మోడీ నోట కోవిడ్‌ క‌హనీ..

Modi's mouth is the story of Covid– ఎన్నికల ప్రచారంలో మహమ్మారి ప్రస్తావన
– సమర్ధవంతంగా ఎదుర్కొన్నామంటూ స్వీయ కితాబులు
– వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం కోవిడ్‌ సమయంలోనే
పశ్చిమ బెంగాల్‌, కేరళ రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ప్రచార సభల్లో ప్రధాని మోడీ ప్రసంగించారు. వివిధ పార్టీల నేతలు హాజరైన ర్యాలీలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆ సమయంలోనే కొన్ని చోట్ల మతపరమైన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ పరిణామాలన్నీ కోవిడ్‌ వ్యాప్తికి కారణమయ్యాయి.
న్యూఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభమైంది. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదు. అందివచ్చిన అన్ని అవకాశాలనూ ఆ పార్టీ వినియోగించుకుంటోంది. చివరికి 2019లో వచ్చిపడిన కోవిడ్‌ మహమ్మారిని కూడా ఆ పార్టీ నేతలు వదలడం లేదు. కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని, ఆ విపత్తు నిర్వహణలో తమకు తామే సాటి అని గొప్పలు చెప్పుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ కోవిడ్‌ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ కష్టకాలంలో తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, దేశ ప్రయోజనాలకే పెద్ద పీట వేసిందని ఆయన చెప్పారు.
రెండో దశ కోవిడ్‌ మహమ్మారి విరుచుకుపడిన మూడు సంవత్సరాల తర్వాత లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే దీనిని అడ్డుకోవడంలో, ప్రజల ప్రాణాలు కాపాడడంలో ఎంతో కృషి చేశామని మోడీ ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవాలను పరిశీలిస్తే అందుకు భిన్నమైన చిత్రం కన్పిస్తుంది. ఆక్సిజన్‌ లభించక నిస్సహాయ స్థితిలో ప్రజలు రోడ్ల పైనే ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు ఇప్పటికీ కండ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. తమ వారి కోసం కనీసం ఒక్క ఆస్పత్రి పడక అయినా దొరక్కపోతుందా అన్న ఆతృతతో కుటుంబసభ్యులు పరుగులు పెట్టిన ఉదంతాలు కూడా వెంటాడుతూనే ఉన్నాయి.
అంతిమ సంస్కారాల కోసం పడిగాపులు
కోవిడ్‌ కారణంగా మరణించిన వారి మృతదేహాలు గంగానది ఒడ్డున పడి ఉన్న భయానక దృశ్యాలు, వాటికి అంతిమ సంస్కారాలు జరిపేందుకు స్మశానవాటికల వెలుపల బారులు తీరి ఎదురు చూపులు చూసిన బంధువుల ఆక్రందనలు… వీటన్నింటినీ ఎలా మరచిపోగలం? అయితే ప్రధానికి మాత్రం ఇవేవీ గుర్తుండక పోవచ్చు. ఒకవేళ గుర్తుకొచ్చినా సామాన్య ప్రజల జ్ఞాపకాల పొరల నుండి వాటిని చెరిపేసేందుకు ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నిస్తూ ఉండవచ్చు. కోవిడ్‌ సమయంలో అత్యవసర మందులు దొరకడమే గగనమైపోయింది. ఒకవేళ దొరికినా ధరలు మాత్రం ఆకాశాన్ని తాకాయి. చీకటి బజారులో ఉన్న మందులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఓ రాష్ట్ర హైకోర్టు సైతం ఈ విషయాన్ని వేలెత్తి చూపింది. బాధితులకు సాయపడడానికి ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థలకు కూడా ప్రభుత్వ సహకారం లభించకపోవడం విషాదకరం.
