ఫేజ్‌ 3లో కీలక స్థానాలు

– పలు సీట్లలో ప్రముఖుల పోటీ
– బరిలో ఇద్దరు కేంద్ర మంత్రులు..
– మరో ఇద్దరు మాజీ సీఎంలు కూడా
– ఆసక్తిని రేపుతున్న ఎన్నికలు
– 12 రాష్ట్రాలు, యూటీలలో 94 స్థానాలకు పోలింగ్‌
న్యూఢిల్లీ:
దేశంలో లోక్‌సభ ఎన్నికల మూడో దశ మే 7న జరగనున్నది. 10 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ)ను కవర్‌ చేస్తూ మొత్తం 94 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో పలు కీలక స్థానాల్లో ముఖ్య నేతలు బరిలో ఉన్నారు. దీంతో మూడో దశ ఎన్నికల్లో ఈ నేతల పోటీ ఆసక్తిని కలిగిస్తున్నది. లోక్‌సభ ఎన్నికలలో మొదటి రెండు దశల ముగింపుతో, ఫేజ్‌ 1లో 66.14 శాతం, ఫేజ్‌ 2లో 66.71 శాతం ఓటింగ్‌ నమోదైన విషయం తెలిసిందే. మూడో దశలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో అసోం (4 సీట్లు), బీహార్‌ (5 ), ఛత్తీస్‌గఢ్‌ (7), గోవా (2), గుజరాత్‌ (26), కర్నాటక (14), మధ్యప్రదేశ్‌ (8), మహారాష్ట్ర (11), యూపీ (10), పశ్చిమ బెంగాల్‌ (4), దాద్రా నగర్‌ హవేలీ, డామన్‌ మరియు డయ్యూ (2)లు ఉన్నాయి.
గుణ నుంచి జ్యోతిరాదిత్య సింధియా
ఒక వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా అధికార బీజేపీ దాని సిట్టింగ్‌ స్థానమైన గుణ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని మార్చింది. అక్కడ, దాని ప్రస్తుత ఎంపీ స్థానంలో సంపన్నుడు, రాచరిక, రాజకీయ కుటుంబ వారసత్వం కలిగిన అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాను ఎంపిక చేసింది. 2019లో బీజేపీకి చెందిన కృష్ణ పాల్‌ సింగ్‌ యాదవ్‌పై కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సింధియా 1,25,549 ఓట్ల తేడాతో ఓటమి చెందాడు. ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా 2023లో కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మాజీ ప్రముఖుడు రావ్‌ యాదవ్‌వేంద్ర సింగ్‌ యాదవ్‌తో ఎన్నికల బరిలోకి దిగనున్నారు.
బీజేపీ సంపన్న అభ్యర్థి పల్లవి డెంపో
పారిశ్రామికవేత్త, గోవాలోని ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన పల్లవి డెంపో.. దక్షిణ గోవా నియోజకవర్గంలో బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. మూడో దశ ఎన్నికల్లో రూ.1,361 కోట్లకు పైగా ఆస్తులతో అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో గోవా నుంచి బీజేపీ పోటీ చేసిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందడం గమనార్హం. 2019 సార్వత్రిక ఎన్నికలలో, దక్షిణ గోవా నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌కు చెందిన ఫ్రాన్సిస్కో సర్దిన్హా.. బీజేపీ అభ్యర్థి నరేంద్ర కేశవ్‌ సవైకర్‌ను 9,755 ఓట్ల తేడాతో ఓడించి కైవసం చేసుకున్నారు.
నాలుగో సారి ప్రహ్లాద్‌ జోషి గురి
ధార్వాడ్‌ నుంచి ఇప్పటికే మూడుసార్లు ఎంపీగా ఉన్న ప్రహ్లాద్‌ జోషి.. బీజేపీ టికెట్‌పై మళ్లీ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ అను భవం లేని వినోద్‌ అసూటిని.. జోషి ఎదుర్కోనున్నారు. ప్రహ్లాద్‌ జోషి.. 2009, 2014 ఎన్నికల్లో రెండింటిలోనూ లక్షకు పైగా ఓట్లతో గెలిచాడు. 2019లో ఈ ఓట్ల తేడా రెండు లక్షలకు పైగా నమోదైంది. ఆ తర్వాత 2019, మే 30 నుంచి ప్రహ్లాద్‌ జోషి.. కేంద్ర పార్లమెంటరీ వ్యవ హారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.
