మోడియా

Modia– అబద్ధాలు..నకిలీ వార్తలు
– ఎన్నికల సమయంలో ప్రజలను ప్రభావితం చేసే చర్యలు
– అయినా ప్రశ్నించని ప్రధానస్రవంతి మీడియా
– ప్రధాని ఇంటర్వ్యూల్లో సైతం ఇది స్పష్టం
– తప్పుబడుతున్న మేధావులు, విశ్లేషకులు, సామాజికవేత్తలు
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. అంతే వేడితో ఎన్నికల రాజకీయమూ నడుస్తున్నది. ఓటర్లను ఆకర్షించటానికి రాజకీయ పార్టీలు అనేక వ్యూహాలు పన్నుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ వంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ ఎన్నికల మ్యానిఫెస్టోలతో ప్రజల ముందుకొచ్చాయి. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో తొలి దశ పూర్తయింది. మిగిలిన ఆరుదశల ఎన్నికలు పలు రాష్ట్రాల్లో జరగనున్నాయి. దీంతో ప్రాంతానికో వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. అందువల్ల ఓటర్లు ఎవరికి మద్దతిస్తారోనన్నది జూన్‌ 4 వరకు సస్పెన్స్‌గానే ఉన్నది. అయితే ప్రజలు తమ నిర్ణయానికి తుది రూపు ఇవ్వటంలో మీడియా పాత్ర చాలా కీలకం. ఎందుకంటే, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు చేసే పనులు, చర్యల గురించి సమాచారాన్ని చేరవేస్తుంటాయి. మరికొన్ని మీడియా సంస్థలైతే నిపుణులు, రాజకీయ నాయకులతో చర్చలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటాయి. ఇలా ప్రజలకు ఒక సమాచారాన్ని అందే కృషిని చేస్తుంటాయి. అయితే, దేశంలో ఒక వర్గం మీడియా మాత్రం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నది. ఆ పార్టీ కానీ, ప్రధాని మోడీ కాని చేసే అబద్ధపు మాటలు, నకిలీ ప్రచారాలను ప్రశ్నించలేకపోతున్నది. దీంతో ప్రధాన స్రవంతి మీడియాకు ప్రజల్లో ఉన్న కొద్ది విశ్వాసమూ తగ్గిపోయిందని రాజకీయ నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు.
న్యూఢిల్లీ : ప్రధాన స్రవంతి మీడియాలో వచ్చే వార్తలు ఎక్కువగా మోడీ, ఆయన మంత్రివర్గం, పార్టీలోని ఇతర ప్రముఖులను హైలెట్‌ చేసేలా.. కాంగ్రెస్‌, ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ, ఇతర ప్రతిపక్ష కూటమిలోని ఇతర ప్రముఖుల రాజకీయ ప్రసంగాలను విమర్శించేలా, ప్రజల్లో ఒక ప్రతికూల భావన వచ్చేలా ఉంటున్నాయని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. కోట్లాది మంది ప్రజలున్న ఈ దేశంలో విభిన్న స్వరాలను, అభిప్రాయాలను నివేదించడానికి ప్రధాన స్రవంతి మీడియా ఇబ్బంది పడుతున్నదని అంటున్నారు. దేశంలో అనేక స్వతంత్ర డిజిటల్‌ వార్తల ప్లాట్‌ఫారమ్‌లు, ఛానెల్‌లు ఉన్నాయి… అయినప్పటికీ ప్రధాన స్రవంతి మీడియా నుంచి వచ్చే వార్తలను ఒక సాధారణ వ్యక్తి విశ్వసిస్తాడని వీరు చెప్తున్నారు. అలాంటి నమ్మకాన్ని