ఎలా ఉన్నావమ్మా..

How are you..– కవితను కలిసిన కేటీఆర్‌
– నేడు కోర్టులో హాజరుపర్చనున్న సీబీఐ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంపై సీబీఐ కస్టడీలో ఉన్న కవితను సోదరుడు కె.తారకరామారావు కలిశారు. ఢిల్లీ లోధి రోడ్‌ – జవహర్‌ లాల్‌ నెహ్రు మార్గ్‌ లోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో కవిత భర్త అనిల్‌, న్యాయవాది మోహిత్‌ రావులతో కలిసి కేటీఆర్‌ కవితను సాయంత్రం ఆరు గంటలకు కలిశారు. దాదాపు 40 నిమిషాలకు పైగా కవితో మాట్లాడారు. తమ విచారణలో సీబీఐ అడుగుతోన్న ప్రశ్నలపై ఆరా తీశారు. అలాగే ఎంటి పరిస్థితు ల్లో మనోధైర్యం వీడొద్దని, తాము తోడుగా ఉంటామని ధైర్యం చెప్పారు. సోమ వారం ట్రయల్‌ కోర్టు ముందు హాజరుపరిచే సందర్భంలో కోర్టు దృష్టికి తెచ్చే అంశాలపై చర్చించారు. అనంతరం భర్త అనిల్‌ తో కవిత కాసేపు మాట్లాడారు.
సుదీర్ఘంగా విచారణ..
కవితను ఆదివారం సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు దఫాలుగా ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. లిక్కర్‌ స్కాంలో సంబంధమే లేకపోతే… అరబిందో కంపెనీ డైరెక్టర్‌ శరత్‌ చంద్రా రెడ్డితో జరిగిన లావా దేవీల సంగతి ఏంటనీ ప్రశ్నించారు. మహబూబ్‌ నగర్‌ లోని రూ.14 కోట్ల వ్యవసాయ భూమిని శరత్‌ చంద్రారెడ్డి కొనుగోలు చేసేలా ఎందుకు ఒత్తిడి చేశారని ఆరా తీశారు. అది కూడా నిజం కాకపోతే.. శరత్‌ చంద్రా రెడ్డికి చెందిన అరబిందో గ్రూప్స్‌ ఆఫ్‌ కంపెనీ మహిర వెంచర్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ నుంచి ఈ కొనుగోలు జరిగింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ అంశాలను పక్కన పెడితే… తెలంగా ణ జాగృతి కి సీఎస్‌ఆర్‌ రూంలో శరత్‌ చంద్రా రెడ్డి ఇచ్చిన రూ. 80 లక్షలపై పలు ప్రశ్నలు సందించారు. 2021 మార్చిలోనే అరబిందో రియాలిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ ద్వారా జరిగిన బ్యాంక్‌ ట్రాంజక్షన్స్‌ ను కవిత ముందు పెట్టారు. మరోవైపు రౌస్‌ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన కస్టడీ సమయం ఆదివారంతో ముగియడంతో… కవితను సోమవారం ఉదయం 10 గంటలకు సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరుచనున్నారు.

Spread the love