హెచ్చరికలు బేఖాతరు
కోవిడ్‌ రెండో దశ ప్రారంభం కావడానికి ముందు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తరచుగా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రధాని కూడా టీవీలలో ప్రజలకు కన్పించి, వారిని ఉద్దేశించి ప్రసంగించారు. రెండో దశ ప్రారంభమైన తర్వాత ఈ దృశ్యాలేవీ కన్పించలేదు. ప్రజలకు కనీసం సూచనలు, సలహాలు ఇచ్చే నాథుడే కరువయ్యాడు. ఆక్సిజన్‌, మందుల సరఫరా విషయంలో సుప్రీంకోర్టు తనంతతానుగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 12 మంది స్వతంత్ర శాస్త్రవేత్తలు, అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. రెండో దశ కోవిడ్‌ రావడానికి నెల రోజుల ముందే శాస్త్రవేత్తలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వంతో కదలిక కన్పించలేదు. ఆ హెచ్చరికలన్నిటినీ పెడచెవిన పెట్టింది.
తొలి దశ సమయంలోనూ…
కోవిడ్‌ తొలి దశ సమయంలో మోడీ ప్రభుత్వం కేవలం నాలుగు గంటల వ్యవధి ఇచ్చి విధించిన లాక్‌డౌన్‌ కారణంగా వేలాది మంది వలస కార్మికులు వందలాది మైళ్ల దూరాన్ని దాటుకుంటూ రోజులు, వారాలు కాలినడకన ప్రయాణించి స్వస్థలాలకు చేరిన హృదయవిదారక దృశ్యాలను ఎలా మరచిపోగలం? ఆహారం, తాగునీరు సైతం లేకుండా పిల్లాపాపలతో మండుటెండలో నడిచిన సన్నివేశాలను ఎలా మరువగలం? ఈ ప్రయాణంలో కొందరు కార్మికులు రోడ్ల పైనే కన్నుమూశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు లాఠీఛార్జీ చేస్తుంటే కొందరు ఆ దెబ్బలు రుచిచూశారు. వీటన్నింటినీ ముందుగానే అంచనా వేయడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. కార్మికులను ఉచితంగా తరలిస్తామంటూ విమాన సంస్థలు ముందుకొచ్చినా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ముస్లింలు తబ్లిగీ జమాత్‌ నిర్వహించడం వల్లనే కోవిడ్‌ వేగంగా విస్తరించిందంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిందలు వేసింది.
వ్యాక్సిన్‌ తయారీలోనూ అదే తీరు 
కోవిడ్‌ మొదటి దశలోనే వ్యాధి నివారణకు వ్యాక్సిన్‌ను కనిపెట్టాలన్న ఒత్తిడి పెరిగింది. అయితే స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కోవాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి సమయం పట్టింది. ఈ క్రమంలోనే భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) అనుసరించిన వైఖరి విమర్శలకు దారితీసింది. చివరికి 2021 జనవరిలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. అది కూడా వివాదాస్పదమే అయింది. ఈ వ్యాక్సిన్‌ కోసం ప్రజలు చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. చివరికి అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన ప్రాణనష్టం జరిగిపోయింది. చాలా మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ అందలేదు.
భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉన్నదా? జరిగిన పొరబాట్ల నుండి పాఠాలు నేర్చుకుంటుందా? ఈ ప్రశ్నలకు జవాబులు రాజకీయ ఉపన్యాసాలలోనే మనకు దొరుకుతాయి.
గాలిలో కలిసిన 47 లక్షల ప్రాణాలు
కోవిడ్‌ కారణంగా ప్రపంచంలో మన దేశంలోనే అధిక మరణాలు సంభవించాయి. రెండో దశ వరకూ భారత్‌లో 47 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్యను 4.8 లక్షలుగానే చూపింది. పైగా డబ్ల్యూహెచ్‌ఓ నివేదికను తోసిపుచ్చింది. మృతుల సంఖ్యను అంచనా వేసేందుకు డబ్ల్యూహెచ్‌ఓ అనుసరించిన పద్ధతికి మన అధికారులు దురుద్దేశాలు ఆపాదించారు. వాస్తవానికి ఆ సంస్థ నివేదికను తోసిపుచ్చిన ఏకైక దేశం ప్రపంచంలో భారత్‌ మాత్రమే. పౌర నమోదు వ్యవస్థ (సీఆర్‌ఎస్‌) రికార్డు చేసిన మరణాలను కూడా మోడీ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. పలు స్వతంత్ర శాస్త్రవేత్తల అధ్యయనాలను సైతం తోసిపుచ్చింది.

Spread the love