పొందిన మీడియా బాధ్యతగా ఉండాలని అంటున్నారు. నకిలీ, తప్పుదారి పట్టించే వార్తలు, ద్వేషపూరిత ప్రసంగాలు, ఒక నిర్దిష్ట కథనాన్ని ముందుకు నెట్టడానికి వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించటం వంటివి బీజేపీ శ్రేణులు చేస్తున్నా.. మీడియా మాత్రం దానిని పట్టించుకోవటం లేదని సామాజికవేత్తలు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.”నకిలీ వార్తలపై భారత యుద్ధం: తప్పుడు సమాచారం భారతదేశానికి మొదటి ముప్పుగా ఎలా మారింది” అనే శీర్షికతో ఉన్న డాక్యుమెంటరీ.. ”భారత్‌లో నకిలీ వార్తలు పరిశ్రమగా ఎందుకు రూపాంతరం చెందాయి?” అని ప్రశ్నించింది. ఈ డాక్యుమెంటరీలో ఫేక్‌ న్యూస్‌ ద్వారా పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తున్న ఫ్యాక్ట్‌ చెకర్లు కూడా ఉన్నారు.ప్రధాన స్రవంతి మీడియా వార్తలను నివేదిస్తున్నది కానీ ప్రశ్నించటం లేదని మేధావులు అంటున్నారు. ఉదాహరణకు.. ”అబ్కీ బార్‌ 400 పార్‌” అనే నినాదాన్ని బీజేపీ వినిపిస్తున్నది. ”ఆ పార్టీకి అదనపు సీట్లు ఎక్కడి నుంచి వస్తాయని మీడియా ఎందుకు అడగటం లేదు? బీజేపీకి 150 సీట్లు మాత్రమే వస్తాయని చెబుతున్న రాహుల్‌ గాంధీని ఎందుకు ప్రశ్నించదు” అని విశ్లేషకులు అంటున్నారు. ఎలక్టోరల్‌ బాండ్ల పథకం అంతా తన ఆలోచనేనని, విజయవంతమైందని మోడీ చెప్పారు. ఇది ఎన్నికల నిధులను సమకూర్చటంలో పారదర్శకతను తీసుకువచ్చిందనీ, దురదృష్టవశాత్తూ ఇప్పుడు మనం నల్లధనం పాత రోజులకు తిరిగి వస్తామని ఆయన అన్నారు. అయితే, ఈ సందర్భంలో ‘సుప్రీంకోర్ట్‌’ అనే పదం జర్నలిస్టు నుంచి కానీ, మోడీ నుంచి కానీ రాకపోవటం గమనార్హం. ఎలక్టోరల్‌ బాండ్ల మొత్తం పథకాన్ని ”రాజ్యాంగ విరుద్ధం” అని సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం విదితమే. బాండ్లను ఎవరు కొనుగోలు చేశారు? ఏ రాజకీయ పార్టీ వాటిని ఎన్‌క్యాష్‌ చేసిందనే మొత్తం డేటాను బహిర్గతం చేయాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ)ని సైతం సుప్రీం ఆదేశించింది.ఇంటర్వ్యూ మొత్తం మోడీకి అనుకూలంగా జరిగింది. ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసిన 16 కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాడులు చేసిందనీ, వాటి విరాళాల్లో 67 శాతం ప్రతిపక్ష పార్టీలకు వెళ్లాయని ఆయన చెప్పారు. ”ఇవి ఏయే కంపెనీలు? అనేక కంపెనీలపై దాడులు జరిపిన తర్వాత బీజేపీకి విరాళాలు అందిన వాటి సంగతేంటి?” వంటి ప్రశ్నలను సదరు ఏఎన్‌ఐ జర్నలిస్టు ఎందుకు అడగలేదని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి కఠినమైన, కష్టతరమైన ప్రశ్నలు లేనందున మోడీ తాను చెప్పాలనుకున్నది అంతరాయం లేకుండా చెప్పారని అంటున్నారు.
