కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్ర

To confront the Congress BJP and BRS conspiracy– 90 లక్షల ఓట్లు తెచ్చుకుంటే…90 సీట్లు సాధిస్తాం
– వంద రోజులు కష్టపడండి…
– ఇందిరమ్మ రాజ్యం వస్తుంది
– కాంగ్రెస్‌ మండల అధ్యక్షుల
– శిక్షణ కార్యక్రమంలో రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొనేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. వంద రోజులు కష్టపడి 90 లక్షలు ఓట్లు తెచ్చుకుంటే, 90 సీట్లుసాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో కష్టపడి పనిచేయాలని కోరారు. వచ్చేది ఇందిరమ్మరాజ్యమేనన్నారు. అందుకోసం క్షేత్ర స్థాయిలో బూత్‌ లెవల్‌ ఏజెంట్లను నియమించాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండ పంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు, బ్లాక్‌ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల కు శిక్షణ శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షత వహించారు. జాతీయ నాయకులు కొప్పుల రాజు కార్యకర్తల శిక్షణకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల పాత్ర కీలకమైందన్నారు. కాంగ్రెస్‌ జెండాను మోసే నికార్సైన కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 43 లక్షల డిజిటల్‌ మెంబర్‌షీప్‌ ఉందని చెప్పారు. వంద రోజులు కాంగ్రెస్‌ పార్టీ కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేటాయించాలని కోరారు. అయ్యప్ప, శివ మాలధారణలా కాంగ్రెస్‌ దీక్ష తీసుకుని, సోనియమ్మ మాల వేసుకుని కష్టపడాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రజాకార్లు కూడా ఇంత దోపిడీ, ఇంత విధ్వసానికి పాల్పడలేదని చెప్పారు. తెలంగాణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగడం ఈ గడ్డకు దక్కిన గౌరవమేన్నారు. ఇక్కడ సమావేశాలు జరగడం పీసీసీ అధ్యక్షుడిగా నా జన్మ ధన్యమైందని వివరించారు. వక్ఫ్‌ భూమిలో నాంపల్లి విజయ నగర్‌ కాలనీలో ఎంఐఎంకు అనుమతి ఇచ్చారనీ, మరి తుక్కుగూడలో కాంగ్రెస్‌ సభకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. దేవుడి భూమి అనే సాకుతో అనుమతి నిరాకరించినా ఆ దేవుడే మనకు దారి చూపారని తెలిపారు. రైతులు స్వచ్చందంగా ముందుకొచ్చి విజయభేరి సభ కోసం వంద ఎకరాలు ఇచ్చారని పేర్కొన్నారు. ధర్మమే కాంగ్రెస్‌ను గెలిపిస్తుందనీ, వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీధర్‌ బాబు, రోహిత్‌ చౌదరీ, సంపత్‌ కుమార్‌, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, మన్సూర్‌ అలీఖాన్‌, బలరాం నాయక్‌, దీపదాస్‌ మున్షి తదితరులు పాల్గొన్నారు.

Spread the love