ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే… బీజేపీకి గడ్డు కాలమే

If elections are free... Tough time for BJP – ప్రధాని నిరాశానిస్పృహల్లో ఉన్నారు
– ఈసారి మతం కార్డు పనిచేయదు
– ఈసీ పనితీరు బాగోలేదు
– బీజేపీని నిలువరించేందుకే మిత్రపక్షాల పోటీ
– పినరయిపై రాహుల్‌ వ్యాఖ్యలు దురదృష్టకరం
– తిరిగి పూర్వ వైభవం సాధిస్తాం :డక్కన్‌ హెరాల్డ్‌ ఇంటర్వ్యూలో సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా జరిగితే నరేంద్ర మోడీ ప్రభుత్వం గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదు. ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాలు గెలుచుకుంటుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మరచిపోవాల్సిందే

న్యూఢిల్లీ : తొలి దశ ఎన్నికల పోలింగ్‌ సరళిని గమనిస్తే గతంలో ఉన్న స్థానాలను నిలుపుకోవడం కూడా ఆ పార్టీకి కష్టంగానే కన్పిస్తోందని అన్నారు. ఈ విషయాన్ని గ్రహించినందునే ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రచార పంథాను మార్చుకున్నారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ‘డక్కన్‌ హెరాల్డ్‌’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏచూరి పలు అంశాలను ప్రస్తావించారు. అవి ఆయన మాటల్లోనే…
ఈసీలో నిస్పాక్షికత ఏది?
ఎన్నికలు స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్‌ చేయాల్సినంత పని చేయడం లేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను చూస్తున్నార. ఆ విషయంలో కూడా ఈసీ నిస్పాక్షికంగా వ్యవహరించడం లేదు. సాక్షాత్తూ ప్రధానమంత్రి, ఇతర బీజేపీ నేతలు ఉల్లంఘనలకు పాల్పడుతుంటే ఈసీ పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు స్వేచ్ఛకు, నిస్పాక్షికతకు చోటెక్కడిది? ఓట్లను దండుకోవడానికి భావోద్వేగాలను రెచ్చగొడుతూ ప్రచారం చేస్తుంటే అనుమతిస్తున్నారు. ప్రవర్తనా నియమావళి అనేది అందరికీ ఒకేలా ఉంటుంది. ఏదో మాట్లాడారని ప్రతిపక్ష నేతను రెండు రోజుల పాటు ప్రచారం చేయకుండా నిషేధిస్తున్నారు. అదే అధికార పార్టీ సభ్యుడు అంతకంటే దారుణంగా మాట్లాడుతుంటే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
అనుకూల పవనాలేవీ లేవు
తొలి దశ పోలింగ్‌ తర్వాత ప్రధాని మోడీలో నిరాశానిస్పృహలు కన్పిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారు గతంలో గెలుచుకున్న స్థానాలను సైతం కోల్పోతున్నారు. మీరు సీటు గెలుస్తారా లేదా అనేది వేరే విషయం. ఓటింగ్‌ శాతం తగ్గడాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఓటింగ్‌ శాతం తగ్గడం ఎప్పుడూ అధికార పార్టీకి మంచి ఫలితాలు ఇవ్వదు. ఇక రెండో విషయం…ఓటింగ్‌ శాతం తగ్గడాన్ని బట్టి ఈసారి ఎలాంటి అనుకూల పవనాలు వీయడం లేదని అర్థమవుతోంది. ప్రజలను చైతన్యపరిచే అంశం కూడా ఏదీ లేదు. ఓ గాలి అంటూ లేనప్పుడు మోడీ గెలవడం ఎప్పుడూ కష్టమే. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే బీజేపీ ఆశించిన స్థాయిలో దాని పనితీరు కన్పించటంలేదని తేలిపోయింది. ఇప్పుడు వారి వద్ద ఉన్నది ఒకటే అస్త్రం. మతపరమైన సమీకరణ, హిందువులు-ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం.
ప్రజా సమస్యలను విస్మరించి…
అయితే వారు ఆశించిన విధంగా మతం కార్డు పనిచేస్తుందని నేను అనుకోవడం లేదు. ఇప్పటికే ఈ వ్యూహాన్ని అతిగా, గరిష్టంగా వాడేశారు. వారు అల్లర్లను, అలాంటి ఘటనలను ప్రేరేపిస్తే అది వేరే కథ. అయితే ప్రస్తుతం మత సమీకరణ అనేది పనిచేయదు. హిందువు అయినా, ముస్లిం అయినా…రోజువారీ జీవన గమనం గురించే ఆలోచిస్తారు. అయితే ప్రజా సమస్యలపై మోడీ మౌనం వహిస్తున్నారు. ప్రజల మనుగడకు అవసరమైన ఉపాధి, ఆహారం, అత్యవసర ప్రయోజనాల గురించి ఆయన పట్టించుకోరు. వాటికి బదులుగా మాంసం, పుక్కిటి పురాణాల గురించి మాట్లాడుతుంటారు. ముస్లిం జనాభా పెరిగితే హిందువుల ప్రయోజనాలు దెబ్బతింటాయని చెబుతారు. ముస్లిం జనాభా పెరుగుదలపై ఆయన చెబుతున్న మాటలు అర్థం లేనివి. ఇక్కడ మరో అంశం ‘కోటా’ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలను ముస్లిం లకు ఇస్తారన్నది మోడీ వాదన. ఇది అసంబద్ధ మైనది. హిందువుల సంపదను దోచుకుం టారని, మంగళసూత్రాలను గుంజుకుంటారని అంటారు. మోడీ చేస్తున్న ఇలాంటి ప్రసంగాలు దారుణంగా, ఆగ్రహం కలిగించేలా ఉన్నాయి. ఆయనలోని నిరాశానిస్పృహలను అవి ప్రతిబింబిస్తున్నాయి.
