దేశ రక్షణే కమ్యూనిస్టుల ధ్యేయం

Defense of the country is the mission of communists– భారత స్ఫూర్తికి బీజేపీ విఘాతం
– సనాతన ధర్మం అమలే దాని లక్ష్యం
– ‘ఇండియా’ సాకుతో పొత్తు ధర్మానికి కేసీఆర్‌ తూట్లు
– బీజేపీకి దగ్గరయ్యేందుకే..కమ్యూనిస్టులకు దూరం
– వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ
– సభలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ ఇండియా కూటమిలో ఉందనే పేరుతో.. కమ్యూనిస్టులతో పొత్తు ధర్మానికి బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తూట్లు పొడిచారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీ ప్రమాదకరంగా పరిణమిస్తున్న దశలో కమ్యూనిస్టుల సహాయంతో మునుగోడు ఎన్నికల్లో గట్టెక్కిన కేసీఆర్‌ ఆ విషయాన్ని మరిచారన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ బలోపేతం అవుతున్న దృష్ట్యా బీజేపీకి దగ్గరయ్యేందుకే కమ్యూనిస్టులకు దూరమ య్యారని విమర్శించారు. ‘అసెంబ్లీలో నిన్ను రక్షిస్తా.. పార్లమెంట్లో నన్ను రక్షించు’ అనే రీతిలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఏకమవుతున్నాయన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభలో తమ్మినేని ప్రసంగించారు.
మునుగోడు ఎన్నికల ఆసరాతో తెలంగాణలో రాజ్యాధికారం కోసం బీజేపీ వ్యూహం పన్నిందని తెలిపారు. ఈ ప్రమాదాన్ని గుర్తించే కమ్యూనిస్టులు కెేసీఆర్‌ విజ్ఞప్తి మేరకు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చారని చెప్పారు. భవిష్యత్తులోనూ ఈ పొత్తు ధర్మాన్ని కొనసాగించాలన్న కేసీఆర్‌.. ఆ తర్వాత కాంగ్రెస్‌ ఉన్న ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు ఉన్నారనే సాకుతో తమకు దూరమయ్యారని తెలిపారు. కమ్యూనిస్టులకు ఓట్లు, సీట్లు ప్రధానం కాదన్నారు. కేరళలో కాంగ్రెస్‌తోనే కమ్యూనిస్టులు పోరాడు తున్న విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ కమ్యూనిస్టులతో పొత్తును కాంక్షిస్తోందని చెప్పారు. త్వరలో చర్చలు కొలిక్కి వస్తాయన్నారు.
అఖండ భారత పోరాట స్ఫూర్తిని దెబ్బతీసే సిద్ధాంతం బీజేపీదన్నారు. సనాతన ధర్మాన్ని వదలాలన్న ఉదయనిధి స్టాలిన్‌పై బీజేపీ సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. సనాతన ధర్మం అంటే మనుధర్మం, కుల ధర్మం అన్నారు. భూమి సమస్య, సామాజిక అణచివేత, ప్రజాస్వామ్య హక్కుల హరింపుకు వ్యతిరేకంగా సాగిన పోరాటమే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమన్నారు.
సాయుధ పోరాటంతో బీజేపీకి సంబంధం ఏమిటి? : పోతినేని
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో బీజేపీకి సంబంధం ఏమిటని? సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ ప్రశ్నించారు. మత వైషమ్యాల కోసం నీచ ప్రయత్నాలు చేస్తోందన్నారు. సాయుధ రైతాంగ పోరాటాన్ని ముస్లిం రాజుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందని విమర్శిం చారు. 38 ఈ కౌలుదారు చట్టాలు, భూ పంపిణీ తదితర చట్టాలు కమ్యూనిస్టుల పోరాట ఫలితమేనని చెప్పారు. అంతకు ముందు ఖమ్మం నలు మూలల నుంచి ర్యాలీగా ప్రజలు సభా ప్రాంగణానికి చేరు కున్నారు. ఈ కార్యక్రమం లో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయ కులు పి.సోమయ్య, ఎం.సుబ్బారావు, అఫ్రోజ్‌ సమీన, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, పొన్నం వెంకటేశ్వర్లు, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, బండి రమేష్‌, కళ్యాణం వెంకటేశ్వర రావు, వై. విక్రమ్‌, భూక్యా వీరభద్రం, చింతలచెర్వు కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Spread the love