గద్దర్‌కు నిజమైన నివాళి… కమ్యూనిజాన్ని నిలబెట్టడమే

దేశానికి కమ్యూనిస్టుల అవసరం పెరిగింది
– విప్లవోద్యమంలో అంతర్భాగమే సామాజిక న్యాయ పోరాటం
– సమరశీల పోరాటాల్లో వామపక్షాల ఐక్యత పెరగాలి
– దేశం ముందుకెళ్లడంలో విద్య, సైన్స్‌, టెక్నాలజీదే కీలక పాత్ర : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
– సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గద్దర్‌ సంస్మరణ సభ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశంలో కమ్యూనిజాన్ని, ఎర్రజెండాను నిలబెట్టడమే ప్రజాకవి గద్దర్‌కిచ్చే నిజమైన నివాళి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయ పోరాటం విప్లవోద్యమంలో అంతర్భాగమేనని నొక్కి చెప్పారు. దేశానికి కమ్యూనిస్టుల అవసరం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సమరశీల పోరాటాల్లో వామపక్షాల ఐక్యత పెరగాలని ఆకాంక్షించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గద్దర్‌ సంస్మరణ సభ నిర్వహించారు. దీనికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలమల్లేశ్‌ అధ్యక్షులుగా వ్యవహరించారు. వామపక్ష పార్టీల ముఖ్యనేతలు, కవులు, కళాకారులు గద్దర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గద్దర్‌ మృతికి సంతాపంగా నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ.. విప్లవ కవి, కళాకారుడు, కమ్యూనిస్టు యోధుడు, ప్రజల మనస్సు గెలిచిన గొప్ప నాయకుడు గద్దర్‌ అని కొనియాడారు. మతోన్మాదం పెచ్చరిల్లుతున్న సందర్భంలో, పాలకులు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్న క్రమంలో వీటిని ఎదిరించేందుకు ఎవరు ముందుకొచ్చినా కలిసి పనిచేస్తానని గద్దర్‌ పలు సందర్భాలలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం పేరుతో సీపీఐ(ఎం) చేపట్టిన మహాజన పాదయాత్ర, టీమాస్‌ కార్యక్రమాల్లో గద్దర్‌ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆ సమయంలోనే గద్దర్‌తో అనేక అంశాలపై సుధీర్ఘంగా చర్చించే అవకాశం తనకు లభించిందన్నారు. మార్క్సిజం, అంబేద్కరిజం పరస్పర విరుద్ధ అంశాలు కావన్నారు. కొన్ని అంశాల్లో భేదాభిప్రాయాలుండొచ్చనీ, అంతిమంగా ఆ రెండింటి స్ఫూర్తి సామజిక న్యాయమనే విషయాన్ని మరవొద్దని సూచించారు. కమ్యూనిజాన్ని సాధించడంలో సామాజిక న్యాయం అంతర్బాగంగానే ఉంటుందనీ, అది వేరు కాదని చెప్పారు. మన దేశంలో కుల వ్యవస్థ రూపుమాపకుండా అభివృద్ధి సాధించడం అసంభవమన్నారు. ఇది కులం గురించో, రాజకీయ పార్టీ గురించో, ఎన్నికల్లో సీట్ల కోసమో ఇచ్చే నినాదం కాదన్నారు. దోపీడీ, పీడనకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు కమ్యూనిస్టుల అవసరం వచ్చిందని నొక్కి చెప్పారు. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే బలహీనపడ్డ, దెబ్బతిన్న చోటల్లా కమ్యూనిజం తిరిగి బలపడ్డదన్నారు. రాజ్యాధికారం సాధించే చోదక శక్తిగా ఎదిగిన తీరును వివరించారు. సమాజం అభివృద్ధి చెందాలన్నా, ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా ఎదగాలన్నా విద్య, సైన్స్‌, టెక్నాలజీ కీలకమన్నారు. మంచి పరిపాలనే కాదు మెరుగైన సామాజిక వ్యవస్థ కూడా కీలకమని చెప్పారు. కానీ, మన దేశంలో ఆ పరిస్థితి లేదన్నారు. సైన్స్‌, టెక్నాలజీని కలిపి ముందుకు తీసుకెళ్లడంలో మన పాలకులు విఫలమయ్యారన్నారు. బాగా చదివినవాళ్లు పనిచేయట్లేదనీ, పనిచేసేవాళ్లు విద్యలేక టెక్నాలజీ అందిపుచ్చుకోలేకపోతు న్నారని చెప్పారు. మన దేశ వెనుకబాటుకు ఇదీ ఒక కారణమేనని చెప్పారు.
