ఆ పార్టీలకు దమ్ముందా?

– కుల, మతాల పేర్లు చెప్పకుండా..డబ్బులు పంచకుండా గెలుస్తారా?
– కమ్యూనిస్టులు గెలిస్తేనే పేదలకు న్యాయం
– గెలిపిస్తే..చేర్యాల నియోజకవర్గ సాధనకు పోరాటం
– పేదల సుఖసంతోషాలు కోరే ఏకైక పార్టీ సీపీఐ(ఎం) : ఎన్నికల ప్రచారంలో భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి ఎండీ జహంగీర్‌
– గ్రామగ్రామాన ఘనస్వాగతం.. ఆకట్టుకుంటున్న కళా బృందాలు
నవతెలంగాణ-కొమురవెల్లి/చేర్యాల
కులం, మతాల పేరు చెప్పకుండా.. ఓట్లర్లకు డబ్బులు పంచకుండా బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నాయకులకు గెలిచే దమ్ముందా అని సీపీఐ(ఎం) భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్‌ సవాల్‌ విసిరారు. గురువారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం మర్రిముచ్చాల, అయినాపూర్‌ గ్రామాలు, చేర్యాల పట్టణంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, ఎండీ అబ్బాస్‌, సిద్దిపేట, జనగామ జిల్లా కార్యదర్శులు ఆముదాల మల్లారెడ్డి, మోకు కనకరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామగ్రామాన సీపీఐ(ఎం) అభ్యర్థికి ఘనస్వాగతం లభించింది. టచేర్యాల పట్టణంలోని గాంధీ సెంటర్‌ నుండి అంబేద్కర్‌ చౌరస్తా వరకు భారీ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి జహంగీర్‌ పూల మాల వేశారు. పీఎన్‌ఎం కళా బృందాలు ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్నర్‌ మీటింగ్‌ల్లో జహంగీర్‌ మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో గతంలో ఎంపీలుగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, బూరనర్సయ్యగౌడ్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఒక్కసారి సీపీఐ(ఎం)ని గెలిపిస్తే చేర్యాల నియోజకవర్గాన్ని సాధించేందుకు పోరాటం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. పదేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు కనీసం ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. ఇండ్ల స్థలాలు లేని పేదలకు స్థలాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పేదల సుఖ సంతోషాలను కోరుకునేది, పేదల కోసం ఆస్తులను, జీవితాలను త్యాగాలు చేసిన పార్టీగా సీపీఐ(ఎం) చరిత్రలో నిలిచిపోయిందని, అలాంటి పార్టీ గెలిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఓట్లు వేరే పార్టీలకు వేసి పోరాటాలు తాము చేస్తే సమస్యలు పరిష్కారం కావన్నారు. ప్రస్తుతం పార్లమెంటులో 370 మంది ఎంపీలు శతకోటీశ్వరులు, 306 మంది ఎంపీల మీద వివిధ రకాల కేసులు ఉన్నాయని తెలిపారు. డబ్బున్నోడు గెలిస్తే.. పేదలను పట్టించుకోరని, వారి ఆస్తులు కాపాడుకోవడానికి పనిచేస్తారన్నారు. పార్లమెంటుకు నిజాయితీపరులు, పోరాటాలు, ప్రజల కష్టాలు తెలిసినవారు పోవాలని, అందుకు సీపీఐ(ఎం) అభ్యర్థిగా తనను గెలిపిస్తే పేదల కోసం గళం విప్పుతానన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కరాములు మాట్లాడుతూ.. బీజేపీ పదేండ్ల పాలన అభివృద్ధి ఉద్యోగ కల్పన లేకుండా కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టి కాలం గడిపిందని అన్నారు. యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసినందుకు, గ్యాస్‌, నిత్యవసరాల ధరలు పెంచినందుకు, రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినందుకు, కార్మిక చట్టాలు నిర్వీర్యం చేసినందుకు, అదానీ అంబానీల ఆస్తులు పెంచినందుకు బీజేపీ పార్టీకి మళ్ళీ ఓట్లు వేయాలా అని ప్రశ్నించారు. ఈసారి దేవుడి పేరుతో ఓట్లు అడగాలని చూస్తున్న మతోన్మాద బీజేపీని ఓడించి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు.
సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో సీపీఐ(ఎం)ను గెలిపిస్తే.. చేర్యాల నియోజకవర్గ ఏర్పాటు, రెవెన్యూ డివిజన్‌, కొమురవెల్లిలో జరుగుతున్న అవినీతి అక్రమాల సమస్యలపై పోరాటం నిర్వహించి సాధిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. అడివయ్య, మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి, సీనియర్‌ నాయకులు నక్కల యాదవరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్‌, గోపాలస్వామి, భాస్కర్‌, జిల్లా కమిటీ సభ్యులు తాడూరు రవీందర్‌, సర్పంచ్‌ అత్తిని శారద, దాసరిప్రశాంత్‌, తేలు ఇస్తారి, వుల్లంపల్లి నరసవ్వ, సాయిలు, సురేందర్‌రెడ్డి, బాలరాజు, దేవకుమార్‌, లావణ్య, విగేశ్వరి, నవనీత, పద్మ, కర్రోళ్లఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love