సీపీఐ(ఎం)పై మోడీ నిందలు

Modi blames CPI(M).– అణు నిరాయుధీకరణ వైఖరికి వక్ర భాష్యం
– దేశ భద్రత ప్రమాదంలో పడుతుందట
– వంతపాడిన రాజ్‌నాథ్‌
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రచార సభలలో ప్రతిపక్ష ఇండియా కూటమిపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారు. సీపీఐ (ఎం)ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షమైన ఒక పార్టీ అణు నిరాయుధీకరణను కోరుకున్నదని ఈ నెల ప్రారంభంలో నిందలు వేశారు. ఇది ఏకపక్ష నిరాయుధీకరణకు పిలుపునివ్వడమే అవుతుందని, ఒకవేళ మన శత్రువుల వద్ద అణ్వాయుధాలు ఉంటే అప్పుడు మన దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని చెప్పుకొచ్చారు. దేశాన్ని రక్షించుకోవాలంటే మన వద్ద అణ్వాయుధాలు ఉండాల్సిందేనని ప్రకటించారు. దీనికి భిన్నంగా మాట్లాడేవారు దేశాన్ని ఎలా రక్షించగలరని ప్రశ్నించారు.
ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రధాని వాదనతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఏకీభవించారు. ఆయన నేరుగా సీపీఐ (ఎం) పేరును ప్రస్తావిస్తూ ఆ పార్టీ ఉద్దేశాలను ప్రశ్నించారు. దేశాన్ని బలహీనపరచేందుకు సీపీఐ (ఎం) లోతైన కుట్ర చేస్తోందని ఆరోపించారు.
పార్టీ వైఖరి ఏమిటంటే…
అణ్వాయుధాలను, రసాయన, జీవ ఆయుధాలు సహా మారణహోమానికి కారణమయ్యే ఇతర ఆయుధాలను పూర్తిగా నిర్మూలించాలని సీపీఐ (ఎం) తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పిలుపునిచ్చింది.
దీని పైనే ప్రధాని, కేంద్ర రక్షణ మంత్రి విమర్శలు కురిపించారు. అయితే 2019 ఎన్నికల సమయంలో పార్టీ విడుదల చేసిన ప్రణాళికను కూడా ఈ సందర్భంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల పార్టీ ఉద్దేశమేమిటో తెలుస్తుంది. భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన సెక్షన్‌లో సీపీఐ (ఎం) ఇలా తెలిపింది…’ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రపంచవ్యాప్తంగా అణు నిరాయుధీకరణ జరగాలి.
అణు పరీక్షల నిర్వహణపై పార్లమెంట్‌ మారటోరియం విధించాలి. దక్షిణాసియాను అణ్వస్త్ర రహిత ప్రాంతంగా మార్చాలి. డియాగో గార్సియాలోని అమెరికా స్థావరంలో ఉన్న అణ్వాయుధాలను తొలగించాలి’. అణ్వాయుధాలను సీపీఐ (ఎం) వ్యతిరేకిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే దీనికి వింత భాష్యం చెబుతున్నారు. ఏకపక్ష నిరాయుధీకరణను పార్టీ కోరుకుంటోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
మోడీ ప్రభుత్వ వైఖరి కూడా అదే
ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే వివక్షకు తావులేకుండా ప్రపంచవ్యాప్తంగా అణు నిరాయుధీకరణ జరపాలన్నది తన వైఖరి అంటూ మోడీ ప్రభుత్వం ఐరాసలోని భారత శాశ్వత మిషన్‌ వెబ్‌ పేజీలోనే ప్రకటించింది. 2019 సెప్టెంబర్‌ 27న జరిగిన ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా అణు నిరాయుధీకరణకు, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు. దీనిని బట్టి అణు నిరాయుధీకరణకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్న విషయం స్పష్టమవుతోంది. తాను అణు నిరాయుధీకరణకు మద్దతు తెలుపుతూ, అదే వైఖరితో ఉన్న సీపీఐ (ఎం)పై నిందలు వేయడం కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమేనని దీనిని బట్టి అర్థమవుతోంది.

Spread the love