– స్వతంత్ర మీడియాపై బీజేపీ దాడి
– ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ‘ఆర్గనైజర్’కు స్వేచ్ఛా?
– రైతుల ఉద్యమాన్ని కవరు చేయటమే న్యూస్‌క్లిక్ నేరమా?
– కేంద్రం సిగ్గుపడాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్
– జంతర్ మంతర్‌లో వామపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ : నిజాలు చెప్పేవారినే మోడీ సర్కార్ దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నదని, ప్రశ్నించే తత్వాన్ని అది జీర్ణించుకోలేకపోతున్నదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ విమర్శించారు. స్వతంత్ర మీడియాపై బీజేపీ కుట్రలు ఫలించబోమని తెలిపారు. న్యూస్ క్లిక్, ద వైర్ తదితర స్వతంత్ర మీడియా సంస్థలను నాశనం చేయడానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా ఉన్న మీడియా స్వేచ్ఛను హరించే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మంగళవారం నాడిక్కడ జంతర్ మంతర్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ సామాజిక తరగతులకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న మోడీ సర్కార్ నశించాలి.. మీడియా స్వేచ్ఛ వర్ధిల్లాలి’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా బృందాకరత్ మాట్లాడుతూ.. కార్మికులు, అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను, వారు చేస్తున్న ఉద్యమాలను కవర్ చేస్తున్నందునే ‘న్యూస్ క్లిక్’పై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శిం చారు. సమాజంపై విద్వేష విషం చిమ్మే సంఫ్‌ు పరివార్ (ఆర్ ఎస్‌ఎస్) వారపత్రిక ‘ఆర్గనైజర్’కు మాత్రం ఎనలేని స్వేచ్ఛను కల్పించారని తప్పుబట్టారు. చైనాతో ముడిపెట్టి నకిలీ జాతీయ వాదంతో పత్రికా స్వేచ్ఛపై మోడీ సర్కార్ దాడి చేస్తోందన్నారు. కేంద్ర ఏజెన్సీలు 2020 నుంచి న్యూస్ క్లిక్‌పై విచారణ జరుపుతు న్నాయనీ, మూడేండ్లు శ్రమించినా ఈడీ, సీబీఐ, ఐబీలు న్యూస్ క్లిక్‌కు వ్యతిరేకంగా ఏమీ కనుగొనలేకపోయాయని పేర్కొన్నారు.
ప్రబీర్ పుర్కాయస్థతో సహా ఎవరినీ అరెస్టు చేయొద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు గతంలోనే ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ కేసును హైకోర్టు మళ్లీ విచారిస్తున్న సమయంలో ప్రబీర్ పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తిని యూఏపీఏ కింద అరెస్టు చేశారని అన్నారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జైలుశిక్ష అనుభవించిన వ్యక్తి ప్రబీర్ పుర్కాయస్థ అని, పోలియో కారణంగా శారీరక సవాళ్లను ఎదుర్కొంటున్న వ్యక్తి అమిత్ చక్రవర్తి అని బృందాకరత్ తెలిపారు. అలాంటి నిస్వార్థ పాత్రికేయులపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేసినందుకు మోడీ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కెఎం తివారీ, అమర్‌జిత్ కౌర్ (సీపీఐ), జి దేవరాజన్ (ఫార్వర్డ్ బ్లాక్), రవిరారు (సీపీఐ-ఎంఎల్), ఆర్‌ఎస్ దాగర్ (ఆర్‌ఎస్‌పీ), ప్రకాశరావు (సీజీపీఐ) తదితరులు మాట్లాడారు.