– గద్దె దింపేందుకు సిద్ధం కావాలి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
– రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఆశాల సమ్మె
– కొనసాగుతున్న అంగన్‌వాడీల దీక్షలు
నవతెలంగాణ-కొత్తగూడెం/విలేకరులు
అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సమస్యలు పరిష్కరించని ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు సమ్మెలోకి దిగారు. తమకు కనీసవేతనం రూ.26వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, 15 రోజులుగా దీక్షలు చేస్తున్న అంగన్‌వాడీలు పలు జిల్లాల్లో వినూత్న నిరసనలకు దిగారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం బస్టాండ్ సెంటర్‌లోని చిల్డ్రన్ పార్క్ వద్ద అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సమ్మె శిబిరాన్ని తమ్మినేని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులుగా సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలు, సమ్మె ప్రారంభించిన ఆశాలు.. కనీస వేతనం, పర్మినెంట్, ఉద్యోగ భద్రత తదితర సమస్యలపై పోరాడుతున్నారని, వారివి అత్యంత న్యాయమైన డిమాండ్లని తెలిపారు. ఈ సమస్యలపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించేలా ప్రభుత్వానికి పార్టీ తరపున లేఖ రాస్తానన్నారు. కార్మిక చట్టాల ప్రకారం చూసినా, అంతర్జాతీయ లేబర్ కాన్ఫరెన్స్ చెప్పిన దాని ప్రకారం ఈ రోజు ఉన్న ధరల్లో కనీస వేతనం కేవలం రూ.26 వేలు మాత్రమే అడుగుతున్నారని తెలిపారు. అనేక వేల కోట్ల రూపాయలు వృధా ఖర్చులు చేసే ప్రభుత్వానికి అంగన్‌వాడీ, ఆశా కార్మికుల వేతనాలు పెంచడం పెద్ద సమస్యే కాదన్నారు. ఉద్యోగులుగా గుర్తించకుండా పని చేసినంత కాలం గౌరవ వేతనంతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి వీరి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించినా, తక్షణమే సమ్మెలో ఉన్న యూనియన్‌లను చర్చలకు పిలవకపోయినా అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జె.రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా నాయకులు పద్మ, కళావతి, శైలజ, సరస్వతి, ఆశా యూనియన్ నాయకులు ఝాన్సీ, రాధ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న ఆశాలు, అంగన్‌వాడీలకు బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సంఘీవం తెలిపారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న నిరవధిక సమ్మెలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిర్మల్ జిల్లాలోని కడెం, లక్ష్మణచాంద మండలాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలకేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో అంగన్‌వాడీలు మానవహారం నిర్వహించారు. ఆమనగల్‌లో చేపట్టిన సమ్మెకు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అంగన్‌వాడీలు ఆయనకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి.. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కొడంగల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు ఎదుట ఒంటికాలిపై నిల్చొని నిరసన తెలిపారు. మోమిన్‌పేటలో అంగన్‌వాడీలు నిరసన తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో బిక్షాటన నిర్వహించారు. టేకులపల్లి, మణుగూరులో కండ్లకు నల్ల రిబ్బన్ కట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. పాల్వంచలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు దీక్షలో పాల్గొని మాట్లాడారు. చండ్రుగొండలో ఆశా వర్కర్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సమస్యలు పరిష్కరించాలని నిరవదిక దీక్ష చేపట్టారు. అశ్వారావుపేట మూడు రోడ్ల కూడలిలోని మండల పరిషత్ పూర్వ కార్యాలయం ప్రాంగణంలో ఆశాల దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఆశా వర్కర్లు దీక్షలు చేపట్టారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి తహసీల్దార్ కార్యాలయం నుంచి జేజే నగర్ చౌరస్తా, అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ సెంటర్ వరకు అంగన్‌వాడీలు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు. ఘట్‌కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహకల్ప లింగాపూర్ గ్రామాల్లో అంగన్‌వాడీల సమ్మెకు ప్రజల మద్దతు కూడగడుతూ సంతకాల సేకరణ చేపట్టారు. చిన్న పిల్లల తల్లులు, గర్భిణులు సంతకాలు చేసి వారికి బాసటగా నిలిచారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ చౌరస్తాలో భారీ మానవహారం నిర్వహించారు.
నల్లగొండ జిల్లాకేంద్రంలో అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. మిర్యాలగూడలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య పాల్గొని వారికి మద్దతు తెలిపారు. యాదాద్రిభువనగిరి జిల్లాలో చౌటుప్పల్, ఆలేరు, రామన్నపేట, భువనగిరి మండలాల్లో అంగన్‌వాడీల సమ్మె కొనసాగింది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో సమ్మె కొనసాగింది.