కీలకాంశాలు లేవనెత్తని ‘న్యూస్‌వీక్‌’
అంతర్జాతీయంగా పేరున్న ‘న్యూస్‌వీక్‌’ జర్నల్‌ కూడా ప్రధానితో ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇదే విధానాన్నిన అవలంబించిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ప్రశ్నలు లేని ఒక ఇంటర్వ్యూగా ఇది సాగిందని చెప్తున్నారు. పైగా ఇది మోడీ ఫేస్‌తో, ”ఆన్‌స్టాపబుల్‌” అంటూ ఇది కవర్‌ స్టోరీగా మారిందని తెలిపారు. అయితే, ఈ ఇంటర్వ్యూలలో భారత్‌లో మతపరంగా వివక్షను ఎదుర్కొంటున్న మైనారిటీల గురించి, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛపై ప్రశ్నలు ఎందుకు రాలేదని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
‘ముస్లిం మైనారిటీ’లకు బదులు పార్శీల గురించి సమాధానం
లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న ఫైనాన్షియల్‌ టైమ్స్‌.. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు మోడీని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించి ఒక ప్రశ్న-జవాబు ఆకృతిలో కాకుండా.. నివేదికగా పొందుపర్చింది సదరు సంస్థ. ఇంటర్వ్యూలో భాగంగా ఫైనాన్షియల్‌ టైమ్స్‌ భారత్‌లోని ముస్లిం మైనారిటీల భవిష్యత్తు గురించి అడిగింది. భారత్‌లో నివసిస్తున్న మతపరమైన సూక్ష్మ-మైనారిటీ అని ఆయన అభివర్ణించే భారతదేశ పార్సీల ఆర్థిక విజయాన్ని మోడీ ఈ సందర్భంగా సూచించారు. ”ప్రపంచంలో మరెక్కడా హింసను ఎదుర్కొంటున్నప్పటికీ, వారు భారత్‌లో సురక్షితంగా ఉన్నారు. సంతోషంగా అభివృద్ధి చెందుతున్నారు” అని మోడీ చెప్పారు. దేశంలోని ముస్లింల గురించి మాత్రం ఆయన ప్రత్యక్షంగా ప్రస్తావించకపోవటం గమనార్హం. దీని ప్రకారం భారతీయ సమాజానికి ఏ మతపరమైన మైనారిటీ పట్ల వివక్ష భావం లేదని చెప్పటం ఆయన ఉద్దేశంగా కనిపిస్తున్నదని విశ్లేషకులు చెప్పారు. ఏఎన్‌ఐ వంటి ఈ రకమైన జర్నలిజం.. ఒక రాజకీయ నాయకుడు చాలా తేలికగా తప్పించుకోవడానికి అనుమతిస్తుందని మేధావులు, విశ్లేషకులు, సామాజికవేత్తలు అంటున్నారు.
ఎదురు ప్రశ్నలు లేకుండా ఏఎన్‌ఐ ఇంటర్వ్యూ
ఇటీవల ఏఎన్‌ఐ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ స్మితా ప్రకాష్‌కు ప్రధాని మోడీ గంట సేపు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే, తను ప్రధానిగా ఉన్న పదేండ్లలో నేరుగా పత్రికలతో మాట్లాడటంపై నిరాసక్తత ప్రదర్శించిన మోడీ.. కేవలం ఎన్నికలకు ముందే ఎందుకు మాట్లాడుతున్నారన్న అంశాన్ని మీడియా ఎందుకు విశ్లేషించదని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా స్మితా ప్రకాశ్‌ మోడీని ప్రశ్నలు అడిగారు. మోడీ నుంచి సుదీర్ఘ సమాధానాలు వచ్చినపుడు ఓపికగా వేచి ఉన్నారు. సత్యదూరమైన స్పందనలను మోడీ చెప్పినా.. ఆమె(స్మితా ప్రకాశ్‌) ఎలాంటి ఆటంకాలు, అనుసరణలు, ఎదురు ప్రశ్నలు వేయలేదు. కాగా, ఈ ఇంటర్యూ అన్ని ఛానెల్‌లలో ప్రసారం చేయబడి, ప్రింట్‌లో నివేదించబడింది.

Spread the love