కలిసే పోటీచేస్తాం..

Let's compete together..– అక్టోబర్‌ 1న మళ్లీ సమావేశం
– సీట్లపై నిర్ణయాన్ని ప్రకటిస్తాం సీపీఐ, సీపీఐ(ఎం) ఉమ్మడి నిర్ణయం
– పరోక్షంగా బీజేపీకి మద్దతిస్తున్న కేసీఆర్‌ : తమ్మినేని
– కాంగ్రెస్‌తో పొత్తు వద్దనుకోవడం లేదు : కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఐ(ఎం) కలిసే పోటీ చేస్తాయని ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం చెప్పారు. అయితే ఏయే సీట్లలో పోటీ చేయాలనేది ఇంకా కొలిక్కి రాలేదని అన్నారు. వచ్చేనెల ఒకటిన మళ్లీ సమావేశమవుతామని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే సీట్లపై చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో గురువారం సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకుల ఉమ్మడి సమావేశం జరిగింది. ఇందులో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌, జాన్‌వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణి శంకర్‌, హేమంత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తమ్మినేని, కూనంనేని మీడియాతో మాట్లాడారు.
మహిళా బిల్లును వెంటనే అమలు చేయాలి : తమ్మినేని
తమ్మినేని మాట్లాడుతూ మహిళా బిల్లు వెంటనే అమల్లోకి వచ్చేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమలు చేయడమంటే ఎన్నికల్లో లబ్దికోసమేనని వ్యాఖ్యానించారు. మహిళలను ఉద్ధరించే ఉద్దేశం మోడీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. మహిళా బిల్లులో ఓబీసీ కోటా ఉండాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు. సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎంఐఎం మూడో ఫ్రంట్‌ ఆలోచన అంతా బీజేపీ కోసమేనని విమర్శించారు. వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ కావాలనే పోటీ చేసి ఓట్లను చీల్చిందన్నారు.
బీజేపీకి సహకరించేలా సీఎం కేసీఆర్‌ ఆలోచన ఉందని చెప్పారు. గతంలో కేసీఆర్‌ కలిసిన నేతలందరూ ఇండియా కూటమిలో ఉన్నారని గుర్తు చేశారు. కానీ ఆయన మాత్రం ఇండియా లేదా ఎన్డీఏ కూటమిలో చేరకుండా పరోక్షంగా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. తాము మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి కోసమే పనిచేస్తామని చెప్పారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఐక్యంగా ఉండాలని అన్నారు. సీపీఐ, సీపీఐ(ఎం) ఎన్నికల్లోనే కాదు, ప్రజా సమస్యలపైనా కలిసే పోరాటం చేస్తాయని వివరించారు.
కాంగ్రెస్‌తో పొత్తు అంశం చర్చకు రాలేదు : కూనంనేని
తమ భేటీలో కాంగ్రెస్‌తో పొత్తు అంశం చర్చకు రాలేదని కూనంనేని చెప్పారు. అయితే ఆ పార్టీతో తాము పొత్తు వద్దనుకోవడం లేదని స్పష్టం చేశారు. వామపక్షాలకు కాంగ్రెస్‌ సీట్లు ఇస్తుందంటూ ఊహాగానాలు వద్దనీ, కలిసి మాట్లాడినప్పుడు ఆ అంశం చర్చకు వస్తుందన్నారు. ప్రస్తుతానికి వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఐ(ఎం) కలిసే పోటీ చేస్తాయనీ, సీట్ల విషయంలో వచ్చేనెల ఒకటిన మరోసారి చర్చించి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. అంగన్‌వాడీ కార్మికులపై పోలీసులు దాడి చేయడం సరైంది కాదన్నారు. సమ్మె చేస్తే కొడతారా?అని ప్రశ్నించారు. సమ్మె చేస్తే ఉద్యోగంలోకి తీసుకోబోమంటూ ప్రభుత్వం చెప్పడం దారుణమని అన్నారు. ఉద్యమాల ద్వారా ఏర్పడిన తెలంగాణలో ఉద్యమాలు చేస్తున్న వారిని అణచివేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంఐఎంతో కేసీఆర్‌కు మంచి సఖ్యత ఉందన్నారు. సమైక్యతా దినోత్సవమంటే ఏమిటో ఎంఐఎం నేతలు, కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. థర్డ్‌ ఫ్రంట్‌ పెట్టాలంటూ కేసీఆర్‌ ఆ పార్టీని అడుగుతున్నారని చెప్పారు. అందరి మీద దాడులు చేసే బీజేపీ ప్రభుత్వం ఎంఐఎం మీద ఒక్క కేసూ ఎందుకు పెట్టడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజలను మోసం చేయడంలో బీజేపీ ఆరితేరిందని విమర్శించారు. జనాలను మభ్యపెట్టడానికే మహిళా బిల్లును తెచ్చిందన్నారు. రాష్ట్రపతి వితంతువు కావడం వల్లే కొత్త పార్లమెంట్‌ను ఆమెతో ప్రారంభించలేదని చెప్పారు. రాజ్యాంగ పీఠిక గుండెకాయలాంటిదని అన్నారు. అందులో నుంచి సామ్యవాదం, లౌకికవాదం పదాలను ఎలా తొలగిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. హిందూరాజ్యంగా చేయడం కోసమే బీజేపీ ఇలాంటివి చేస్తున్నదని విమర్శించారు. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. బీజేపీ కూటమి వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలవుతుందని చెప్పారు.

Spread the love