ఓటింగ్‌కు దూరం పెండింగ్‌ సమస్యలే కారణం

ఓటింగ్‌కు దూరం పెండింగ్‌ సమస్యలే కారణం– గుజరాత్‌లో ఎన్నికలు బహిష్కరించిన మూడు గ్రామాల ప్రజలు
– డిమాండ్లు నెరవేర్చకపోవటంతో
– మరి కొన్ని గ్రామాల్లో పాక్షికంగా బహిష్కరణ
అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని మూడు గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మంది ఓటర్లు లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ను బహిష్కరించారు. అనేక ఇతర గ్రామాల వారు ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోవటంతో ఎన్నికల ప్రక్రియకు పాక్షికంగా దూరంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు బరూచ్‌ జిల్లాలోని కేసర్‌ గ్రామం, సూరత్‌ జిల్లాలోని సనాధార, బనస్కాంత జిల్లాలోని భఖారీ ఓటర్లు ఓటింగ్‌ను పూర్తిగా బహిష్కరించగా.. జునాగఢ్‌ జిల్లాలోని భట్గాం గ్రామం, బోడోలి, మహిసాగర్‌ జిల్లాలోని కుంజర గ్రామాలు దీనిని పాక్షికంగా బహిష్కరించాయి. సనాధార గ్రామం బార్డోలి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ 320 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం.. స్థానిక పోల్‌ అడ్మినిస్ట్రేషన్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిని ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ.. 320 మంది ఓటర్లలో ఎవరూ ఓటు వేయకపోవటం గమనార్హం.
పటాన్‌ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బఖ్రీ గ్రామంలోని దాదాపు 300 మంది ఓటర్లు.. తమ గ్రామ పంచాయతీ విభజనకు నిరసనగా సమిష్టిగా ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించు కున్నారు. ఎంతగా ఒప్పించే ప్రయత్నాలు చేసినా.. వారు తమ ఓటు హక్కును వినియోగించుకోకూడదనే నిర్ణయానికే బలంగా కట్టుబడి ఉన్నారు. తెల్లవారుజాము నుంచే పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసి పోలింగ్‌ అధికారులు వేచి చూసినా గ్రామస్తులు ఓటింగ్‌కు రాలేదు. తమ గ్రామ పంచాయతీ విభజనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి భరత్‌సింగ్‌ దాభి కూడా గ్రామానికి చేరుకుని ఎన్నికల ప్రక్రియలో భాగం కావాలని అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
భరూచ్‌ జిల్లాలోని కేసర్‌ గ్రామంలో దాదాపు 350 మంది ఓటర్లు కూడా తమ ఓటు వేయకూడదనే నిర్ణయంపై ఐక్యంగా ఉన్నారు. ఏ ఒక్కరూ ఓటు వేయకుండా పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ప్రజలు తమ ఓట్లను బహిష్కరించడం ఇదేం తొలిసారి కాదు. నదిపై వంతెన నిర్మించాలని పలుమార్లు డిమాండ్‌ చేసినా ప్రభుత్వం నెరవేర్చకపోవటంతో గతంలో కూడా ఇలాగే చేశామని స్థానికులు తెలిపారు. గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు గాను 25 స్థానాలకు మంగళవారం ఒకే దశలో పోలింగ్‌ జరిగింది. సూరత్‌ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న విషయం తెలిసిందే.

Spread the love