మంత్రులది అవకాశవాదం

Ministers are opportunistic– దేశంలో కులగణన చేపట్టాలి
– కాంగ్రెస్‌తో చర్చలు జరుగుతున్నాయి
– రానున్న ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు ఓటమి తప్పదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ ప్రకటనలు అవకాశవాద రాజకీయాలకు నిదర్శనంగా ఉన్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విఘ్నేశ్వర ఫంక్షన్‌హాల్‌లో జరుగుతున్న ఆ పార్టీ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ కూటమి వైపు ఉంటారో చెప్పకుండా గోడ మీద పిల్లి లాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీజేపీతో కలిసి పని చేయడానికి బీఆర్‌ఎస్‌ ఉవ్విళ్లూరుతుందన్నారు. దేశంలో కులగణన జరగాలని అన్ని పార్టీలు కోరుతున్నా బీజేపీ ప్రభుత్వం మాత్రం కులగణన చేపట్టడానికి ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు. కులగణన చేయడం వల్ల అట్టడుగు వర్గాలకు ఎంతో ఉపయోగం జరుగుతుందన్నారు. 2024 పార్లమెంట్‌ ఎన్నికలకు ముందే మహిళా బిల్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల విషయంలో స్వష్టత రాలేదని, చర్చలు జరుగుతున్నాయని త్వరలో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని, అవకాశవాద బీఆర్‌ఎస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, పారేపల్లి శేఖర్‌రావు, మట్టిపల్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వర్‌రావు, చెరుకు ఏకలక్ష్మి, కోట గోపి తదితరులు పాల్గొన్నారు.

Spread the love