రామ్‌దేవ్‌ బాబాపై మండిపడిన సుప్రీంకోర్టు

నవతెలంగాణ – న్యూఢిల్లీ :    ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో యోగా గురు రామ్‌దేవ్‌, పతంజలి డైరెక్టర్‌ బాలకృష్ణలపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రంగా మండిపడింది. కోర్టు వ్యవహారాల గురించి తెలియకపోవడానికి మీరేమీ అమాయకుల కాదని మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. మూడు సార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరించారని దుయ్యబట్టింది. మిమ్మల్ని క్షమించాలా వద్దా అని ఇంకా నిర్ణయించుకోలేదని జస్టిస్‌ హిమా కొహ్లీ, జస్టిస్‌ ఎ. అమానుల్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ‘యోగా’కు మీరు అందించిన సహకారం మరువలేనిదని, అయితే వారి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయుర్వేద ప్రయోజనాలను గురించి వివరించేందుకు ఇతర వైద్య వ్యవస్థలను దుర్వినియోగం చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. చట్టం అందరికీ ఒకటేనని జస్టిస్‌ అమానుల్లా పేర్కొన్నారు.  వారంరోజుల్లోగా క్షమాపణలు  తెలుపుతూ బహిరంగ ప్రకటన విడుదల చేయాలని కోర్టు హెచ్చరించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్‌ 23కి వాయిదావేసింది. బహిరంగ క్షమాపణలు చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని యోగా గురు రామ్‌దేవ్‌, పతంజలి డైరెక్టర్‌ బాలకృష్ణలు సుప్రీంకోర్టుకు తెలిపారు. పంతజలి సహ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్‌, ఆ సంస్థ సిఇఒ బాలకృష్ణ  క్షమాపణలను తిరస్కరిస్తూ.. గత వారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  కోర్టు   చర్యలకు సిద్ధం కావాలని ఆదేశించింది.   క్షమాపణ కాగితంపై మాత్రమే ఉందని, కానీ వారి యథావిథిగా వ్యవహరిస్తున్నారని మండిపడింది. కోర్టు చర్యల నుండి తప్పించుకునేందుకు కేవలం ఆత్మరక్షణ కోసమే క్షమాపణలు చెప్పారని మండిపడింది. ‘క్యూర్‌ ఫర్‌ కొవిడ్‌’ ప్రకటనలపై చర్యలు తీసుకోని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది.

Spread the love