చర్చలే ఏకైక మార్గం

Negotiation is the only way– మణిపూర్‌ సంక్షోభంపై సీతారాం ఏచూరి
– కుకీ, మైతీ వర్గాల మధ్య చర్చలకు ప్రభుత్వం ముందుకు రావాలి
– బీజేపీ డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాలు విఫలం
– సహాయక శిబిరాల్లో కనీస సౌకర్యాలు లేవు

– మణిపూర్‌కు పార్లమెంటరీ బృందాన్ని పంపాలని డిమాండ్‌
న్యూఢిల్లీ : మణిపూర్‌ సంక్షోభ పరిష్కారం కోసం చర్చలు ప్రారంభించాలని, ఇదొక్కటే ఏకైక మార్గమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సూచించారు. కుకీ, మైతీ వర్గాలతో చర్చలు ప్రారంభించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని, అందుకోసం నిరాయుధీకరణకు హామీ ఇవ్వాలని తెలిపారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేతృత్వంలో సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి, అసోం రాష్ట్ర కార్యదర్శి సుప్రకాష్‌ తాలూక్‌ధర్‌, కేంద్ర కమిటీ సభ్యురాలు డెబ్లీనా హెంబ్రామ్‌లతో కూడిన నలుగురు సభ్యుల బృందం మూడు రోజుల మణిపూర్‌ పర్యటన ఆదివారం ముగిసింది. బృందం సభ్యులు మూడు రోజుల పాటు కుకీ, మైతీ సహాయక శిబిరాలను సందర్శించారు. వారికి భరోసా కల్పించారు. కుకీ, మైతీ, నాగా జాతుల నేతలను కూడా కలిశారు. మణిపూర్‌లో సాధారణ పరిస్థితి, శాంతి కోసం అందరూ కలిసి కట్టుగా ఉండాలని సూచించారు. బృందంతో సీపీఐ(ఎం) మణిపూర్‌ రాష్ట్ర కార్యదర్శి క్షత్రిమయుమ్‌ శాంత కూడా ఉన్నారు.
మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌లో ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో సీతారాం ఏచూరి ఆదివారం మాట్లాడారు. మూడు నెలలుగా కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించడంలో బీజేపీ ‘డబుల్‌ ఇంజన్‌’ ప్రభుత్వం విఫలమైందనీ, ఇప్పటికే తన ప్రయత్నాలను రెట్టింపు చేయాలని సూచించారు. ‘దయచేసి ప్రతి ఒక్కరినీ ఒక వేదిక మీదకు తీసుకురావడానికి ప్రయత్నించండి. రెట్టింపు శక్తితో ప్రయత్నాలు చేయండి. గతంలో ఇలాగే చేశాం. గత 75 ఏండ్లలో భారతదేశం ఎదుర్కొన్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభించిన ఏకైక మార్గం ఇది” అని ఆయన అన్నారు. ”చర్చలకు నిరాయుధీకరణ ముందస్తు షరతుగా ఉండాలి. చర్చలు కాల్పుల విరమణతో ప్రారంభం కావాలి’ అని ఏచూరి అన్నారు. రాష్ట్రానికి పార్లమెంటరీ ప్రతినిధి బృందాన్ని కూడా పంపాలని ఏచూరి కేంద్రాన్ని కోరారు.
కేంద్రం, రాష్ట్రంలోని ప్రభుత్వాలు అసమర్థంగా ఉన్నాయనీ, మే 3 నుంచి కొనసాగుతున్న హింసను ఎత్తి చూపుతూ ఆయన విమర్శించారు. ‘మేం పదే పదే కేంద్రానికి చెప్పాం. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో పార్లమెంట్‌లోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధి బృందాన్ని మణిపూర్‌కు పంపాలని కోరాం. కానీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇప్పటికైనా పార్లమెంటేరియన్‌ ప్రతినిధి బృందాన్ని మణిపూర్‌కు పంపాలి’ అని ఏచూరి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. హింసాకాండలో బాధితులు ఉన్న సహాయక శిబిరాల్లో కనీస సౌకర్యాలు లేవని ఏచూరి విమర్శించారు. ‘సౌకర్యాల భరోసా కోసం జోక్యం చేసుకోవాలని మేం గవర్నర్‌ అనుసూయా ఉయికేకి విజ్ఞప్తి చేసాము’ అన్నారు.
మణిపూర్‌కు నేడు సీపీఐ ప్రతినిధి బృందం
సీపీఐ ప్రతినిధి బృందం మణిపూర్‌కు వెళ్లనుంది. 21 (సోమవారం) నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు బృందం మణిపూర్‌లో పర్యటిస్తుంది. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, రాజ్యసభ ఎంపీ బినరు విశ్వం, సీపీఐ జాతీయ కార్యదర్శులు కె. నారాయణ, రామకృష్ణ పాండా, సీపీఐ అసోం సీనియర్‌ మహిళా నేత అసోమి గొగోరులతో కూడిన బృందం పర్యటిస్తుంది. బాధితులుండే సహాయక శిబిరాలను సందర్శిస్తుంది. అలాగే రాష్ట్ర గవర్నర్‌ను, వివిధ వర్గాల నేతలను, రాజకీయ నేతలను కలుస్తుంది.

Spread the love