాలి కదా” అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌పార్టీ వందరోజుల పాలన సంపూర్ణ తృప్తిని ఇచ్చిందనీ, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం నిరంతరం కృషి చేశామన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలు కచ్చితంగా తమ వంద రోజుల పాలనకు రిఫరెండంగానే భావిస్తున్నామన్నారు. పదేండ్ల మోడీ పాలన, పదేండ్ల కేసీఆర్‌ పాలన, వందరోజుల కాంగ్రెస్‌ పాలన రిపోర్టులన్నీ ప్రజల ముందు ఉన్నాయనీ, ప్రజలు వాటిని చూసి ఎవర్ని గెలిపించాలో నిర్ణయిస్తారని చెప్పారు. సర్వేలన్నీ రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ 12 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్తున్నాయనీ, అందుకే మోడీ, ఈడీ, కేసీఆర్‌ కలిసే అరెస్టుల డ్రామాకు తెరలేపారని అన్నారు. గతంలో ఈడీ వచ్చాక మోడీ వచ్చేవారనీ, ఈ సారి మోడీ ఈడీ కలిసే రాష్ట్రానికి వచ్చారనీ, మోడీ కనుసన్నల్లోనే ఈడీ పనిచేస్తుందనడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నమోదైన మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్టు జరిగిందనీ, మరి పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న బీజేపీ నేతలు కేసీఆర్‌పై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఈ నాటకం వెనుక రాజకీయంగా కాంగ్రెస్‌ను దొంగదెబ్బ తీయాలనే ఎత్తుగడ ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవహేళన చేసిన మోడీకి, తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించే అర్హత కూడా లేదన్నారు. సాగునీరు, విద్యుత్‌రంగాల వ్యవహారాలపై న్యాయవిచారణకు ఆదేశించామన్నారు. వేలకోట్ల రూపాయల దోపిడీలో బినామీలుగా ఎవరో అనామకుల్ని పెట్టి, వారిని అరెస్టులు చేస్తే సరిపోతుందని తాము భావించట్లేదని స్పష్టం చేశారు. తమకు తీగ దొరికిందనీ, డొంక కదిలిస్తున్నామని చెప్పారు. దేశ సార్వభౌమాధికారాన్నే సవాలు చేసిన కసబ్‌ వంటి ఉగ్రవాదికి ఉరివేయాలన్నా విచారణ చేసే శిక్షలు వేశారనీ, విచారణ లేకుండా తాము ఎవర్నీ శిక్షించబోమన్నారు. దీనిలో కక్షసాధింపు చర్యలు ఉండవనీ, చట్ట పరిధిలో విచారణ చేసి శిక్షలు వేస్తామన్నారు. కవిత అరెస్టు సమయంలో మాజీ మంత్రి టీ హరీశ్‌రావు చేతులు కట్టుకొని నించున్నారనీ, ఇవాళ ఇట్లైంది…రేపు ఎట్లయితదో అనే ఆందోళనలో ఆయన ఉన్నారని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌, బీజేపీ నేత డాక్టర్‌ లక్ష్మణ్‌ ఒకే తరహా ప్రకటనలు చేశారనీ, అలాంటి పరిస్థితే వస్తే చూస్తూ ఊరకోబోమని హెచ్చరించారు. ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీతో కలిసి కుట్రలు చేస్తున్నారనీ, అదే జరిగితే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటామని భరోసా ఇస్తున్నారని వివరించారు. ”ముఖ్యమంత్రిగా నా పని నేను చేసుకుపోతున్నా…ప్రతిపక్షంగా మీరేం చేయాలో చేసుకోండి. బింకాలు, పొంకనాల కోసం మాట్లాడితే నష్టం లేదు. అలాకాకుండా నా కాళ్లలో కట్టెపెట్టి పడగొట్టాలని భావిస్తే, ఆ పరిణామాలు ఏంటో నేనూ చూపిస్తా” అని తీవ్రంగా హెచ్చరించారు.
రాష్ట్రంలో పదేండ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. తన భాషపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ… ”కేసీఆర్‌ ముఖ్యమంత్రి స్థాయిలో గతంలో తమపార్టీ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో సోషల్‌ మీడియాలో పెడతాం… చూడండి…ఆయన అహంకారం ఇంకా అణగలేదు” అని అన్నారు. బీఆర్‌ఎస్‌ అనేది మోడీ ఏర్పాటు చేసుకున్న ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్‌ అని ఆరోపించారు. ఎలక్టోరల్‌ బాండ్లపై పూర్తి వివరాలు వచ్చాక కాంగ్రెస్‌పార్టీగా మాట్లాడతామన్నారు. దేశానికి తొలిసారి దళితుడిని రాష్ట్రపతిని చేసింది కాంగ్రెస్‌ పార్టీనే అనీ, తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా దళితుడే అని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్‌కు మూడేండ్ల పదవీకాలం ఉండగా, లక్ష రూపాయల లంచం కేసు పేరుతో ఏడాదిలోనే పదవిలోంచి తప్పించి, అవమానించారని గుర్తుచేశారు. బంగారు లక్ష్మణ్‌ కుమార్తె తన వద్దకు వచ్చి ఏం చెప్పిందో తాను ఇక్కడ ప్రస్తావించదలుచు కోలేదనీ, వారి కుటుంబానికి గౌరవం ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వ పాపాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. సమా వేశంలో మంత్రులు పొన్నంప్రభాకర్‌, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ పాల్గొన్నారు.

Spread the love