బుల్డోజర్లతో యోగి

– ఎస్పీ కోటలో ఎన్నికల ర్యాలీ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోటలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ గురువారం బుల్డోజర్‌లతో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. సుమారు మూడు కిలోమీటర్ల వరకు సాగిన ఈ రోడ్‌ షోలో యోగి పాలనకు మార్కుగా నిలిచిన బుల్డోజర్లు కూడా పాల్గొన్నాయి. ఎస్పీ వ్యవస్థాపకుడు, ములాయం సింగ్‌ యాదవ్‌ స్వస్థలమైన మెయిన్‌పురిలో బీజేపీ అభ్యర్థి జైవీర్‌ సింగ్‌కు మద్దతుగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ రోడ్‌ షోలో సుమారు పద్నాలుగు బుల్డోజర్లు పాల్గొన్నాయి.
ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రెండేండ్ల కిందట ములాయం సింగ్‌ యాదవ్‌ మరణం నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో సుమారు మూడు లక్షల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై ఆమె గెలిచారు. మరోవైపు 1996 నుంచి మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గంలో ఎస్పీ ఎప్పుడూ ఓడిపోలేదు. దీంతో ఈ స్థానం ఎస్పీకి కంచుకోటగా నిలిచింది. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మెయిన్‌పురి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను బీజేపీ రెండింటిని గెలుచుకుంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో మెయిన్‌పురి స్థానంపై బీజేపీ దష్టిసారించింది.

Spread the love