తెలంగాణ గొంతు నులిమిన మోడీ సర్కార్‌

– ఏపీ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వ హామీలు
– రెండు రాష్ట్రాల రక్షణకు అదనపు పోలీసు బలగాల సహాయం
– విద్యుత్‌, కృష్ణా, గోదావరి నదుల వివాదాల పరిష్కారం
– బడ్జెట్‌ ద్రవ్యలోటు పూడ్చడం పన్నుల ప్రోత్సాహానికి సహాయం
తెలంగాణకు :
– హార్టికల్చర్‌ యూనివర్సిటీ, ట్రైబల్‌ యూనివర్సిటీ
– బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ
– ఎన్‌టిపీసీి ఆధ్వర్యంలో 4వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం
– ఎన్‌హెచ్‌ఏఐకి రోడ్డు కనెక్షన్లు
– ఖాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ స్వాహా!
కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ స్వాహా!
గిరిజన విశ్వవిద్యాలయం దిక్కులేదు
పసుపు బోర్డ్‌ పత్తాలేదు
ఆదిలాబాద్‌ సీ.సీ.ఐ ఇంతే సంగతులు
రాష్ట్ర విభజన సమయంలో ‘సోనియమ్మనే కాదు, చిన్నమ్మను నన్ను కూడా గుర్తు పెట్టుకోండి’ అని ఆనాటి పార్లమెంటు సభ్యురాలు సుష్మా స్వరాజ్‌ చెప్పారు. వారు చెప్పినట్టుగానే పార్లమెంటు ఎన్నికల తర్వాత మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడింది. మోడీ పాలనకు పదేండ్లు నిండాయి. ఈ పార్లమెంటు ఎన్నికలలో మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలముందు ముద్దాయిగా నిలబడింది. చేసిన బాసలు మరచిపోవడమే కారణం. నమ్మిన ప్రజలను మోసగించడమే కారణం.
నదీజలాల పంపిణీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకుంటే పరిష్కరించే బాధ్యత కేంద్రం తీసుకుంటుందన్నారు. నాటి కెసిఆర్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకున్నది. నదీజలాల పంపిణీ సమస్య మాత్రం నేటికీ కొలిక్కి రాలేదు. కేంద్ర ప్రభుత్వం సమస్యను బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు అప్పగించి చేతులు దులుపుకున్నది. రెండు రాష్ట్రాలు ఘర్షణ పడుతున్నాయన్న సాకుతో ఉభయ తెలుగు రాష్ట్రాల నదీజలాల ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. పిల్లి, పిల్లి తగాదాను కోతి పరిష్కరించినట్టున్నది ఇది. సమస్యను పరిష్కరించే బదులు రెండు రాష్ట్రాల మీద పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నది. రెండు తెలుగు రాష్ట్రాలకు ద్రవ్యలోటు పూడ్చడం కోసం పన్నుల ప్రోత్సాహక సహాయం చేస్తామని అప్పుడు చెప్పారు. తెలంగాణకు రెవిన్యూ లోటు లేదు. ద్రవ్యలోటు పూడ్చేందుకు సహాయం చేయకపోగా రాష్ట్రానికి రావల్సిన బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని వేధించింది.
సింగరేణి ప్రయివేటు
సింగరేణిలో పెట్టుబడులు 51శాతం తెలంగాణ రాష్ట్రానివి కాగా 49శాతం కేంద్ర ప్రభుత్వం వాటాలున్నాయి. ఈ నిష్పత్తి కొనసాగించకుండా కేంద్రం తన వాటాలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నది. ఇది తెలంగాణ ప్రజలను మోసగించడమే. ఒక దశలో కేంద్రం వాటా కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవడానికి సిద్ధపడింది. ఈ విషయంలో మాత్రం కేంద్రం స్పందించలేదు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తున్నది. అంటే క్రమంగా సింగరేణి సంస్థను బలహీనపర్చటమే. తెలంగాణకు మణిహారమైన బొగ్గు గనులను తస్కరించటమే. హార్టికల్చర్‌ యూనివర్సిటీని ఇచ్చామనిపించుకున్నారు. ఇంతవరకూ సొంత భవనాలు లేవు. ట్రైబల్‌ యూనివర్సిటీ గురించి పదేండ్ల తర్వాత కేవలం ప్రకటన మాత్రమే జరిగింది. బయ్యారం ఉక్కు కర్మాగారం ఊసే మరిచింది. సాధ్యాసాధ్యాల పరిశీలనకు కూడా సిద్ధపడలేదు. ఎన్‌టిపిసి ఆధ్వర్యంలో 4వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ప్రారంభించవలసి ఉండగా పదేండ్ల తర్వాత 1600మెగావాట్ల యూనిట్‌ మాత్రమే ప్రారంభించారు. దానికే గొప్పలు చెప్పుకుంటున్నారు. కీలకమైన జాతీయ రహదారులకు రాష్ట్రం నుంచి నాలుగు లింకు రోడ్లు నిర్మాణానికి వాగ్దానం చేసారు. ఒక్క లింకు రోడ్డుకు మాత్రమే 2020లో శంకుస్థాపన చేసి నత్తనడకన పనులు చేస్తున్నారు. మిగిలిన మూడు రహదారులకు దిక్కు లేదు. కాజీపేట్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయారు. తెలంగాణకు మొండిచేయి చూపారు. అంటే విభజన హామీలు అమలుచేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడమే కాదు, తెలంగాణ ప్రజలను మోసం చేసింది బీజేపీ ప్రభుత్వం.
కీలక వాగ్దానాలకు దిక్కే లేదు
నిజామాబాద్‌కు పసుపు బోర్డు, ఆదిలాబాద్‌లో సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పునరుద్ధరణ, విమానాశ్రయం నిర్మాణం లాంటి వాగ్దానాలు అటకెక్కించారు. హైదరాబాద్‌లో ఎంఎంటిఎస్‌ విస్తరించకపోగా, ఉన్న మొదటి దశను కూడా రద్దు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎంఎంటీఎస్‌ రైళ్ళు ఎప్పుడు రద్దవుతాయో అర్ధంకాని స్థితిలో ప్రయాణీకులు ఇబ్బందిపడుతున్నారు. సాగునీటి సమస్య సవాలుగా ఉన్న తెలంగాణకు ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హౌదా ఇచ్చేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిరాకరిస్తున్నది.
బీఆర్‌ఎస్‌ లాలూచీ కుస్తీ ఫలితమే…
గత పదేండ్ల కాలంలో తొమ్మిదిన్నరేండ్లు తెలంగాణను పరిపాలించిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం విభజన హామీల అమలు కోసం కేంద్రంతో నిజాయితీగా పోరాడలేదు. లాలూచీ కుస్తీ నడిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార ధోరణి అని సాకు చెప్పింది. మనది ఫెడరల్‌ రాజ్యాంగం. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు చాలా కీలకమైనవి. భారతదేశం రాష్ట్రాల సమాఖ్యగా రాజ్యాంగం స్పష్టం చేసింది. రాష్ట్రాల అధికారాలు, హక్కులు, వనరులకు చాలా ప్రాధాన్యత ఉన్నది. వీటికోసం పోరాడిన పార్టీలకే దేశ చరిత్రలో గౌరవం దక్కింది. కేంద్రంతో పోరాడకుండా పరిష్కారమయ్యే సమస్య కాదిది. పోరాడే హక్కు రాష్ట్రాలకున్నది. కానీ గత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం దీనికి వక్రభాష్యాలు చెప్పింది. వారు చెప్పిన మేరకైనా కేంద్రంతో సహకరించి సాధించిందేమీ లేదు.

