నిప్పుల గుండం

– భగభగమంటున్న రాష్ట్రం
– బయటకు రావాలంటే.. అల్లాడుతున్న జనం
– అశ్వాపురంలో 46.7 డిగ్రీలు నమోదు ఇప్పటికే రాష్ట్రంలో 12 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ మరింత పెరిగే అవకాశం : వాతావరణ శాఖ హెచ్చరిక
నవతెలంగాణ- భూపాలపల్లి/కొత్తగూడెం
తెలంగాణలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు ఎండల తీవ్రత మరింతగా పెరిగి పోతుండటంతో జనం ఇంటి నుంచి బయటికి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. గురువారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 46.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో 47 డిగ్రీల మార్క్‌ను దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉమ్మడి కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌.. తదితర జిల్లాల్లో అక్కడకక్కడ తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో 12 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేసవి తీవ్రతను తట్టుకుని ఇంటి నుంచి బయటకు రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు
అశ్వాపురంలో 46.7 డిగ్రీలు నమోదు
వేసవి భానుడి భగభగలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు అల్లాడుతున్నారు. వారం రోజులుగా వేసవి తీవ్రత పెరిగింది. గతం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలు దాటి నమోదవుతున్న తరుణంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఉదయం 9 గంటల నుండే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో వేడి తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో ఉదయం 9 గంటలలోపే కార్యక్రమాలు ముగించేసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాలంటే ప్రజలు అల్లాడి పోతున్నారు. ఒక క్షణం కరెంటు పోయిందంటే ఉక్కపోతతో విలవిలల్లాడుతున్న తీరు కనిపిస్తుంది. చంటి బిడ్డలు ఉన్న ఇంట్లో కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గత వేసవి కాలం కంటే ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న క్రమంలో సామాన్య ప్రజలతో పాటు, వయోవృద్ధులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. అధికారికంగా 47 డిగ్రీలు నమోదు అవుతున్నప్పటికీ 50 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఉన్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మధ్యాహ్నం పూట రోడ్లన్నీ నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కొత్తగూడెం పట్టణానికి వచ్చి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేడి వాతావరణం తట్టుకోలేక నీడ కనిపించిన చోట, చెట్ల కింద సేద తీరుతున్నారు. ఎండాకాలం అధిక వేడి తీవ్రత దృష్ట్యా జిల్లాలో ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్‌ అలర్టు ప్రకటించిన విషయం విధితమే. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో బొగ్గుగని కార్మికులు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్నారు.
నిప్పుల కొలిమిగా.. భూపాలపల్లి జిల్లా
భానుడు నిప్పులు చెరుగుతుండటంతో భూపాలపల్లి జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. జిల్లా వ్యాప్తంగా సాధారణం కన్నా ఐదు డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు అప్రమత్తత స్థాయికి చేరగా, గురువారం మాత్రం హెచ్చరిక స్థాయి (ఆరెంజ్‌ నుంచి రెడ్‌) చేరువకు చేరింది. జిల్లా అంతటా 42.7 నుంచి 44.9 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. అత్యధికంగా కొత్తపల్లిగోరిలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో జిల్లాకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఉదయం 8గంటల నుంచే సూర్య ప్రతాపంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. దాంతో పని ప్రదేశాల్లో కార్మికులు, కర్షకులు ఇబ్బంది పడుతుండగా, పిల్లలు, వృద్ధులు ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. విద్యుత్‌ వినియోగం కూడా పెరుగుతోంది. భూపాలపల్లి విద్యుత్‌ సర్కిల్‌ ఆపరేషన్‌ పరిధిలో ప్రస్తుతం నిత్యం విద్యుత్‌ కోటా 2.25 మిలియన్‌ యూనిట్లు కాగా.. వారం రోజుల నుంచి 2.35 మిలియన్‌ యూనిట్లకుపైగా వినియోగిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగు తుండటంతో అధికారులు సబ్‌ స్టేషన్ల నిర్వహణపై దృష్టి సారించారు. యాసంగి పనులు చివరి దశలో ఉన్న తరుణంలో ఎండ తీవ్రతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల వరి, మిర్చి, మొక్కజొన్న కోతలు, వాటిని ఆరబెట్టడం, కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడం వంటి పనుల్లో రైతులు నిమగమై ఉన్నారు. ఎండలో పనులకు వెళ్లడానికి కూలీలు వెనకడుగు వేస్తున్నారు. పలు ప్రాంతాల్లో పని వేళలను మార్చుకున్నారు. ఉదయాన్నే పనులకు వెళ్లి మధ్యాహ్నానికి తిరిగి ఇండ్లకు చేరుతున్నారు. సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనులు, కేటీపీపీలో పని చేసే కార్మికులు, హమాలీలు ఎండ వేడికి ట్టుకోలేకపోతున్నారు. దుకాణాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఉంటుండగా, మధ్యాహ్నం కర్ఫ్యూను తలపిస్తున్నాయి. శుక్రవారం కూడా ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరికొంత పెరిగే అవకాశం ఉంటుందని, వృద్ధులు, పిల్లలు, వీధి వ్యాపారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్‌ సీహెచ్‌ మధుసూదన్‌, డీఎంహెచ్‌ఓ, భూపాలపల్లి జిల్లా
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు పగటిపూట బయటకు రాకుండా చూడాలి. మిగతా వారు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఇంట్లోనే ఉంటే ప్రమాదం ఉండదు. ఖద్దరు, కాటన్‌ దుస్తులు ధరించడమే కాక బయటకు వెళ్లినప్పుడు గొడుగు, చలువ కళ్లద్దాలు ధరిస్తే మంచిది. జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఎండవేడికి దాహం వేసినా, వేయకున్నా ప్రతి గంటకు గ్లాస్‌ నీరు తాగటం మంచిది. పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. మద్యం, టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. గ్రామపంచాయతీల పరిధిలో నీటి సరఫరాలో జాగ్రత్తలు పాటించేలా పంచాయతీరాజ్‌ శాఖతో సమన్వయం చేస్తున్నాం. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాం. నవజాత శిశువులను పల్చటి గుడ్డతో సగం వరకు కప్పి ఉంచాలి

Spread the love