ఇడిసోదాల్లో గుట్టలుగా నగదు..

నవతెలంగాణ – రాంచీ : జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సోమవారం సోదాలు జరిపింది. 2003లో అరెస్టయిన జార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ వీరేంద్ర రామ్‌కి చెందిన 12కి పైగా ప్రాంతాల్లో సోదాలు జరిపింది. ఈ క్రమంలోనే గ్రామీణాభివఅద్ధి శాఖ మంత్రి అలంఘీర్‌ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌ లాల్‌కు సహాయకుడికి చెందినదిగా భావిస్తోన్న ఇంట్లో నోట్ల గుట్టలు దర్శనమిచ్చాయి. ఈ నగదు రూ.25 కోట్ల వరకు ఉండవచ్చని ఇడి పేర్కొంది. రాంచీలోని సెయిల్‌ సిటీతో సహా తొమ్మిది ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది. సోమవారం ఉదయం రహదారుల నిర్మాణ విభాగానికి చెందిన ఇంజనీర్‌ వికాస్‌ కుమార్‌ ఆచూకీ కోసం ఇడి బృందం సెయిల్‌ సిటీలో గాలిస్తోంది. మరో ఇడి బృందం బరియాతు, మోరబాది, బోడియా ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. పలు ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలకు పాల్పడ్డారని, రూ.100 కోట్ల మేర నగదును వీరేంద్ర అక్రమంగా కూడబెట్టారని ఇడి ఆరోపిస్తోంది. ఈ సమాచారం ఆధారంగానే సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.

Spread the love