గొప్ప మిత్రుడు..ప్రపంచ కళాకారుడు : బి.నర్సింగరావు
గద్దర్‌ తనకు గొప్ప మిత్రుడనీ, ఆయన ప్రపంచం గుర్తించిన కళాకారుడని సినీ నిర్మాత, దర్శకులు బి.నర్సింగరావు అన్నారు. ఐదు దశాబ్దాల పాటు గద్దర్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయన మొదట బుర్రకథ కళాకారుడనీ, ఆ తర్వాత ప్రజలను ఆకట్టుకునేందుకు అన్ని కళారూపాలను మిళితం చేసి తనదైన ఒరవడితో ముందుకు సాగారని చెప్పారు. ఆటపాట ద్వారా ప్రజల్ని ఎలా ఆకర్షించాలనే దానిపై తమ టీమ్‌ పెద్ద కసరత్తునే చేసిందనీ, అనే అంశాలపై సుధీర్ఘంగా చర్చించేవారమని గుర్తు చేశారు. ఆయన పాటల్ని చాలా కాలం పాటు ఎడిట్‌ చేశానన్నారు. ఆయన రాసిన పాట దేనికదే ప్రత్యేకమన్నారు. పాట కోసం తన ప్రాణాలను సైతం ఆయన లెక్కచేయలేదనీ, ఆయనపై 36 కేసులు కూడా ఉన్నాయని చెప్పారు.
ఎర్రజెండాకు నిజమైన వారసుడు : కూనంనేని సాంబశివరావు
గద్దర్‌ ఎర్రజెండాకు నిజమైన వారసుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన మనకు పాటనిచ్చి పోయారన్నారు. పేదల బతుకులను, సమాజాన్ని లోతుగా చదివినవారే గొప్ప కవులవుతారంటూ గద్దర్‌ పాటలను ప్రస్తావించారు. బతికున్నప్పుడు వేధించినవారు, ఆయన ప్రశ్నను సహించలేనివారు చనిపోయాక తమ వాడిని చేసుకునేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చరిత్రలో గొప్పగొప్ప కళాకారులంతా కమ్యూనిస్టు విప్లవ భావజాలం నుంచే పుట్టారన్నారు. పాలకుల్ని ప్రశ్నించే గొంతుకలన్నీ ఒక్క తాటిపైకొచ్చి పోరాటం చేయడమే గద్దర్‌కు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. దేశంలో కమ్యూనిస్టులు ఏకం కావాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు.
పాటల విశ్వవిద్యాలయం గద్దరన్న : సుద్దాల అశోక్‌ తేజ
గద్దర్‌ పాటల విశ్వవిద్యాలయమనీ, సముద్రమంతా సిలబస్‌ను మనకు ఇచ్చిపోయారని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ అన్నారు. ప్రకృతిలోనూ విప్లవ భావజాలాన్ని జొప్పించిన మహనీయుడన్నారు. ఆయన తనకు గురువు లాంటివారన్నారు. ప్రజల నుంచి తీసుకున్న కళను ప్రజలకే అప్పగించి పోయారన్నారు. పాటలో ‘హా’ అనే శబ్దాన్ని, చరణం చివరన కొసమెరుపు వాక్యాలను, చరణానికి-చరణానికి మధ్య వారధిని సృష్టించిన ఘనత ఆయనదేనన్నారు. పాట ఆకాశమైతే దాని అంచుకెళ్లి ముద్దాడిన మహనీయుడని కొనియాడారు. ఈ యుగం గద్దరన్నదని చెప్పారు. సుద్దాల హన్మంతు, గద్దర్‌ పాటలు పాడి సభికుల్ని ఉత్తేజపరిచారు.
