నవతెలంగాణ- రాంచీ : బెయిల్‌పై జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసర జాబితా కింద ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని సోరెన్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టును కోరారు. ఈ అభ్యర్థనను పరిశీలిస్తామని సిజెఐ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ జె.బి. పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఇడి అరెస్టును సవాలు చేస్తూ సోరెన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను జార్ఞండ్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. ల్యాండ్ స్కామ్ ఆరోపణలపై హేమంత్ సోరెన్‌ను జనవరి 31న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా సోరెన్ రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో ఉన్నారు. 13 రోజుల ఇడి కస్టడీ అనంతరం ఫిబ్రవరి 15న ఆయనను జైలుకు తరలించారు.