విద్యా రంగ పరిరక్షణ కోసం పోరాటాలు

Struggles for the protection of the education sector– 29 అంశాలపై తీర్మానాల ఆమోదం
– జయప్రదంగా ముగిసిన ప్లీనరీ
– రాబోయే కాలంలో సమరశీల పోరాటాలు : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
విద్యా రంగ పరిరక్షణ, విద్యార్థుల సమస్యలపై పోరాటాలు నిర్వహించేందుకు భవిష్యత్‌ కర్తవాలను రూపొందించినట్టు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు తెలిపారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మూడు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ఆదివారం జయప్రదంగా ముగిశాయి. మూడో రోజు ప్రతినిధుల సభలో నాగరాజు మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు జరిగిన ప్లీనరీ సమావేశాలు విద్యా రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించిన 29 తీర్మానాలను ఆమోదించినట్టు తెలిపారు. యూనివర్సిటీలు, సంక్షేమ, గురుకుల హాస్టళ్లు, ప్రభుత్వ స్కూల్స్‌ సమస్యలు, విద్యార్థినుల రక్షణ, ప్రయివేట్‌ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ, నూతన జాతీయ విద్యా విధానం రద్దు వంటి అంశాలపై చర్చించినట్టు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.5177 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు చదువుల్ని మధ్యలోనే ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో నెలకొన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఓసీల్లోని పేద విద్యార్థులు చదువుతున్న హాస్టల్స్‌, గురుకుల విద్యార్థులకు పెంచిన మెస్‌ ఛార్జీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ మార్చిన మెనూ అమలు కావడంలేదన్నారు. కార్పొరేట్‌, ప్రయివేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలని, ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా నిర్ణయాలు చేయాలని, రాష్ట్రంలో ఎన్‌ఈపీని అమలు చేయకూడదని సూచించారు. విద్యారంగంలో ఎదురవుతున్న సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ రాబోయే కాలంలో సమరశీలంగా ఉద్యమాలు నిర్వహించేలా భవిష్యత్‌ కర్తవ్యాల్ని రూపొందించినట్టు తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ నిరంతర పోరాటాలు చేస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు మూడు రోజుల పాటు జయప్రదంగా నిర్వహించిన ఆహ్వాన సంఘం కృషిని అభినందించారు.
రాష్ట్ర కమిటీలో పనిచేసిన కొందరు రిలీవ్‌ కాగా ఉద్యమ అవసరాల రీత్యా కొత్తవారిని రాష్ట్ర కమిటీలోకి తీసుకోవడం జరిగిందన్నారు. సమావేశాల్లో రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, రాష్ట్ర నాయకులు పూజ, రజినీకాంత్‌, దాసరి ప్రశాంత్‌, సంతోష్‌, కిరణ్‌, అశోక్‌రెడ్డి, కమ్మంపాటి శంకర్‌, రాజు, నల్లవల్ల రమేష్‌, ఎర్రోళ్ల సతీష్‌, అరవింద్‌, సాక్షి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love