గద్దర్‌తో పోల్చదగిన వ్యక్తి లేరు… :ప్రజాకవి జయరాజు
గద్దర్‌తో పోల్చదగిన వ్యక్తి ఇంకెవ్వరూ లేరని ప్రజాకవి జయరాజు అన్నారు. నిఖార్సయిన విప్లవకారుడన్నారు. ప్రజల జీవితాలను ఒడిసిపట్టి పాటలల్లిన విప్లవ కవి ఆయనని చెప్పారు.
ఉద్యమం సృష్టించిన వాగ్గేయకారుడు గద్దర్‌ :పి రంగారావు
కమ్యూనిస్టు ఉద్యమం, విప్లవ పోరాటాలు గద్దర్‌ను సృష్టించాయని సీపీఐ(ఎంఎల్‌)ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు చెప్పారు. తన పాటలతో మంటలను రాజేశాడనీ, విప్లవోద్యమానికి ఊపిర్లూదాడని కొనియాడారు.
మానవత్వమే ఆయన ఎజెండా.. :వెన్నెల
గద్దర్‌ గొప్ప మానవత్వం ఉన్న మనిషి అని గద్దర్‌ కూతురు వెన్నల చెప్పారు.సమానత్వం కలిగిన సమాజం కావాలని కోరుకున్నారని తెలిపారు. నూతన తరం కోసం ప్రణాళికాబద్దంగా పనిచేయాలని సూచించారు.రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని తపన పడ్డాడని గుర్తు చేశారు.
పేదల పక్షాన పోరాడటమే నిజమైన నివాళి :ఎస్‌ వెంకటేశ్వరరావు
పేదల పక్షాన పోరాడటమే గద్దర్‌కు నిజమైన నివాళి అని సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీ సహాయ కార్యదర్శి ఎస్‌ వెంకటేశ్వరరావు అన్నారు.కుల, మత వైషమ్యాలను సృష్టించి ఈశాన్య భారతాన్ని మండిస్తున్న తరుణంలో గద్దర్‌ లేకపోవటం లోటేనన్నారు.
ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్‌ మాట్లాడుతూ సాంస్కృతిక విప్లవ సేనాని గద్దర్‌ అని చెప్పారు.ఎస్‌యుసీఐ రాష్ట్ర కార్యదర్శి మురారి మాట్లాడుతూ గొప్ప ప్రజావాగ్గేయ కారుడు గద్దర్‌ అని చెప్పారు. ఫార్వర్డ్‌ బ్లాక్‌ అధ్యక్షులు ప్రసాదన్న, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర నాయకులు ప్రసాదన్న, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు చలపతిరావు, సీపీఐ(ఎంఎల్‌)జనశక్తి నాయకులు కొమరన్న లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రాజా ఆయన ఆశయాల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
గద్దర్‌ మ్యూజియం కోసం ఐదెకరాలివ్వాలి
సంస్మరణసభలో వామపక్ష పార్టీల తీర్మానం
హైదరాబాద్‌ ప్యాట్నీ సెంటర్‌ వద్ద ప్రజా యుద్ధనౌక, ప్రముఖ వాగ్గేయకారుడు గద్దర్‌ విగ్రహాన్ని నెలకొల్పాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. ఆయన పేరిట గద్దర్‌ ప్రజా కళల మ్యూజియం, గద్దర్‌ ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేయాలనీ, దాని నిమిత్తం ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. వాటిలో గద్దర్‌తో పాటు ప్రముఖ కళాకారుల ఆవిష్కరణలు, చరిత్రను అందుబాటులో పెట్టాలన్నారు. ఈ మేరకు ”గద్దర్‌ సంస్మరణ సభ” తీర్మానించింది.

Spread the love