బ్రెజిల్‌ అతలాకుత‌లం.. వరదల ధాటికి 75 మంది మృతి!

నవతెలంగాణ -బ్రెజిల్‌: బ్రెజిల్‌లో గత కొన్ని రోజులుగా కుండ‌పోత‌ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు భారీగా వరదలు పోటెత్తాయి. దీంతో అక్కడ జన జీవనం పూర్తిగా అస్త‌వ్య‌స్తంగా మారిపోయింది.  ప్ర‌ధానంగా ద‌క్షిణాది రాష్ట్రం రియో గ్రాండే డుసుల్‌ను భారీ వ‌ర్షాలు అతలాకుత‌లం చేస్తున్నాయి. ఈ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్త‌డంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. గ‌డిచిన 7 రోజుల నుంచి ఇప్పటి వరకూ 75 మంది మృతిచెందగా, సుమారు 103 మంది గల్లంతైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. వరదలకు 155 మందికిపైగా గాయపడినట్లు తెలిపింది. సుమారుగా 88 వేల‌ మందికిపైగా ప్రజలు నిరాశ్రయులైనట్లు వెల్ల‌డించింది. అలాగే 16 వేల మందికి స్కూళ్లు, ఇత‌ర సుర‌క్షిత‌ ప్రాంతాల‌లో తాత్కాలిక వ‌స‌తి క‌ల్పించిన‌ట్లు పేర్కొంది. వరదల కారణంగా పలు నగరాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రధాన వంతెనలు ధ్వంసమయ్యాయి. వర్షాల కారణంగా కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్‌, సమాచార వ్యవస్థలు స్తంభించిపోయాయి. 8 ల‌క్ష‌ల‌కు పైగా మంది ప్ర‌జ‌లు తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు నాలుగు లక్షల మందికిపైగా ప్రజలు అంధకారంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. సైన్యాన్ని కూడా రంగంలోకి దించింది.

Spread the love