కమ్యూనిస్టులం కలిసే నడుస్తాం

Let's walk together with communists– వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర, సామాజిక శక్తులతో ముందుకెళ్తాం
– బీఆర్‌ఎస్‌ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడం సరికాదు
– కమ్యూనిస్టుల్లేకుంటే మునుగోడులో గెలిచే వారా?
– ఆ రోజు బీజేపీ గెలిస్తే ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉండేది…
– సీఎం కేసీఆర్‌ వివరణివ్వాలి : సీపీఐ, సీపీఐ(ఎం) ఉమ్మడి డిమాండ్‌
– బీజేపీ పట్ల బీఆర్‌ఎస్‌ వైఖరేమిటీ : తమ్మినేని
– బీఆర్‌ఎస్‌ది రాజకీయ అవకాశవాదం : కూనంనేని
రాజకీయంగా మేం పూర్తి స్పష్టతతో ఉన్నాం. మతోన్మాద, ప్రజా వ్యతిరేక బీజేపీని గద్దె దింపడం మా లక్ష్యం. మునుగోడు ఉప ఎన్నికలో మేం దీనికి కట్టుబడే బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చాం. బీఆర్‌ఎస్‌ కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించడంతో కలిసి నడవాలని భావించాం. భవిష్యత్‌లో కూడా కలిసే నడుస్తామని స్వయంగా సీఎం కేసీఆరే అనేక వేదికలపై చెప్పారు. ఇప్పుడు ఆపార్టీ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చిందో, వామపక్షాలతో పొత్తు ఎందుకు వద్దనుకున్నారో స్పష్టత నివ్వాల్సింది, ప్రజలకు సమాధానం చెప్పాల్సింది బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆరే. బుధవారం జరిగే సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, ఈనెల 27న జరిగే సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై కూలంకషంగా చర్చించి, భవిష్యత్‌ రాజకీయ వ్యూహాన్ని ఖరారు చేసుకుంటాం. అప్పుడూ, ఇప్పుడూ మా వైఖరి బీజేపీ ప్రమాదం నుండి దేశాన్ని రక్షించడమే…దానిలో ఎలాంటి మార్పు లేదు
. – వామపక్షాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఐ(ఎం) కలిసే పోటీ చేస్తాయని ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. కలిసొచ్చే వామపక్ష, లౌకిక, అభ్యుదయ, ప్రజాతంత్ర శక్తులతో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. ఏకపక్షంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించడం సరైంది కాదన్నారు. సీఎం కేసీఆర్‌ అవకాశవాదంతో పొత్తు ధర్మాన్ని పాటించలేదనీ, దీనిపై వివరణ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. కమ్యూనిస్టుల్లేకుంటే మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిచేవారా?అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ రాజకీయ వైఖరిలోనే మార్పు వచ్చిందనీ, లేదంటే పొత్తు వైఫల్యానికి కారణాలేంటో చెప్పాలని కోరారు. ఈ పరిణామాలను ప్రజలు అర్థం చేసుకుని వామపక్ష పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో మంగళ వారం సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకుల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌, జాన్‌వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్యపద్మ, తక్కళ్లపల్లి శ్రీనివాస్‌, ఎన్‌ బాలమల్లేష్‌, బాలనర్సింహ్మా, కలవేణి శంకర్‌, హేమంత్‌ కుమార్‌, ఈటి నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
బీఆర్‌ఎస్‌ రాజకీయ వైఖరిలోనే మార్పు : తమ్మినేని
తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఏకపక్షంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించారని చెప్పారు. ఇది ఊహించని పరిణామమని అన్నారు. ఇది మిత్రధర్మం కాదన్నారు. మునుగోడు ఎన్నికలపుడు వారే తమ మద్దతు అడిగారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ కలిసే పనిచేస్తామంటూ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రకటించారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు సైతం ఆహ్వానించారనీ, కేరళ సీఎం విజయన్‌ వచ్చారని అన్నారు. అఖిల భారత స్థాయిలో బీజేపీని ఓడించడమే లక్ష్యమంటూ కేసీఆర్‌ ప్రకటించారని వివరించారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. అయితే ఇక్కడ సీట్లు సమస్య కాదనీ, బీఆర్‌ఎస్‌ రాజకీయ వైఖరిలోనే తేడా వచ్చిందని అన్నారు. బీజేపీని ఓడించేందుకే ఇండియా కూటమి ఏర్పడగా, తాము ఎన్డీఏ, ఇండియా కూటములకు దూరంగా ఉన్నామంటూ బీఆర్‌ఎస్‌ నేతలు వివరించారని గుర్తు చేశారు. అయితే 2024లో బీజేపీని గద్దెదించడమే తమ లక్ష్యమనీ, కేరళలో సీపీఐ(ఎం)కు ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ ఉన్నా దేశ సమైక్యత, బీజేపీని ఓడించడం కోసమే ఆ కూటమిలో ఉన్నామని చెప్పామన్నారు. అయితే ఇండియా కూటమిలో ఉంటే పొత్తుండబోదని వారు ఎప్పుడూ ప్రకటించలేదన్నారు. ఇప్పుడేమో కనీస చర్చకూడా లేకుండా ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించారనీ, దీనిని బట్టి తాము అడిగిన సీట్లపై కాకుండా వారి రాజకీయ వైఖరిలోనే తేడా వచ్చిందని అర్థం చేసుకోవాల్సి వస్తుందన్నారు. అయితే సీట్లు ప్రకటించాక పొత్తు కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదన్నారు. మునుగోడులో మద్దతు ఇవ్వడంలో ఇసుమంత తప్పులేదని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటే అని తాము అనడం లేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పనిచేయాలని కోరారు. బీజేపీ పట్ల బీఆర్‌ఎస్‌ వైఖరి ఏమిటో కేసీఆర్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తొమ్మిదేండ్లలో అప్రజాస్వామిక పాలన కొనసాగించారనీ, ఏకపక్ష, నియంతృత్వ విధానాలను అవలంభించారనీ, ధర్నాచౌక్‌ను ఎత్తేశారనీ, ఉద్యమాలను అణచివేశారని చెప్పారు. అయితే బీజేపీని వ్యతిరేకించినందుకే మునుగోడులో మద్దతిచ్చామనీ, రాజకీయ స్నేహం కొనసాగించామని అన్నారు.
ఇది రాజకీయ అవకాశవాదం : కూనంనేని
సీఎం కేసీఆర్‌ ఏకపక్షంగా బీఆర్‌ఎస్‌ జాబితాను ప్రకటించిన తీరు అభ్యంతకరమనీ, కనీసం మిత్రధర్మాన్ని, స్నేహాన్ని పాటించలేదనీ, ఇది పొమ్మనకుండా పొగ పెట్టినట్టుగా ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. బీజేపీతో ఎక్కడో సఖ్యత వచ్చిందనే అంశం తమకు అర్థమైందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రమాదం ఉందా? లేదా?అనే దానిపై కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాలంటేనే మోసం అనే పద్ధతుల్లో నిర్వచనం ఇచ్చారా?అని ప్రశ్నించారు. వామపక్షాలు లేకపోతే మునుగోడులో బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏమిటని అడిగారు. వామపక్షాల్లేకుంటే బీఆర్‌ఎస్‌ గెలిచేదా?, బీజేపీ గెలిచేదా?అని ప్రశ్నించారు. అక్కడ బీజేపీ గెలిస్తే ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితి, కేసీఆర్‌ ప్రభుత్వ పరిస్థితి ఏమయ్యుండేదని నిలదీశారు. సీపీఐ, సీపీఐ(ఎం) కలిసి పనిచేస్తాయనీ, వచ్చే ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్రను పోషిస్తాయని చెప్పారు. కమ్యూనిస్టులంటే ఏంటో తెలియజేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌తో పొత్తు చెడినా తాము వ్యక్తిగతంగా కాకుండా విధానపరంగానే విమర్శిస్తామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ది రాజకీయ అవకాశవాదమని విమర్శించారు.

Spread the love