రైతాంగాన్ని ఆదుకోండి

Support the farmers– ఎకరాకు రూ.25 వేల పరిహారమివ్వాలి
– ప్రభుత్వానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని మాజీ మంత్రులు జి జగదీష్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, కె.పి వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్‌, శేరి సుభాష్‌రెడ్డి, మధుసూదనాచారి, దండె విఠల్‌, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, ఎల్‌పీ ఆఫీస్‌ కార్యదర్శి రమేశ్‌రెడ్డి తదితరులు కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో ఎన్నడూ పంటలెండిపోలేదనీ, కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన వంద రోజుల్లో నీరు లేక రైతులు తమ పంటలను నష్ట పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్‌ సర్కార్‌ బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌పై విమర్శలు చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నదే తప్ప రైతులు, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన రైతు బంధు రూ. 15 వేలతో పాటు రూ. 2 లక్షల రుణ మాఫీ వెంటనే అమలు చెయ్యాలని డిమాండ్‌ చేశారు. ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌, పంట నష్ట పోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 25,000 పరిహారం ఇవ్వాలని కోరారు. కాలువలు, చెరువుల కింద ఉన్న పంటలకు వెంటనే నీటిని విడుదల చేయాలనీ, వ్యవసాయానికి నాణ్యమైన మూడు ఫేజుల విద్యుత్‌ను అందించాలని కోరారు. కొనుగోలు కేంద్రాలను అవసరం మేరకు ఏర్పాటు చేసి ప్రతీ గింజను కొనాలని వారు సీఎఎస్‌కు విజ్ఞప్తి చేశారు.

Spread the love