కారుచిచ్చు

can leakతుమ్మల అనుచరుల మంతనాలు
– కాంగ్రెస్‌లో చేరాలని మాజీ మంత్రిపై ఒత్తిడి
– మైనంపల్లి దారెటు..
– రాజయ్య కంటతడి.. విధేయుడిగానే ఉంటా..!

– ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ కాంగ్రెస్‌కు దరఖాస్తు
– వ్యూహాత్మకంగా కేసీఆర్‌ అడుగులు
– పొంగులేటిని దెబ్బతీసేందుకు పన్నాగం!
– కొత్తగూడెం బీజేపీ నేత కోనేరుకు గాలం
– సత్తుపల్లి కాంగ్రెస్‌ నేతకు ‘కమ్యూనిటీ’ బ్రేక్‌
బీఆర్‌ఎస్‌ వందరోజుల ముందుగానే టిక్కెట్లు ప్రకటించడం ఆపార్టీకి ఏమేరకు మేలు చేస్తుందో కానీ అసంతృప్తులు మాత్రం ఆగ్రహంతో ఉన్నారు. ‘కారు’చిచ్చు తీవ్రం కాకముందే పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే స్థానానికి పరిమితమైన బీఆర్‌ఎస్‌ను ఈసారి ఎలాగైనా మెరుగైన ఫలితాల దిశగా నడిపించాలని కేసీఆర్‌ అన్ని స్థానాలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాలేరు టిక్కెట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డికి ఇవ్వడంతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు భవిష్యత్‌ కార్యాచరణపై మంగళవారం మంతనాలు జరిపారు. అదేవిధంగా హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హనుమంతరావు.. తాను, తన తనయుడు పోటీలో ఉంటామంటూ త్వరలో తమ కార్యాచరణ ప్రకటిస్తామని చెపుతున్నారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ కాంగ్రెస్‌ తరపున దరఖాస్తు చేసుకున్నారు. పటాన్‌చెరు టికెట్‌ ఆశించిన నేలమధు మెదక్‌ జిల్లాలో బీసీ ఉద్యమం చేస్తానని శపథం చేశారు. తాటికొండ రాజయ్య కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు ఒకచోట చోటుచేసుకునే నష్టాన్ని మరో చోట భర్తీ చేసుకోవాలనే యోచనతో బీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది.
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు టిక్కెట్‌ కేటాయించకపోవడంతో ఆయన అనుచరులు మండిపడుతున్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై ఖమ్మం రూరల్‌ మండలంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తుమ్మల రానప్పటికీ ఆయన గ్రూపులోని కీలక నేతలంతా హాజరై చర్చించారు.
బీజేపీలోకి వెళ్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలపైనా చర్చించారు. జిల్లాలో బీజేపీకి కనీస బలం లేని దృష్ట్యా కాంగ్రెస్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. షర్మిల కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీలోనైనా తమకు న్యాయం జరుగుతుందా? లేదా? అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం పాలేరు స్థానంపై ఆసక్తితో ఉన్న దృష్ట్యా కాంగ్రెస్‌లో చేరితే పాలేరు టిక్కెట్‌ తమకు వస్తుందా? లేదా? అనే అంశంపైనా చర్చించినట్టు సమాచారం. ఏదిఏమైనా కాంగ్రెస్‌తోనే తమకు భవిష్యత్తు అని మెజార్టీ అభిప్రాయం వెల్లడైనట్టు తెలుస్తోంది.
పొంగులేటి టార్గెట్‌గా కొత్తగూడెంపై బీఆర్‌ఎస్‌ కన్ను
బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి పొంగులేటి పోటీ చేస్తారనే వార్తల నేపథ్యంలో ఆ స్థానంపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు, మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు సత్యనారాయణ అలియాస్‌ చిన్నీకి గాలం వేసింది. చిన్నీ బీఆర్‌ఎస్‌లో చేరతారనే నిర్ధారణకు వచ్చిన బీజేపీ మంగళవారం ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దు చేసింది. ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో సోమవారం సాయంత్రం నుంచి చిన్నీతో కొనసాగిన మంతనాలు మంగళవారం మధ్యాహ్నానికి ఓ కొలిక్కి వచ్చాయని సమాచారం. ఈ స్థానం నుంచి ప్రస్తుత బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు చిన్నీ తండ్రి కోనేరు నాగేశ్వరరావు కాలం నుంచి వైరుధ్యాలు న్నాయి. చిన్నీ భవిష్యత్తుకు భరోసానిచ్చి కేసీఆర్‌ పార్టీలో చేర్చుకుంటున్నట్టు తెలిసింది. వనమా సైతం చిన్నీ చేరికను స్వాగతిస్తున్నారని సమాచారం.
సత్తుపల్లిలో ప్రత్యర్థిపై తిరకాసు..
సత్తుపల్లి నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా టిక్కెట్‌ దక్కించుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తన ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మట్టా దయానంద్‌ను ఇరకాటంలో పెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగానే ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన కొడారి వినాయకరావుతో దయానంద్‌ కులంపై ఫిర్యాదు చేయించినట్టు తెలుస్తోంది. వినాయకరావు ఫిర్యాదు మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌.. అడిషనల్‌ కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్‌ స్థాయి అధికారులతో స్క్రూటిని టీంను ఏర్పాటు చేసి విచారణ చేయించారు. మట్టా దయానంద్‌ ఎస్సీ కమ్యూనిటీకి చెందినవారిగా నిరూపించుకోవడంలో విఫలమయ్యారని సత్తుపల్లి తహసీల్దార్‌ నివేదిక సమర్పించడంతో దయానంద్‌ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తున్నట్టుగా జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు మంగళవారం సమాచారం చేరవేశారు. ఈ నేపథ్యం లో తన భార్య రాగమయిని రంగంలోకి దించాలనే యోచనలో దయానంద్‌ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై దయానంద్‌ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

Spread the love