ఇండియా కూటమిని గెలిపించాలి

Alliance of India Must win– సీపీఐ(ఎం) ఎన్నికల సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– ఇండియా కూటమి పేరు వింటేనే మోడీకి చెమటలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్‌
దేశ సమైక్యత, సమగ్రత కోసం దేశంలో జరుగుతున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ గెలిపించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల సభలో మంత్రితో పాటు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తప్పు చేసిన వారిని ఎండగట్టి నిలదీసేది సీపీఐ(ఎం)యేనని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తప్పు చేసినా నిలదీసి ప్రజల కోసం నిలబడగలిగేది వామపక్షాలేనని అన్నారు. వామపక్ష పార్టీల మొదటి తరం నాయకులతో కలిసి పనిచేసిన రోజులు, అనుభవాలు తనకు ఉన్నాయని గుర్తు చేశారు. దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశ భవిష్యత్తు కోసం ఇండియా కూటమిని ఐక్యం చేసి ఈరోజు ఎన్నికల్లో ముందుకు దూసుకుపోవటంలో సీపీఐ(ఎం) పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. కులాలు, మతాల పేరుతో ప్రజలను విచ్చిన్నం చేస్తూ వారి మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీని దేశంలో ఓడించాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీకి మనుగడ లేదని, అలాగే, బీఆర్‌ఎస్‌ దుకాణం మూసుకున్నట్లేనని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి పొరిక బలరాం నాయక్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఇండియా కూటమి పేరు వింటేనే మోడీకి చెమటలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య
ఇండియా కూటమి పేరు వింటేనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకీ చెమటలు పడుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. పదేండ్లు అబద్ధాలతో అధికారాన్ని నెట్టుకొచ్చిన బీజేపీ.. ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇంటింటికి రాముని బియ్యం అందించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ అమలు చేస్తామని గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన బీజేపీ, దాని అమలు చేయకుండా మద్దతు ధర కోసం ఢిల్లీ నడివీధుల్లో పోరాటం చేసిన 750 మంది రైతులను పొట్టన పెట్టుకుందని అన్నారు. గతంలో దేశ సంపదను దోచుకొని మూటగట్టుకున్న వారిని ఈ దేశం నుండి పారిపోవడానికి అవకాశం కల్పించింది నరేంద్ర మోడీ కాదా అని ప్రశ్నించారు. కిరాతకులని, దేశద్రోహులను నరేంద్ర మోడీ రక్షిస్తే, అయన్ను ఆర్‌ఎస్‌ఎస్‌ రక్షిస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని, ఇండియా కూటమిలో భాగస్వామ్యం ఉన్న కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.
బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలి – సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
వరంగల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తే ఇక్కడ వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి ఉంటుందని జి.నాగయ్య ప్రభుత్వాలకు గుర్తు చేశారు. ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నా సీపీఐ(ఎం) ఎన్నికల తర్వాత ఈ రెండింటి సాధన కోసం ఉద్యమిస్తుందని, ఈ ఉద్యమానికి ప్రజలు సంఘీభావంగా ఉంటూ పోరాటంలో కలిసి రావాలని తెలిపారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సభలో ఎమ్మెల్యేలు డాక్టర్‌ మురళి నాయక్‌, డాక్టర్‌ జాటోత్‌ రామచంద్రనాయక్‌, సీపీఐ(ఎం) వరంగల్‌ జిల్లా కార్యదర్శి సిహెచ్‌.రంగయ్య, ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, ఇల్లందు నియోజకవర్గం ఇన్‌చార్జి దుగ్గి కృష్ణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుర్నపు సోమయ్య, ఆకుల రాజు, గుణగంటి రాజన్న, అలవాల వీరయ్య, కందునురి శ్రీనివాస్‌, మండ రాజన్న, బానోతు సీతారాం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love