నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి

The new education system should be abolished– శాతవాహన వర్సిటీకి రూ.200 కోట్లు కేటాయించాలి
– ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి
– ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు
– 21న కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు పిలుపు
ఎస్‌ఎఫ్‌ఐ పాదయాత్ర ముగింపు
నవతెలంగాణ-
కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / కరీంనగర్‌
”రాష్ట్రంలో విద్యారంగం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.. ఏ ప్రభుత్వ విద్యాలయంలో చూసినా కనీస సౌకర్యాలు.. సరిపడా బోధనా సిబ్బంది, తరగతి గదులూ లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలి.. నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి” అని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు అన్నారు.
కరీంనగర్‌ జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఏడు రోజులు సాగిన విద్యార్థి చైతన్య మహాపాదయాత్ర సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడుతూ.. జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీకి రూ.200కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 1న కరీంనగర్‌ జిల్లాలోని వీణవంకలో మొదలైన తమ విద్యార్థి నాయకుల యాత్ర సందర్భంగా విద్యాసంస్థల్లోని ఎన్నో సమస్య లు వెలుగుజూశాయని వివరించారు. వారంపాటు 450కిలోమీటర్లు సాగిన యాత్రలో ఆయా మండలా ల్లోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలను అధ్యయనం చేశారని తెలిపారు. అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య విద్యార్థులు అరిగోస పడు తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలే రూ.5177కోట్లు రావాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా రాష్ట్రాల్లో నూతన విద్యా విధానం అమలుతో మతప రమైన గొడవలకు విద్యాలయాలు వేదికలవుతున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నింటి పరిష్కారానికి ఈనెల 21న కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. అప్పటికీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకుంటే సెప్టెంబర్‌లో ప్రగతిభవన్‌ ఎదుట బైటాయిస్తామని హెచ్చరించారు.
భయాందోళనల మధ్య విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజినీకాంత్‌
కరీంనగర్‌ జిల్లాలో ఏ విద్యాలయాల్లోనూ కనీస సౌకర్యాలు లేవని ఎస్‌ఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్‌ తెలిపారు. శాతవాహన యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు సరిపడా లేరని, వర్సిటీలో రెగ్యులర్‌ కోర్సు లేకపోవడంతో పీహెచ్‌డీ చేయలేని పరిస్థితి ఉందని తెలిపారు. కనీసం కొత్త కోర్సులు బీఈడీ, ఎల్‌ఎల్‌బీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులు కూడా లేవని చెప్పారు. వర్సిటీలో బస్‌ సౌకర్యం, బ్యాంకు, డిజిటల్‌ పేమెంటు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీ సబ్‌ క్యాంపస్‌, ఫార్మసీ కాలేజీలో వర్షం వస్తే క్లాస్‌ రూముల్లోకి పైకప్పు నుంచి నీళ్లు వస్తున్నాయని, వర్షం వచ్చినప్పుడల్లా తరగతులు బంద్‌ చేస్తున్నారని తెలిపారు. జిల్లాకు ఒక అగ్రికల్చర్‌ యూనివర్సిటీ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్‌ కన్వీనర్‌ మక్కపెళ్లి పూజ మాట్లాడుతూ.. దేశంలో భారత్‌ మాతాకీ జై అనే వారే మహిళలపై లైంగికదాడులకు పాల్పడుతున్నారని, నిందితులు దర్జాగా బయటకు వస్తున్న ఘటనలు కండ్ల ఎదుటే కనిపిస్తున్నాయని అన్నారు. యాత్రలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్‌, జిల్లా అధ్యక్షులు కంపెల్లి అరవింద్‌, జిల్లా ఉపాధ్యక్షులు వినీషా రోహిత్‌, అభిలాష్‌, సహాయ కార్యదర్శులు శ్రీజ, మనోజ్‌, వినరు, సురేష్‌, జిల్లా కమిటీ నాయకులు శ్రీవాణి, సందేశ్‌, సందీప్‌, రాకేష్‌, సుదీర్‌, ఇషాక్‌, వంశీ, శివ, నవీన్‌, రాకేష్‌, రమ్య, హిందూ నితేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love