మెయిన్‌పురి నుంచి అఖిలేశ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్‌
యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌.. సమాజ్‌ వాదీ పార్టీ(ఎస్పీ) కి బలమైన కోటగా ఉన్న మెయిన్‌పురి సిట్టింగ్‌ ఎంపీ. 2024 లోక్‌సభ ఎన్ని కలలో మెయిన్‌పురి స్థానంలో గెలవాలని అధికార బీజేపీ చూస్తున్నది. ఇందులో భాగంగా, డింపుల్‌ యాదవ్‌పై ఠాకూర్‌ జైవీర్‌ సింగ్‌ను పోటీలో నిలబెట్టింది. 2019 లోక్‌ సభ ఎన్నికల్లో మెయిన్‌పురి నుంచి అప్పటి ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌.. 94,389 ఓట్ల తేడాతో గెలు పొందారు. బీజేపీ అభ్యర్థి ప్రేమ్‌ సింగ్‌ షాక్యాను ఓటమి చెందారు.
బహరంపూర్‌ నుంచి అధీర్‌ రంజన్‌ చౌదరి
కాంగ్రెస్‌ కీలక నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌదరి 2009 నుంచి 2019 వరకు మూడు పర్యాయాలు బహరంపూర్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత మూడు లోక్‌సభ ఎన్నికలను పరిశీలిస్తే, అధిర్‌ రంజన్‌ భారీ మెజార్టీతో గెలిచారు. 2019లో తృణమూల్‌ కాంగ్రెస్‌కి చెందిన అపూర్బా సర్కార్‌ (డేవిడ్‌)పై 80,696 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014లో తృణమూల్‌ అభ్యర్థి ఇంద్రనీల్‌ సేన్‌పై అత్యధికంగా 156,567 ఓట్లతో గెలుపొందారు. ఈసారి, ఆయన బీజేపీ నూతన అభ్యర్థి నిర్మల్‌ సాహా, తృణమూల్‌ నుంచి భారత మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌తో తలపడుతున్నారు.
ధుబ్రి నుంచి బద్రుద్దీన్‌ అజ్మల్‌
ఆలిండియా యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(ఏఐయూడీఎఫ్‌) అధ్యక్షుడు బద్రుద్దీన్‌ అజ్మల్‌.. 2009 సార్వత్రిక ఎన్నికల నుంచి ధుబ్రి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది ఆ పార్టీకి బలమైన స్థానం. 2009లో తొలిసారిగా 76.31 శాతం ఓట్లతో 1.84 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. 2014లో అజ్మల్‌ 5.92 లక్షల ఓట్లు, 43.26 శాతం ఓట్‌ షేర్‌తో మరింత ఎక్కువ మద్దతుతో మళ్లీ గెలుపొందారు. 2019లో 7.18 లక్షలకు పైగా ఓట్లతో, 42.66 శాతం ఓట్లతో హ్యాట్రిక్‌ విజయం సాధించారు. ధుబ్రీ ఫుల్‌బరీ బ్రిడ్జిని నిర్మించటం, రూప్సీ ఎయిర్‌పోర్ట్‌ను ఏర్పాటు చేయటం, ధుబ్రి మెడికల్‌ కాలేజీని నిర్మించటం వంటి అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో నియోజకవర్గంలో అజ్మల్‌ ప్రజాదరణ పొందారు. ఈ ప్రాంతానికి ఆయన చేసిన కృషి గురించి ఆయన చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగాలు కూడా అతని ప్రజాదరణకు దోహదం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
విదిష బరిలో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌
మధ్యప్రదేశ్‌ సీఎంగా 20 ఏండ్ల పాటు పని చేసిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.. విదిశ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి విజయం సాధించినప్పటికీ.. కాషాయపార్టీ అధిష్టానం ఆయనకు సీఎం పదవి ఇవ్వకపోవటంతో.. దాదాపు 20 ఏండ్ల సుదీర్ఘ విరామంతతర్వాత చౌహాన్‌ విదిషలోని తన సొంత గడ్డపైకి పోటీ చేయటానికి వస్తున్నారు. 1991లో మొదటిసారి ఎన్నికలలో శివరాజ్‌సింగ్‌ ఇక్కడ నుంచి గెలిచి.. తన విజయ పరంపరను 2004 వరకు కొనసాగించాడు. ఎన్నికలను బీజేపీకి అనుకూలంగా నడిపించే ముఖ్య ముఖాలలో చౌహాన్‌ ఒకరనీ, ఒక స్థాయిలో కేంద్రంలో బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా మోడీకి పోటీ ఇవ్వచ్చేనే సంకేతాలూ వచ్చాయని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి చెందిన రమాకాంత్‌ భార్గవ ఈ స్థానం నుంచి పోటీ చేసి 5,47,754 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి శైలేంద్ర రమేష్‌చంద్ర పటేల్‌పై విజయం సాధించారు.