రాష్ట్ర స్థాయిలోనే సీట్ల సర్దుబాటు
ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు రాష్ట్ర స్థాయిలోనే సాధ్యపడుతుందని నేను చెబుతూనే ఉన్నాను. జాతీయ స్థాయిలో దీనిపై కసరత్తు ఏమీ జరగలేదు. మా భాగస్వామ్య పక్షాలకు నచ్చచెప్పేందుకు కొంత సమయం పట్టింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అంతా పురోగతిలోనే ఉంది. సంతృప్తికరంగా సాగుతోంది. మహారాష్ట్ర, బీహార్‌, తమిళనాడులో కూటములు ఏర్పడ్డాయి. ఇతర రాష్ట్రాలలో ప్రధాన పార్టీలు అవగాహనకు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ అవగాహన కుదుర్చుకున్నాయి కదా. రాజస్థాన్‌లో మేము ఒకే ఒక స్థానంలో పోటీ చేస్తున్నాము. అది సానుకూల సంకేతం. లేకుంటే మేము నాలుగైదు స్థానాలలో పోటీ చేసే వారం. రాష్ట్ర స్థాయిలో ఆశించిన విధంగానే ఇండియా కూటమి పార్టీలు ముందుకు సాగుతున్నాయి.
మిత్రపక్షాలకు సముచిత స్థానాలు
కొన్ని రాష్ట్రాలలో మిత్రపక్షాలు ఎక్కువ సీట్లు కోరాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఉదారంగా వ్యవహరించింది. ఆర్జేడీ, డీఎంకే పార్టీలకు సముచితంగానే స్థానాలు దక్కాయి. మహారాష్ట్రలో అనేక పార్టీలు ఉండడం వల్ల కొంత క్లిష్టత ఏర్పడింది. కాంగ్రెస్‌ ప్రధాన పార్టీగా ఉన్న ఇతర రాష్ట్రాలలో భాగస్వామ్య పక్షాలకు సీట్ల కేటాయింపులో న్యాయమే జరిగింది. దీంతో పరిస్థితి మరింత మెరుగైంది.
రాహుల్‌ ఆరోపణలు ఆరోగ్యకరం కావు
కేరళలో రాహుల్‌ గాంధీ సీపీఐ (ఎం) ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం ఆరోగ్యకరమైన పరిణామం కాదు. అది ఫలితాన్ని ఇవ్వదు కూడా. గత శాసనసభ ఎన్నికలలో వారు ముఖ్యమంత్రిని ‘ధోవతిలో మోడీ’ అని అభివర్ణించారు. అయితే అది ప్రతికూల ప్రభావాన్ని చూపింది. కేరళ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఓ రాజకీయ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడి నోటి నుండి అలాంటి వ్యాఖ్య రావడం దురదృష్టకరం. కేరళ ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలంటూ మోడీని కోరడం ఆయన పరిణితిలేమినే సూచిస్తోంది.
మళ్లీ బలం పుంజుకుంటాం
గత 20 సంవత్సరాలుగా ఎన్నికల్లో సీపీఐ (ఎం) బలం తగ్గుతున్న మాట వాస్తవమే. గత ఎన్నికల్లో అది కనిష్ట స్థాయికి చేరింది. ఈ ఎన్నికల నుండి మళ్లీ పూర్వ వైభవం ప్రారంభమవుతుందని నేను భావిస్తున్నాను. ఇక్కడి నుండే బలం పుంజుకోవడానికి మేము ప్రయత్నించాలి. మెరుగైన ఫలితాల కోసం ముందుకు సాగాలి.
బీజేపీ ఓటమి కోసమే…
కొన్ని రాష్ట్రాలలో అవగాహన సాధ్యం కాదని మాకు ముందు నుండే తెలుసు. ఉదాహరణకు కేరళ. బీజేపీని మట్టికరిపించడానికి అక్కడ ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ కృషి చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో కూడా అంతే. బీజేపీని ఓడించడమే లక్ష్యం. ఈ లక్ష్య సాధనకు ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ మధ్య పోటీ సాయపడితే అది విజయవంతమవుతుంది. బెంగాల్‌లో ముక్కోణపు పోటీ జరిగితేనే బీజేపీని ఓడించగలం లేదా దానిని పరిమితం చేయగలం. ముక్కోణపు పోటీ జరగకుండా తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌, వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరితే ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిగా బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుంది. ఫలితంగా ఆ పార్టీ బాగా ప్రయోజనం పొందుతుంది. పంజాబ్‌లో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య అవగాహన కుదిరితే అకాలీదళ్‌ లబ్ది పొందుతుంది. అంతిమంగా అది బీజేపీకి లాభిస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే బీజేపీని ఓడించేందుకు లేదా దాని స్థానాలను తగ్గించేందుకే.

Spread the love