‘గంగా జమున తెహజీబ్‌’ ధ్వంసం
తెలంగాణ సున్నితమైన రాష్ట్రం. అనేక పట్టణాలలో గణనీయమైన సంఖ్యలో ముస్లిం మైనారిటీలున్నారు. హిందూ, ముస్లిం ప్రజలు సమ్మిళిత సంస్కృతులతో తరతరాలుగా సహజీవనం చేస్తున్నారు. జమీందార్లు, జాగీర్దార్ల దోపిడీకి వ్యతిరేకంగా, రజాకార్ల దౌర్జన్యానికి, నిజాం నిరంకుశ రాచరికానికి వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడిన గడ్డ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం ఐదేండ్ల పాటు సాయుధ తిరుగుబాటు చేసిన పోరుభూమి. ఈ పోరాటంతో అణువంత సంబంధం లేని ఆర్‌ఎస్‌ఎస్‌, దాని రాజకీయ విభాగం అయిన బీజేపీ ఇప్పుడు మత చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగలు, వేడుకలను కూడా భావోద్వేగాలను ఉసిగొలిపేందుకు వాడుకుంటున్నారు. కుటుంబాలు బంధుమిత్రులతో సంతోషంగా గడపవలసిన సమయంలో
భయకంపితులను చేస్తున్నారు. ఓటుబ్యాంకు కోసం మతాన్ని వాడుకుంటున్నారు.

రాష్ట్రాలపై దాడి
మరోవైపు రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల పరిధి. విద్య, విద్యుత్తు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. ఈ మూడింటినీ రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం కబళించింది. నూతన విద్యా విధానం పేరుతో దేశమంతా విద్యను కార్పొరేటీకరించే విధంగా చట్టం చేసింది. రైతు వ్యవస్థనే ధ్వంసం చేసి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నించింది. ఇందుకోసం మూడు చట్టాలు చేసి అమలు చేసేందుకు విఫలయత్నం చేసింది. విద్యుత్తు సవరణ బిల్లు పెట్టింది. చట్టం చేసి రాష్ట్రాల మీద రుద్దేందుకు ప్రయత్నిస్తున్నది. ఇదే జరిగితే తెలంగాణ రైతాంగానికి ఉచిత విద్యుత్తుకు ముప్పు ఏర్పడుతుంది. గృహ వినియోగదారులకు కూడా బిల్లు విపరీతంగా పెరుగుతుంది. కేంద్రం అటవీ చట్టాలను సవరించింది. అడవులను బడాబాబుల చేతుల్లో పెడుతున్నది. భద్రాచలం, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమరం భీమ్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు ప్రాంతాల ఆదివాసీల జీవితాలతో చెలగాటమాడుతున్నది. బీజేపీ కనుసన్నలలో నడుచుకోవడానికి సిద్ధపడని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం వేధిస్తున్నది. రాజ్యాంగబద్ధంగా నడుచుకోకుండా కేంద్ర ప్రభుత్వ రాజకీయ ఏజెంటుగా పనిచేయడానికి సిద్ధపడేవారిని ఈ రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమిస్తున్నది. వీరు ఎన్నికైన ముఖ్యమంత్రులకు పోటీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. మోడీని, బీజేపీని వ్యతిరేకించే నాయకులపైనా, సంస్థలపైనా ఐటి, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ప్రయోగించి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. దేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్టు చేయడమే కాదు, తెలంగాణ లో కూడా కవితను ఈ బ్లాక్‌మెయిల్‌ రాజకీ యాలలో భాగంగానే అరెస్టు చేసారు. ఇంత జరిగినా కవిత విషయంలో కేసిఆర్‌ నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరం.

Spread the love