ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతున్నారు..?

What face are you voting with?– ఏ ఒక్క వర్గానికైనా న్యాయం చేశారా…?
– బీజేపీ నేతలకు మాజీ మంత్రి హరీశ్‌ సూటి ప్రశ్న
– చెరో ఎనిమిది సీట్లలో హస్తం, కమలం పరస్పరం సహకరించుకుంటున్నాయని విమర్శ
– అయినా రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని హెచ్చరిక
– హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మార్చేందుకు సమైక్యవాదులు కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపణ
– సీఎం రేవంత్‌కు ఆంధ్రా మూలాలున్నాయంటూ విమర్శలు
– ‘మీట్‌ ది ప్రెస్‌’లో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఆగ్రహం
– కేసీఆర్‌ కచ్చితంగా అసెంబ్లీకి వస్తారని వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదేండ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు… ఇలా ఏ ఒక్క వర్గానికైనా న్యాయం చేశారా..? అంటూ కమలం పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతారంటూ వారిని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌, బీజేపీ కలిసి కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఎనిమిది సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు బీజేపీ, మరో ఎనిమిది సీట్లలో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్‌ పరస్పరం సహకరించుకుంటున్నాయని తెలిపారు. అయినా తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందనీ, బీఆర్‌ఎస్‌ అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలుచుకోబోతోందని హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శనివారం హరీశ్‌రావుతో మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎన్‌డీటీవీ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ఉమా సుధీర్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ను మరోసారి ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ సమైక్యవాదులు కోరుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌కు ఆంధ్రా మూలాలున్నాయి కాబట్టి… ఈ విషయంలో ఏం జరుగుతురదోనన్న సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. అందువల్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ఈ విషయంలోనైనా, మరే అంశంలోనైనా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడాలంటే బీఆర్‌ఎస్‌కే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పేర్కొన్న ఆరు గ్యారెంటీలను అమలు చేయటంలో రేవంత్‌ సర్కార్‌ దారుణంగా విఫలమైందని హరీశ్‌ ఈ సందర్భంగా విమర్శించారు. గతంలో ఆయా గ్యారెంటీల పేరిట ప్రామీస్‌ల మీద ప్రామీస్‌లు చేసిన రేవంత్‌… ఇప్పుడు గాడ్‌ ప్రామీస్‌లు (దేవుళ్ల మీద ఒట్లు) అంటూ మరో కొత్త నాటకానికి తెరతీశారని ఎద్దేవా చేశారు. సీఎంకు ఢిల్లీకి మూటలు పంపటంలో ఉన్న శ్రద్ధ హామీలను అమలు చేయటంలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది ప్రజా పాలన అంటూ రేవంత్‌ చెబుతున్నా.. వాస్తవానికి ఇప్పుడు రాష్ట్రంలో పగ, ప్రతీకారాల పాలనే కొనసాగుతోందని వాపోయారు. తమ పార్టీకి చెందిన సోషల్‌ మీడియా కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారనీ, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పాలన ద్వారా ఇప్పటి వరకూ 3.50 లక్షల దరఖాస్తులు అందాయనీ, వాటిలో ఎన్నింటిని పరిష్కరించారో చెప్పాలని కోరారు. దానిపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మన రాష్ట్రం దివాళా తీసిందంటూ స్వయంగా ముఖ్యమంత్రే చెప్పటం శోచనీయమని విమర్శించారు. ఆయన మాటల వల్ల రియల్‌ ఎస్టేట్‌ రంగం దెబ్బతిన్నదనీ, పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను పెట్టేందుకు ఆలోచిస్తున్నారని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం తమ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే, వాటి సంఖ్యను కుదిస్తామంటూ చెప్పటం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు. వయసులో పెద్దవారైన మాజీ సీఎం కేసీఆర్‌నుద్దేశించి రేవంత్‌ చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమంటూ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పేర్కొనగా.. అందుకు విరుద్ధంగా సీఎం రేవంత్‌ ఎడాపెడా నేతలను ఆ పార్టీలో చేర్చుకుంటున్నారని హరీశ్‌ గుర్తు చేశారు. తమ పార్టీలో రేవంత్‌ చేరబోతున్నారంటూ బీజేపీ ఎంపీ అర్వింద్‌, ఆ పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరెడ్డి పలుమార్లు చెప్పారనీ, అయినా వారి వ్యాఖ్యలను సీఎం ఖండించటం లేదని అన్నారు. ఇందులో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ క్యాబినెట్‌లో ఒక్క మైనారిటీ లేరనీ, ఆ రకంగా ఆ పార్టీ వారికి ద్రోహం చేసిందని విమర్శించారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశముందని హరీశ్‌ అభిప్రాయపడ్డారు. అప్పుడు తమ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కవిత అరెస్టుకు ముందు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కయ్యా యంటూ కాంగ్రెస్‌ ఆరోపించిందని అన్నారు. మరిప్పుడు ఆమె అరెస్టు అయ్యింది కదా..? అని ప్రశ్నించారు. తమ పదేండ్ల పాలనలో చెప్పిన వాటితోపాటు చెప్పని అనేక అంశాలను అమలు చేసి చూపించామని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌ త్వరలోనే అసెంబ్లీకి వస్తారనీ, ప్రధాన ప్రతిపక్ష నేత పాత్రను సమర్థవంతంగా పోషించటం ద్వారా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు, సలహాలనిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారనీ, లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీకి, కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Spread the love