సీజన్‌ అదిరింది గురూ…

 The season is here...– ఒకవైపు ఎన్నికలు.. మరోవైపు పండుగలు…
– ఓట్లతోపాటే బతుకమ్మ, దసరా నవరాత్రులు, దీపావళి
– ఈ రెండు నెల్లు సందడే సందడి
– అధికారికంగా బతుకమ్మ చీరెలు
– అనధికారికంగా మరెన్నో తాయిలాలు
– ఇటు మైకుల గోల..అటు టపాసుల మోత
– వేడెక్కనున్న శీతాకాలం
రాష్ట్రంలోని ఓటర్లకు బంపర్‌ బోనాంజా. ఒకవైపు ఎన్నికలు.. మరోవైపు పండుగలు… వెరసి ఇప్పటి నుంచి నవంబరు 30 వరకూ తెలంగాణ వ్యాప్తంగా హడావుడి.. అంతకుమించిన సందడి నెలకొననుంది. ఎన్నికలతోపాటే.. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు కలిసి సాగనున్నాయి. ప్రభుత్వం అధికారికంగా పంచే బతుకమ్మ చీరెలు, పార్టీలు అనధికారికంగా ఇచ్చే ఎన్నో తాయిలాలు… దీంతో ఓటరన్న ఉక్కిరి బిక్కిరి కావటం ఖాయం. గతేడాది నిర్వహించిన మునుగోడు ఉప ఎన్నిక, అంతకుముందు జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నిక చూసిన తర్వాత… వచ్చే నెల్లో రాష్ట్ర శాసనసభకు నిర్వహించబోయే ఎన్నికలు దేశంలోనే అత్యంత ఖరీదు కాబోతున్నాయని సర్వే సంస్థలు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బి.వి.యన్‌.పద్మరాజు
ఓటరన్నను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ పోటాపోటాగా, భారీగా ఖర్చు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటు న్నాయి. ఇందుకోసం రాబోయే పండగలను వేదికలుగా మలచుకోనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను అధికారిక పండుగగా గుర్తించింది. ఆ మేరకు ప్రతీయేటా నిధులను విడుదల చేసి సంబురాలను ఘనంగా నిర్వహిస్తోంది. దీంతోపాటు ఆడపడుచులకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేయటం ఆనవాయితీగా వస్తోంది. అయితే బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్‌, బీజేపీ తదితర ప్రధాన పార్టీలు ఇలాంటి అధికారిక కార్యక్రమాలతోపాటు అనధికారికంగా అనేక ‘కార్యక్రమాలకు’ శ్రీకారం చుట్టనున్నాయి. ముఖ్యంగా దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరూరా అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేయటం, పూజా సామాగ్రిని ఏర్పాటు చేయటం, తొమ్మిది రోజులపాటు దగ్గరుండి పూజలు చేయించటం ద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీలు ప్లానులు మీద ప్లానులు వేస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా వీటిని పూర్తి చేయాలంటూ ఇప్పటికే పార్టీల అధిష్టానాల నుంచి కిందిస్థాయికి ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. దీపావళికి ఇంటింటికీ టపాసులు పంచే కార్యక్రమానికీ నేతలు రూపకల్పన చేస్తు న్నట్టు వినికిడి. ఇప్పటికే వివిధ కుల సంఘాలను ఒక చోట చేర్చి.. ఆత్మీయ సమావేశాల పేరిట హడావుడి చేస్తోన్న పార్టీలు, ఆ సందర్భంగా పండగలకు ఏమేం కావాలో మొహమాట పడకుండా అడగండంటూ కుల పెద్దలకు సూచిస్తున్నారు.
మద్యం, మటన్‌, చికెన్‌తోపాటు ఇతరత్రా ఏమేం కావాలన్నా ‘మేం చూసు కుంటాం…’ అంటూ వారు హామీలిస్తున్నట్టు సమాచారం. మరోవైపు వివిధ జాతీయ, రాష్ట్ర పార్టీల నేతల బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రదర్శనలతో తెలం గాణ మార్మోగనుంది. వాటి మైకుల గోలతోపాటు దీపావళి టపాసుల మోత మోగనుంది. పండగలకు ఊళ్లకు వెళ్లి వచ్చే జనాలు, వారి కోసం కేటాయించిన బస్సులు, రైళ్లు, సొంత వాహనాలకు తోడు, అదే సమయంలో వందల కొద్దీ కార్లు, వాహనాలతో రోడ్లపై బారులు తీరే రాజకీయుల కాన్వారులు… వెరసి రద్దీతో రోడ్లన్నీ తడిసి ముద్దవనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల నిబంధనలు, నియమా వళి పక్కాగా అమలవుతుందా..? లేదా..? అనేది చూడాలి. పెద్ద ప్రశ్న. ఈ పరిణా మాలన్నింటి రీత్యా ఈ శీతాకాలం యమ రంజుగా ఉండబోతోంది. చలితో జనా లు వణికిపోయే అక్టోబరు, నవంబరు నెలల్లో తెలంగాణ ‘పొలిటికల్‌’గా హీటెక్కనుంది.

Spread the love