పదేండ్ల పాలన.. వందేండ్ల విధ్వంసం

Ten years of rule.. Hundred years of destruction– ఎన్నికల్లో లబ్ది కోసమే పొలంబాట
– చనిపోయిన రైతుల వివరాలు ఇస్తే ఆదుకుంటాం
– కేంద్రంలో కాంగ్రెస్‌దే అధికారం
– జూన్‌ 9న ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం
– 6న తుక్కుగూడలో జాతీయ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో విడుదల : సీఎం రేవంత్‌రెడ్డి
– కేసీఆర్‌ సాధించింది ఇదే
నవతెలంగాణ-కందుకూరు
రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, జూన్‌ 9వ తేదీన ఎర్రకోటపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి అందరూ ఆహ్వానితులేనని అన్నారు. ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జాన జాతర సభ నిర్వహించనున్నట్టు సీఎం ప్రకటించారు. మంగళవారం రాష్ట్ర ఐటీ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో కలిసి సభకు సంబంధించిన స్థలాన్ని సీఎం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు.. ఈ నెల 6న తుక్కుగూడలో నిర్వహించే సభలో జాతీయ కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో ప్రత్యేకమన్నారు. సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ పదేండ్ల పాలనలో వందేండ్ల విధ్వంసం చేశారని ఆరోపించారు. సూర్యాపేటలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను రేవంత్‌రెడ్డి ఖండించారు. కేసీఆర్‌ ఇప్పటికైనా పొలం బాట పేరుతో పదేండ్ల తరువాత రైతుల వద్దకు రావడం సంతోషంగా ఉందన్నారు. అధికారం పోకుండా ఉండి ఉంటే కిందపడి గాయం కాకుండా ఉంటే, కూతురు జైలుకు వెళ్లకపోయి ఉంటే, ఆయన ఎవరికీ దొరికే వారు కాదని విమర్శించారు. కాంగ్రెస్‌ వచ్చింది కరువు వచ్చింది అని కేసీఆర్‌ అంటుండు.. ఎండాకాలంలో వర్షాలు పడతయా అని ప్రశ్నించారు. గత వర్షాకాలంలో వానలు పడలేదని, కేసీఆర్‌ పాపాలకు వరుణ దేవుడు కూడా భయపడి పారిపోయాడనీ చమత్కరించారు. కేసీఆర్‌ చేసిన పాపాలను తమపై రుద్దాలని చూడొద్దని హెచ్చరించారు. 64,75,581 మంది రైతుల ఖాతాల్లో తమ ప్రభుత్వం రైతు బంధు వేసిందని, మిగిలిన నాలుగు లక్షల మంది ఖాతాల్లో ఎన్నికల కోడ్‌ ముగియగానే వేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ సూర్యాపేట పర్యటనలో ఒక్క సెకన్‌ కూడా కరెంట్‌ పోలేదన్నారు. కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లో జనరేటర్‌ సరిగ్గా లేకుంటే తమకేమీ సంబంధమని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయని, అందులో నుంచి రూ.వంద కోట్లు రైతులకు ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. రాష్ట్రంలో 200 మంది రైతులు చనిపోయారని కేసీఆర్‌ చెప్పుతున్నారని, వారి వివరాలు ప్రభుత్వానికి ఇస్తే ఆదుకుంటామని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కేసీఆర్‌ నక్కజిత్తుల వేషాలు వేసుకొని జనాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల కండ్లలో సంతోషం చూసి కేసీఆర్‌ నిప్పులు పోసుకుంటున్నారన్నారు.
కేసీఆర్‌ పర్యటన చూస్తోంటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్ధ యాత్రలకు వెళ్లినట్లుందన్నారు. కేసీఆర్‌ రద్దయిన వెయ్యి రూపాయల నోటు లాంటి వారని ఎద్దేవా చేశారు. ‘ప్రతి వారం కేసీఆర్‌ ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యత నేరవేర్చాలి..’ అని రేవంత్‌ చురకలు అట్టించారు. ఈ నెల 6న నిర్వహించే జాన జాతర సభకు రాష్ట్రంలోని నలుమూలాల నుంచి పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో ప్రజాపాలన : సీఎం రేవంత్‌రెడ్డి
దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్నదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు. నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు, ఆత్మ గౌరవ పతాకను ఎగురవేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన యోధుడు దొడ్డి కొమురయ్య అని చెప్పారు. బుధవారం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతిని పురస్కరించుకొని ఆయన త్యాగాన్ని, ఆయన ఉద్యమ స్ఫూర్తిని మంగళవారం గుర్తు చేసుకున్నారు.
రాష్ట్రంలో నియంతృత్వ పాలన నుంచి విముక్తి పొంది ప్రజా పాలన ఏర్పడేందుకు కొమరయ్య ఉద్యమ స్పూర్తిని అందిపుచ్చుకున్నట్టు సీఎం తెలిపారు. తెలంగాణ సాయుధ పోరులో తొలి అమరుడైన ఆయన త్యాగం చిర స్మరణీయమనీ, ఆయన ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందనీ, ఈ క్రమంలోనే పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, బీసీ వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సంక్షేమ పథకాలు, రాయితీలు అందిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలకు విలువనిస్తూ, స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం కల్పించామనీ, మంత్రివర్గం మొదలు అన్ని నియామకాల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

Spread the love