రాజ్‌గఢ్‌ నుంచి డిగ్గీరాజా
మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజరు సింగ్‌ మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ రాజ్‌గఢ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన రెండుసార్లు రాజ్‌గఢ్‌ ఎంపీగా ఉన్న రోడ్మల్‌ నగర్‌తో తలపడుతున్నారు. చారిత్రాత్మకంగా ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ 9 ఎన్నికల్లో గెలుపొందగా, జనసంఫ్‌ు-బీజేపీ 6 సార్లు, జనతా పార్టీ రెండుసార్లు గెలుపొందాయి. ఒక స్వతంత్ర అభ్యర్థి ఒకసారి ఈ స్థానం నుంచి గెలిచారు. 1994లో దిగ్విజరు సింగ్‌ సీటును వదులుకున్న తర్వాత, అతని తమ్ముడు లక్ష్మణ్‌ సింగ్‌ 2009 వరకు ఆ స్థానంలో కొనసాగారు. రాజ్‌గఢ్‌ స్థానాన్ని 2009లో కాంగ్రెస్‌కు చెందిన నారాయణ్‌ సింగ్‌ అంబలే తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 2014లో కాంగ్రెస్‌ నుంచి బీజేపీ తిరిగి సీటును కైవసం చేసుకున్నది. 2019లో కూడా రోడ్మల్‌ నగర్‌ వరుసగా విజయం సాధించారు.

బారామతిలో పవార్‌ వర్సెస్‌ పవార్‌
పోటీలో శరద్‌పవార్‌ కూతురు సుప్రియా సూలే
మహారాష్ట్రలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే బారామతి నియోజకవర్గంలో రాజకీయ సమరానికి సిద్ధమైంది. ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ భార్య సునేత్రా పవార్‌తో ఆమె తలపడనున్నది. ఈ పవార్‌ వర్సెస్‌ పవార్‌ పోటీలో ఇప్పటికే పార్టీలో నిలువునా చీలిక వచ్చింది. అజిత్‌ వర్గంకు.. ఎన్సీపీ ఎన్నికల గుర్తు గడియారం వెళ్లటంతో సుప్రియా సూలే ఇప్పుడు కొత్త గుర్తుతో పోటీ చేస్తున్నారు. 2009 నుంచి సూలే.. 1999లో తన తండ్రి శరద్‌ పవార్‌ స్థాపించిన ఎన్సీపీ గడియారం గుర్తును ఉపయోగించి తన కుటుంబం బలమైన కోట నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే, గతేడాది.. శరద్‌ పవార్‌ నేతృత్వంలోని వర్గం పార్టీ చిహ్నంపై నియంత్రణ కోల్పోయింది. 2019 ఎన్నికలలో.. సూలే బారామతి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కంచన్‌ రాహుల్‌ కూల్‌ను 1,65,911 ఓట్ల తేడాతో ఓడించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

Spread the love