సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోడీ

నవతెలంగాణ – న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు. 75వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1950 జనవరి 28న ప్రారంభమైన దేశ సర్వోన్నత న్యాయస్థానం నేడు 75వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వజ్రోత్సవేడుకలను ప్రారంభిస్తూ.. సుప్రీంకోర్టు కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. దీంతో దేశ పౌరులకు ఉచితంగా డిజిటల్‌ ఫార్మాట్‌లో సుప్రీం కోర్టు నివేదికలు, తీర్పులు అందుబాటులోకి రానున్నాయి. డిజిటల్‌ సుప్రీం కోర్టు నివేదికలు (డీజీ ఎస్‌సీఆర్‌), డిజిటల్‌ కోర్టులు 2.0, అనంతరం 1950 నుంచి ఉన్న సుప్రీం కోర్టు నివేదికలు, 519 వాల్యూమ్స్‌ నివేదికలు, 36,308 కేసుల తీర్పులు డిజిటల్‌ ఫార్మాట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
ఏడు దశాబ్దాల్లో సుప్రీంకోర్టు ఎన్నో చారిత్రాత్మక తీర్పులనిచ్చిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కోర్టుల డిజిటలైజేషన్‌ గొప్ప ముందడుగు అని, దేశ పౌరుల హక్కులను కాపాడటంలో  సుప్రీంకోర్టుది కీలక పాత్ర అని అన్నారు.  ప్రజాస్వామ్య పరిరక్షణకు సామాజిక న్యాయానికి సుప్రీంకోర్టు నిరంతరం కృషి  చేసిందని అన్నారు.  1950 జనవరి 28 ఉదయం 9.45 గంటలకు పార్లమెంటు భవనంలోని ఛాంబర్‌ ఆఫ్‌ ప్రిన్సెస్‌లో న్యాయమూర్తులు తొలిసారి సమావేశమవడంతోనే సుప్రీంకోర్టు అధికారికంగా ప్రారంభమైంది. ప్రారంభంలో 8గా ఉన్న జడ్జీల సంఖ్య ప్రస్తుతం 34కు చేరింది.

Spread the love