హర్యానాలో రాజకీయ సంక్షోభం

Political crisis in Haryana– మెజారిటీ కోల్పోయిన బీజేపీ సర్కార్‌
– ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికలు జరపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌
– కుర్చీ వదలబోనన్న సీఎం సైనీ
చండీఘర్‌ : హర్యానాలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ శిబిరంలో చేరడంతో హర్యానా రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం 88 మంది సభ్యులున్న రాష్ట్ర శాసనసభలో బీజేపీకి 43 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. ప్రభుత్వం మైనారిటీలో పడినందున వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉదరు భాన్‌ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. ఇదిలావుండగా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన ముగ్గురు స్వతంత్రులు రోతక్‌లో ప్రతిపక్ష నేత భూపేందర్‌ సింగ్‌ హూడాతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న విషయాన్ని రాష్ట్ర గవర్నరుకు తెలియజేశామని వారు చెప్పారు.
బీజేపీకి మద్దతు ఇస్తున్న 43 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు స్వతంత్రులు కూడా ఉన్నారు. అవసరమైతే ప్రభుత్వానికి వ్యూహాత్మక మద్దతు ఇస్తామని నలుగురు సభ్యులున్న జన్‌నాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) చెబుతోందని బీజేపీ అంటోంది. అయితే తాము ప్రతిపక్ష నేత భూపేందర్‌ సింగ్‌ హూడాకే మద్దతు ఇస్తామని జేజేపీ నేత దుష్యంత్‌ చౌతాలా తేల్చి చెప్పడంతో బీజేపీ ఆశలు అడియాసలయ్యాయి. జేజేపీ మార్చిలోనే బీజేపీ ప్రభుత్వం నుండి బయటికి వచ్చింది. నాయబ్‌ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్‌ ముందుకు వచ్చిన పక్షంలో తాము మద్దతు ఇస్తామని జేజేపీ స్పష్టం చేసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్‌ మాత్రమేనని దుష్యంత్‌ చౌతాలా చెప్పారు. రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్ధ్యం నాయబ్‌కు లేదని అన్నారు. తాను బలహీనుడినని ఆయన అంగీకరించారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని జేపీపీతో పాటు అభరు సింగ్‌ చౌతాలా నేతృత్వంలోని ఐఎన్‌ఎల్‌డీ, స్వతంత్ర ఎమ్మెల్యే బల్‌రాజ్‌ కుందు కూడా గవర్నర్‌కు లేఖలు రాయాలని ఉదరు భాన్‌ సూచించారు. ఇదిలావుండగా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు స్వతంత్ర ఎమ్మెల్యేలు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స్పీకర్‌ జ్ఞాన్‌ చంద్‌ గుప్తా తెలిపారు. ప్రతిపక్షాల డిమాండ్‌పై నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. ఇప్పటికి కూడా బీజేపీకి 40, కాంగ్రెస్‌కు 30, జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఆరుగురు స్వతంత్ర సభ్యులు ఉన్నారని వివరించారు. హెచ్‌ఎల్‌పీ, ఐఎన్‌ఎల్‌డీ పార్టీల నుండి ఒక్కొక్క సభ్యుడు ఉన్నారని అన్నారు. మరోవైపు తన ప్రభుత్వం కొనసాగుతుందని, ఎలాంటి సమస్యలు లేవని ముఖ్యమంత్రి నాయబ్‌ సైనీ ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా తమకు 47 మంది సభ్యుల మద్దతు ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ మీడియా కార్యదర్శి ప్రవీణ్‌ ఆగ్రే చెప్పుకొచ్చారు. అయితే శాసనసభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఇప్పట్లో లేదు. ఎందుకంటే ఫిబ్రవరి 23న సైనీ ప్రభుత్వంపై భూపేందర్‌ సింగ్‌ హూడా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తాజాగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే ఆరు నెలల వ్యవధి అవసరం. అయితే ఇది బలపరీక్షకు సంబంధించిన అంశం కాదని, నైతికతకు సంబంధించినదని హూడా చెప్పారు.

Spread the love