ఆదిలాబాద్‌పై హస్తం గురి..!

Aim at Adilabad..!– బరిలో ఆదివాసీ హక్కుల ఉద్యమకారిణి ఆత్రం సుగుణ
– పార్టీ అగ్రనేతల ప్రత్యేక దృష్టి
– లోక్‌సభ పరిధిలో రెండు సార్లు సీఎం పర్యటన
– కాంగ్రెస్‌ అభ్యర్థికే వామపక్షాల మద్దతు : నేడు నిర్మల్‌కు రాహుల్‌గాంధీ
– భారీ జన సమీకరణకు నేతల ప్లాన్‌
ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా హస్తం పార్టీ పావులు కదుపుతోంది. విజయమే లక్ష్యంగా పార్టీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఉపాధ్యాయురాలు, ఆదివాసీ గిరిజనుల హక్కుల ఉద్యమకారిణి ఆత్రం సుగుణను బరిలో దింపగా.. లోక్‌సభ పరిధిలో విస్తృతం ప్రచారం చేపడుతూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ నేతలు మరింత పటిష్ట కార్యాచరణ రూపొందించారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌లో బహిరంగ సభల్లో పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహం నింపగా.. సీఎం వచ్చిన మూడ్రోజులకే ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ నిర్మల్‌కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోపక్క ఈ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం అదనపు బలం చేకూరనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్‌ పార్టీ ఏండ్లుగా దూరమైన ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని ఈసారి చేజిక్కించుకోవాలని ఆరాట పడుతోంది. చివరిసారిగా 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ అనంతరం జరిగిన వరుస ఎన్నికల్లో పరాజయం పాలైంది. ఈసారి ఉపాధ్యాయురాలు, ఆదివాసీ గిరిజనుల హక్కుల ఉద్యమకారిణి ఆత్రం సుగుణకు టికెట్‌ కేటాయించింది. టికెట్‌ కోసం పలువురు పోటీపడినా..ఉద్యమకారిణిగా ప్రజల్లో మంచి అభిప్రాయం ఉన్న సుగుణ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంలో బీజేపీ సాధించిన ఎనిమిది అసెంబ్లీ సీట్లలో నాలుగు ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలోనే ఉండటంతో కాంగ్రెస్‌ ఈ సీటుపై ప్రత్యేక దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌సభ పరిధిలో రెండు సార్లు పర్యటించడం.. ఇన్‌చార్జి మంత్రి సీతక్క స్థానికంగానే ఉంటూ వివిధ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ భారీ బహిరంగ సభలో పాల్గొనడం ద్వారా విజయంపై మరింత పట్టుసాధించేందుకు ఆస్కారం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారీ జన సమీకరణ చేపట్టాలని నేతలు నిర్ణయించారు. మరోపక్క ఆయా నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్‌ కీలక నేతలు ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప, విఠల్‌రెడ్డి, వేణుగోపాలచారి, పురాణం సతీష్‌, ఎంపీ వెంకటేష్‌ నేతతో పాటు పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హస్తం గూటికి చేరడం పార్టీకి అదనపు బలం చేకూరనుందనే ప్రచారం జరుగు తోంది. లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్‌కు ఒకే ఎమ్మెల్యే ఉన్నా.. నియోజకవర్గాల్లో కీలక నేతల చేరికతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉండటంతో గెలుపుపై నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్‌ అభ్యర్థికే వామపక్షాల మద్దతు..!
ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న వామపక్ష పార్టీలు స్థానికంగానూ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీపీఐ(ఎం), సీపీఐ రెండ్రోల కిందట ఆదిలాబాద్‌లో పార్లమెంట్‌ స్థాయి సమావేశాలు నిర్వహించి అభ్యర్థి ఆత్రం సుగుణ సమక్షంలోనే సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అభ్యర్థి తరపున వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించాయి. వామపక్షాల మద్దతు అభ్యర్థికి మరింత అదనపు బలం చేకూరుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ఆదివాసీ గిరిజన సంఘం సైతం ఆత్రం సుగుణకు మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆదివాసీల హక్కుల కోసం, చట్టాల పరిరక్షణ కోసం ఆమె పోరాటాలు నిర్వహించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంఘం నేతలు చెబుతున్నారు.

Spread the love