భువనగిరి కోటపై ఎర్రజెండా ఎగరాలి

On Bhuvanagiri Fort A red flag should be raised– సీపీఐ(ఎం)ను గెలిపిస్తేనే సమస్యలు పరిష్కారం
– నాటి వారసత్వాన్ని, నేటి పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం
– సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ
– అవకాశవాద రాజకీయాలను ఓడించండి
– ప్రజల కోసం నిస్వార్ధంగా పనిచేసే వారికి పట్టం కట్టండి
– డబ్బుతో గెలుస్తామని విర్రవీగే వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పండి
– పార్టీల విధానాలు, అభ్యర్థుల చరిత్ర, త్యాగాలను చూసి ఓటేయండి
నవతెలంగాణతో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌
‘ఉద్యమమే ఊపిరిగా పనిచేస్తున్నా. సీపీఐ(ఎం)ను ప్రజలు గెలిపిస్తే నేను ప్రజలను గెలిపిస్తాను. బూర్జువా పార్టీల నాయకులను గెలిపిస్తే వారు ప్రజలను ఓడిస్తారు. ఈ తేడాను అందరూ గమనించాలి. భువనగిరి కోటపై ఎర్రజెండాను ఎగరేస్తాం. అందుకు అన్ని తరగతుల ప్రజలు, మేధావులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, వృత్తిదారులు సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలి. అవకాశవాద రాజకీయ నాయకులను ఈ ఎన్నికల్లో ఓడించాలి. నేను గెలిచినా, ఓడినా జనంలోనే ఉంటా. కానీ బూర్జువా పార్టీల నాయకులు గెలిచినా, ఓడినా ఎక్కడుంటారో అర్థం చేసుకోవాలి.’అని భువనగిరి సీపీఐ(ఎం) పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి ఎండీ జహంగీర్‌ అన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆయన నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
‘మాది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామం. మా తల్లిదండ్రులు బీజాన్‌బీ, మహబూబ్‌అలీ. మా గ్రామంలో పార్టీ నిర్మాతల్లో వారు ముఖ్య నాయకులు. హోటల్‌ వ్యాపారం చేసేవారు. 1970-71లో కరువు వచ్చింది. జనం ఆకలితో అలమటిస్తున్నారు. పార్టీ పిలుపు మేరకు జొన్నల లారీని అడ్డగించి పేదలకు పంచారు. అప్పుడు మా తండ్రిని పోలీసులు మూడు రోజులపాటు పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు. కాచం కృష్ణమూర్తి, నర్రా రాఘవరెడ్డి ప్రభావం మా కుటుంబంపై ఉంది. నా తల్లిదండ్రుల ప్రభావం వల్లే రాజకీయాల్లోకి వచ్చాను. ‘అని జహంగీర్‌ చెప్పారు.
‘1992లో పూర్తికాలం కార్యకర్తగా వచ్చాను. 1995లో 25 ఏండ్ల వయస్సులోనే మునిపంపుల గ్రామ సర్పంచ్‌గా అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించారు. అప్పుడు విరాళాల ద్వారా వచ్చిన డబ్బు రూ.2,002 నా ఎన్నికల ఖర్చు. 2016, అక్టోబర్‌ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. చదువు వెలుగు, సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాను. లంచం ఇవ్వకు, లంచం అడక్కు అనే ఉద్యమం చేపట్టాం.’అని జహంగీర్‌ అన్నారు.
‘అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు తేడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలు మార్పు కోరుకున్నారు. బీఆర్‌ఎస్‌ అహంకారపూరిత విధానాలను ప్రజలు ఈసడించుకున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితులు ప్రభావం చూపుతాయి. ఎమ్మెల్యేల పనితీరు కూడా ప్రభావితం చేస్తుంది. పార్లమెంటు ఎన్నికలపై ఆ ప్రభావం ఉండదు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో 17 లక్షల ఓట్లున్నాయి. ప్రజలు ఆచితూచి ఆలోచించి ఓట్లేస్తారు. పదేండ్ల నుంచి అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించినట్టుగానే కేంద్రంలో ఉన్న బీజేపీని కూడా ప్రజలు ఓడిస్తారు.’అని జహంగీర్‌ చెప్పారు.
‘సాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నది. జనగామలో దేవాదుల ప్రాజెక్టు కాలువల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. దీంతో భూములకు నీరందడం లేదు. భువనగిరిలో బస్వాపురం ప్రాజెక్టు పూర్తి కాలేదు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రాజెక్టులను ఎన్నికల అస్త్రంగానే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వాడుకుంటున్నాయి. ఉదయసముద్రం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. నిర్దిష్ట కాలపరిమితిలోగా ప్రాజెక్టులను పూర్తి చేస్తామనే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉన్నదా?. నీరులేక పొలాలు బీడుబారుతున్నాయి. ఇక్కడి ప్రజలకు మూసీ జీవనాధారంగా ఉన్నది. సీఎం రేవంత్‌రెడ్డి గొప్పగా చెప్పినా బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.58 వేల కోట్లు కావాలి. ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తేవాల్సిన అవసరముంది.’అని జహంగీర్‌ సూచించారు.
