తగ్గిన అటవీ భూమి

Reduced forest land– 2000 నుంచి కోల్పోయిన మొత్తం 2.33 మిలియన్‌ హెక్టార్లు
– గ్లోబల్‌ ఫారెస్ట్‌ వాచ్‌ డేటా
– పర్యావరణవేత్తల ఆందోళన
అసోం గరిష్టంగా 324,000 హెక్టార్ల నష్టాన్ని నమోదు చేసింది. తర్వాతి స్థానాల్లో ఉన్న మిజోరం (312,000 హెక్టార్లు), అరుణాచల్‌ ప్రదేశ్‌ (262,000 హెక్టార్లు), నాగాలాండ్‌ (259,000 హెక్టార్లు), మణిపూర్‌ (240,000 హెక్టార్లు)లు లక్షలాది హెక్టార్ల అటవీ విస్తీర్ణాన్ని కోల్పోయాయి.
న్యూఢిల్లీ : భారత్‌లో అడవుల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతున్నది. లాభార్జనే ధ్యేయంగా కార్పొరేట్లు, బడా పారిశ్రామికవేత్తలు అటవీ భూముల విషయంలో వారి ఇష్టారాజ్యంగా వ్యవహరించటం, నియంత్రించాల్సిన ప్రభుత్వాలే వారికి అనుకూలంగా చట్టాలు తీసుకొస్తుండటంతో ఆందోళనకర పరస్థితులు నెలొకొన్నాయి. ముఖ్యంగా, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పారిశ్రామికవేత్తలు అటవీ భూములను చెరబట్టంతో అక్కడి ఆదివాసీలు తమ జీవనోపాధితో పాటు హక్కులను కూడా కోల్పోతున్నారు. ఇది క్రమంగా దేశంలో అటవీ భూమి తగ్గుదలకు కారణమవుతున్నది. భారత్‌లో అటవీ విస్తీర్ణం తగ్గిందని గ్లోబల్‌ ఫారెస్ట్‌ వాచ్‌ మానిటరింగ్‌ ప్రాజెక్ట్‌ తన నివేదికలో వెల్లడించింది.
ఈ నివేదిక సమాచారం ప్రకారం.. 2000 నుంచి 2.33 మిలియన్‌ హెక్టార్ల అటవీ విస్తీర్ణాన్ని భారత్‌ కోల్పోయింది. ఈ తగ్గుదల ఆరు శాతానికి సమానం. 2002 నుంచి 2023 వరకు భారత్‌ 4,14,000 హెక్టార్ల తేమతో కూడిన ప్రాథమిక అడవులను (4.1 శాతం) కోల్పోయింది. 2001 నుంచి 2022 మధ్య భారత్‌లోని అడవులు సంవత్సరానికి 51 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ను విడుదల చేశాయనీ, ఏడాదికి 141 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ను తొలగించటం గమనార్హం.
భారతదేశంలో చెట్లను కవర్‌ చేసే (అటవీ విస్తీర్ణ) నష్టం ఫలితంగా సగటున సంవత్సరానికి 51.0 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ సమానమైన వాతావరణంలోకి విడుదలైంది. మొత్తంగా, ఈ కాలంలో 1.12 గిగా టన్నులకు సమానమైన కార్బన్‌ డయాక్సైడ్‌ ఉత్పన్నమైంది. భారత్‌లో 2013 నుంచి 2023 వరకు 95 శాతం చెట్ల కవర్‌ నష్టం సహజ అడవుల్లోనే సంభవించింది. 2017లో గరిష్టంగా 189,000 హెక్టార్ల అటవీ విస్తీర్ణ నష్టం జరిగింది. 2016లో 175,000 హెక్టార్లు, 2023లో 144,000 హెక్టార్ల చెట్లను కోల్పోయింది. ఇది గత ఆరేండ్లలో అత్యధికం. 2001 నుంచి 2023 మధ్య మొత్తం చెట్ల కవర్‌ నష్టంలో 60 శాతం.. ఐదు రాష్ట్రాల నుంచే ఉన్నాయి.
అయితే, భారత్‌లో అటవీ విస్తీర్ణం తగ్గిన పరిస్థితులపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలకు ముందు చూపు లోపించటం, పర్యవేక్షణ లేకపోవటం కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని వారు అంటున్నారు. అటవీ సంరక్షణ విషయంలో ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలనీ, చట్టాలను తప్పకుండా అమలు చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా…
ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ప్రకారం.. భారత్‌లో అటవీ నిర్మూలన రేటు 2015 నుంచి 2020 మధ్య సంవత్సరానికి 668,000 హెక్టార్లుగా ఉన్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా రెండో అత్యధిక నిర్మూలన రేటు కావటం గమనార్హం. 2002 నుంచి 2022 వరకు అగ్నిప్రమాదాల కారణంగా భారత్‌ 35,900 హెక్టార్ల చెట్లను కోల్పోయిందనీ, 2008లో అగ్నిప్రమాదాల (3,000 హెక్టార్లు) కారణంగా అత్యధికంగా నష్టం నమోదైందని డేటా వివరించింది. 2001 నుంచి 2022 వరకు, ఒడిశాలో అగ్నిప్రమాదాల కారణంగా అత్యధికంగా చెట్లు క్షీణించాయి. సగటున సంవత్సరానికి 238 హెక్టార్ల నష్టం వాటిల్లింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ 198 హెక్టార్లు, నాగాలాండ్‌ 195 హెక్టార్లు, అసోం 116 హెక్టార్లు, మేఘాలయ 97 హెక్టార్లు నష్టపోయాయి.

Spread the love