పదవే పరమార్థం

Padava Paramarth– తెలంగాణలో పొలిటికల్‌ ట్రెండ్‌
– చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీల మార్పు
– గెలుపు, అధికారం, డబ్బే ప్రధానం
– సిద్ధాంతాలు, విలువలకు తిలోదకాలు
”స్మశాన వాటిక ముందు ముగ్గుండదు… రాజకీయ నాయకులకు సిగ్గుండదు” అని ఓ సినిమా డైలాగ్‌. ప్రస్తుత బూర్జువా రాజకీయాలకు బాగా సరిపోతుంది…పదేండ్లు అంటకాగి, రాత్రికి రాత్రి పార్టీ మారగానే…. సొంత ఇంటికొచ్చినంత ఆనందంగా ఉందని ఒకరంటే, పుట్టింటికొచ్చిన అనుభూతి కలుగుతుందని మరొకరూ నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు. సిద్ధాంతాలు, విలువలకు తిలోదకాలిచ్చి, అధికారం, పదవీ, డబ్బే ప్రధానంగా తెలంగాణలో రాజకీయ క్రీడ సాగుతోంది.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదేండ్ల బీజేపీ పాలనలో ప్రతి పక్షాలు కకావికలమయ్యాయి. అధికార కాషాయ పార్టీ ప్రతీకార రాజకీయాలకు కొన్ని చోట్ల వైరి పక్షాల ఉనికే ప్రశ్నార్థకమైంది.. ఇది దేశంలో పరిస్థితి. అయితే అలాంటి నిర్భంధ వాతావరణం రాష్ట్రంలో లేక పోయినప్పటికి అధికారం, పదవి, డబ్బే ప్రధానంగా మారడంతో… గతంలో బీఆర్‌ఎస్‌ ఎంత ఉచ్ఛ స్థితిని అనుభవించిందో ఇప్పుడు అంతటి హీన స్థితిని ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో ఎవరెవరు ప్రత్యర్థులుగా తలపడ్డా చివరికి అధికాంరంవైపే అందరూ పయనమవుతున్నారు. గెలుపు, అధికారమే పరమావధి తప్ప … ప్రజా సేవ చేయడానికే వచ్చామని ఎవరైనా అంటే ప్రజలు నవ్వుకునే పరిస్థితి నెలకొంది. సిట్టింగ్‌ ఎంపీల నుంచి మొదలుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యులు తమను తాము రక్షించుకునేందుకు పార్టీలు మారుతున్నారు. పెద్దపల్లి ఎంపీ సీటును కొప్పుల ఈశ్వర్‌కు ప్రకటిస్తారని తెలియగానే బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ వెంకటేష్‌ నేత పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌ పంచన చేరారు. చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చినా…గులాబీ బాస్‌ చెప్పినా.. రాత్రికి రాత్రే హస్తం గూటికి చేరి అదే పార్టీ నుంచి టికెట్‌ సంపాదించుకున్నారు. జహీరాబాద్‌, నాగర్‌ కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీలు బిబి.పాటిల్‌, రాములు బీజేపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ నుంచి మళ్లీ బరిలో నిలిచారు. అయితే రాములు మాత్రం తన కొడుకును లైన్లో పెట్టారు. ఇక హైదరాబాద్‌ శివారులో గట్టి పట్టున్న పట్నం మహేందర్‌ రెడ్డి చివరి క్షణంలో కాంగ్రెస్‌ గూటికి చేరి తన భార్య సునితారెడ్డికి మల్కాజిగిరి టికెట్‌ దక్కించుకున్నారు. ఇక దానం నాగేందర్‌ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా గులాబీ పార్టీ నుంచి గెలిచినా కాంగ్రెస్‌ కండువా కప్పుకుని సికింద్రాబాద్‌ ఎంపీ ఆభ్యర్థిగా బరిలో నిలిచారు. హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, ఆరూరి రమేష్‌, లాంటి నేతలు పార్టీలు మారారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అతని కూతురు వరంగల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ టికెట్‌ దక్కించుకున్న కడియం కావ్య, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, అతని కూతురు హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి లాంటి ముఖ్యులూ పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్‌ చైర్మెన్ల వరకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పార్టీని వీడుతున్నారు. వ్యాపారాలు సజావుగా సాగడానికి, ఆస్తులు,అధికారం కోల్పోకుండా ఉండడానికి చొక్కా మార్చినంత ఈజీగా పార్టీలు మార్చుతున్నారు.” నీవు నేర్పిన విద్యే నీరజాక్ష ” అన్నట్టు 2014, 2018 విజయాల తర్వాత బీఆర్‌ఎస్‌ ఆడిన ఆటనే నేడు కాంగ్రెస్‌ ఆడుతోంది. అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హౌదా దక్కకుండా చేసిన ఆ పార్టీపై నేడు బదులు తీర్చుకుంటోంది. దశాబ్ద కాలానికి పూర్వం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మొదలైన ఈ క్రీడ కేసీఆర్‌ పదేండ్ల పాలనలో పరాకాష్టకు చేరింది. తాజాగా రేవంత్‌రెడ్డి హయానికొచ్చేసరికి మరింత పీక్‌ స్టేజికి చేరింది. ఈ ట్రెండ్‌ ఇలాగే కొనసాగితే సిద్దాంతా లకూ విలువలకు ఆస్కారముం టుందా అన్న ప్రశ్న ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది..
బలమైన చట్టం రావాలి
1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. ఇందుకనుగుణంగా రాజ్యాంగ సవరణ చేసి పదో షెడ్యూల్లో చేర్చారు. ఈ చట్టం ప్రకారం పార్టీ ఫిరాయించిన చట్ట సభల సభ్యుని సభ్యత్వాన్ని రద్దు చేయ డంతో పాటు తర్వాతి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిని చేసే అవకాశం ఉంది. అయితే అందులో ఉన్న లొసుగులు, మినహాయింపుల వల్ల అది పటిష్టంగా అమలు జరగడం లేదు. చట్టంలోని లోపాలను ఆసరాగా చేసుకుని చట్ట సభల సభ్యులు యధేచ్ఛÛగా పార్టీలను ఫిరాయిస్తున్నారు. ఏండ్ల కు ఏండ్లు సాగే విచారణలు, సాగ దీతలు పార్టీ ఫిరాయింపులకు మరింత ప్రోత్సాహాన్నే అందిస్తున్నా యనే విమర్శ ఉంది. దీనికి మరిన్ని సవరణలు చేసి ఫిరాయించిన వ్యక్తులు ఎంతటి వారైనా వేటు తప్పదనే బలమైన చట్టాన్ని తెచ్చినప్పుడే వీటికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.

Spread the love