‘ఉన్నత విద్య, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ కోసం ఇక్కడి విద్యార్థులు హైదరాబాద్‌కు వెళ్లాలి. జిల్లా ఆస్పత్రులను సూపర్‌స్పెషాలిటీ చేస్తామంటూ కేసీఆర్‌ ఇచ్చిన హామీ అమలు కాలేదు. బీబీనగర్‌లో ఎయిమ్స్‌ ఉన్నా 42 విభాగాలకుగాను 26 విభాగాలే పనిచేస్తున్నాయి. 1500 నుంచి రెండు వేల మంది ఓపీకి రోజూ వస్తున్నారు. కంప్యూటర్లు లేక ఆరు కౌంటర్లే ఉన్నాయి. ఎయిమ్స్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులివ్వకుండా వివక్షతను చూపుతున్నది’అని జహంగీర్‌ చెప్పారు.
‘ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల బాధలు తీరడం లేదు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, టీడీపీ ఒక్కతాను ముక్కలే. జిల్లాల అభివృద్ధి కోసం ఆ పార్టీలు ఏం చేశాయో బహిరంగ చర్చకు రావాలి. ఎందుకు వెనుకబడి ఉన్నామో చెప్పాలి. పాలకుల వైఫల్యమే ఈ దుస్థితికి కారణం.’అని జహంగీర్‌ అన్నారు.
‘పోరాటాల ఉనికి, ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి కాబట్టే కమ్యూనిస్టుల పట్ల ప్రజల్లో గౌరవం ఉన్నది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వారు ఇప్పుడు లేకపోవచ్చు. ఆ చరిత్ర సజీవంగా ఉన్నది. ఆ పోరాటానికి వారసులుగా కమ్యూనిస్టులున్నారు. కానీ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తున్నది. అందులో భాగంగానే రజాకార్‌ సినిమాను తీశారు. అందులో ఎర్రజెండా కనిపించదు, ఆ పోరాటాలుండవు. ఎర్రజెండా లేకుండా నిజాం వ్యతిరేక పోరాటం ఉన్నదా?. బీజేపీకి చరిత్ర లేదు కాబట్టే ఈనాటి తరం దాన్ని తెలుసుకోవద్దనే కుట్రతోనే వక్రీకరిస్తున్నారు. పాఠ్యాంశాలను తొలగిస్తున్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలు చారిత్రాత్మకమైనవి. సాయుధ పోరాటంలో పది లక్షల ఎకరాలు ప్రజలకు పంచితే నాలుగు లక్షల ఎకరాలు ఈ ప్రాంతంలోనే పంచారు. నాటి పోరాట వారసత్వాన్ని, నేటి పోరాటాలను రెండింటినీ జోడించి ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యం చేయాలి’అని జహంగీర్‌ వివరించారు.
‘రాజకీయాల్లో డబ్బు, మద్యం కీలకంగా మారాయి. కమ్యూనిస్టుల వెనుక సామాన్య ప్రజలున్నారు. సామాన్యుల ఆశలను పెంచి వారిని లోబరుచుకునేందుకు డబ్బును పాలకులే అలవాటు చేశారు. డబ్బు ఇస్తేనే ఓటేస్తామంటూ ప్రజలు ఎప్పుడూ అనలేదు. పెట్టుబడిదారులు, వ్యాపారులు రాజకీయాల్లోకి వస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పినట్టు పార్ట్‌టైం రాజకీయ నాయకులు వస్తున్నారు. వారి అవసరాలు, ఆస్తులను కాపాడుకునేందుకు పదవులు ఉపయోగపడుతున్నాయి. అందుకే ఏదైనా చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. స్వలాభం కోసం ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కార్పొరేట్‌ రాజకీయాలను ప్రజలు తిరస్కరించేలా చైతన్యం పెంపొందిస్తాం.’అని జహంగీర్‌ చెప్పారు.
‘ఎన్నికల్లో పార్టీల విధానాలను చూసి ఓటేయాలి. బీజేపీ విధానాలు విధ్వంసకరమైనవి. ఆ పార్టీ గెలిస్తే తీవ్ర సంక్షోభం వస్తుంది. కాంగ్రెస్‌ భూస్వామ్య, పెత్తందారీ పార్టీ. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అవకాశవాద రాజకీయాలు చేస్తాయి. ప్రత్యామ్నాయ శక్తిగా కమ్యూనిస్టు పార్టీ ఉన్నది. రాజకీయాల్లో విలువల కోసం పోరాడుతుంది. ప్రజలను దోపిడీ చేసే వారికి వ్యతిరేకంగా నిలబడుతుంది. కార్మికులు, కర్షకులు సుభిక్షంగా ఉండాలని కోరుకుం టుంది. అభ్యర్థులను చూసి ఓటేయాలి. కాంగ్రెస్‌ అభ్యర్థికి ప్రజలతో సంబంధం లేదు. ప్రజాసమస్యలపై పోరాడ లేదు. డబ్బు అర్హతతో ముందుకొచ్చారు. వ్యాపారాలను స్థిరపరుచుకునేందుకు బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి గతంలో గెలిచినా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారు. అందుకే 2019లో ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల త్యాగాలు, చరిత్ర, ప్రజలతో మమేకమయ్యే విధానాన్ని చూసి ఓటేయాలి. నేను 35 ఏండ్లుగా ప్రజల్లో ఉండి వారి కోసం నిస్వార్థంగా ఉద్యమాలు చేస్తున్నా. డబ్బు తప్ప మిగతా అన్ని అంశాల్లో నాకు మెరిట్‌ ఉంది. బూర్జువా పార్టీల అభ్యర్థులకు ఇతర అంశాల కన్నా డబ్బే ప్రామాణికంగా ఉన్నది. డబ్బుతో విర్రవీగే అభ్యర్థులకు ఎన్నికల్లో బుద్ధిచెప్పండి’ ‘అని జహంగీర్‌ పిలుపునిచ్చారు.

Spread the love