ఆ లేఖ ప్రధాని మోడీ ‘ఆర్కెస్ట్రా ప్రచారం’ లో భాగం

నవతెలంగాణ – న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 21 మంది రిటైర్డ్‌జడ్జీలు రాసిన లేఖ ప్రధాని మోడీ ఆర్కెస్ట్రా ప్రచారంలో భాగమని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థపై ఒత్తిడి, తప్పుడు సమాచారం, బహిరంగంగా అవమానించడం ద్వారా కొన్ని వర్గాలు ఆ వ్యవస్థపై అణచివేత యత్నాలను తీవ్రతరం చేస్తున్నాయని 21 మంది రిటైర్డ్‌ జడ్జీలు సిజెఐకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్న న్యాయవ్యవస్థను బెదిరించడం, భయపెట్టడమని పేర్కొంది. సోమవారం ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ లేఖపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ మాట్లాడారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు బిజెపి నుండి వచ్చిన అతిపెద్ద ముప్పుగా పేర్కొన్నారు. లేఖను రాసిన వారి జాబితాలో నాలుగవ పేరును గమనిస్తే.. ఆ లేఖ లక్ష్యం, నేపథ్యం, అంతరార్థం తెలుస్తుందని అన్నారు. ఈ లేఖలో పేర్కొన్న వ్యాఖ్యలు, ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ప్రదాని మోడీపై చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఈ లేఖ ఎవరు పంపారో తెలుస్తుందని అన్నారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎం.ఆర్‌.షా ఈలేఖలో సంతకం చేసిన నాలుగవ వ్యక్తి. ఎలక్టోరల్‌ బాండ్స్‌ కుంభకోణంను దేశంలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని, మణిపూర్‌లో రాజ్యాంగ యంత్రాంగానికి విఘాతం కలుగుతోందని స్పష్టంచేసింది. దీంతో సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకున్నారని జైరాం రమేష్‌ ధ్వజమెత్తారు. ఇటీవల సుప్రీంకోర్టులోని ప్రముఖ మహిళా జడ్జి నోట్లరద్దును తీవ్రంగా విమర్శించారని అన్నారు.ఇటీవల మోడీ స్నేహితులైన 600 మంది న్యాయవాదులు సిజెఐకి లేఖ రాసినట్లుగానే ఇప్పుడు కూడా మోడీ స్నేహితులైన 21 మంది మాజీ న్యాయవాదులు లేఖ రాశారని అన్నారు. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతను బెదరించడం, భయపెట్టడమేనని స్పష్టంచేశారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు అతిపెద్ద ముప్పు కాంగ్రెస్‌ నుండి కాదని, బిజెపి నుండి, ప్రధాని మోడీ నుండి వచ్చిందని అన్నారు.

Spread the love