– 115 మంది అభ్యర్థులతో బీఆర్‌ఎస్ తొలి జాబితా
– గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్లా పోటీ..
– ఎంఐఎంతో స్నేహమే… ప్రకటించిన కేసీఆర్
– రాజకీయమంటే కేవలం ఎమ్మెల్యే అవ్వడమే కాదు… అనేక అవకాశాలుంటాయని సీఎం వ్యాఖ్య…
– బుజ్జగింపులకు త్రిసభ్య కమిటి
శాసనసభ ఎన్నికల సమరానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సిద్ధమైంది. ఆపార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సోమ వారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో 115 మంది అభ్యర్థు లతో కూడిన తొలి జాబితాను విడుదల చేశారు. వీటిలో కోరుట్ల, ఉప్పల్, బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, వేముల వాడ అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల్ని మార్చారు. నర్సాపూర్, నాంపల్లి, జనగామ, గోషామ హల్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్ధుల్ని ప్రకటించలేదు. మరో నాలుగైదు రోజుల్లో ఇక్కడి అభ్యర్థుల్ని కూడా ప్రకటిస్తా మన్నారు. మజ్లిస్ పార్టీతో తమ స్నేహం యథాతధంగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తూ 95 నుంచి 105 స్థానాల్లో విజయం సాధిస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో అసంతృప్తులు ఉంటే వారికి సర్దిచెప్పేందుకు సీనియర్ నాయకులు కే కేశవరావు నేతృత్వంలో త్రిసభ్య కమిటీ వేస్తామన్నారు. రాజకీయం అంటే కేవలం ఎమ్మెల్యే అవ్వడం మాత్రమే కాదనీ, మున్ముందు అనేక అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు వంటి అనేక అవకాశాలు ఉంటాయని తెలిపారు. తాను గతంలోనూ అనేక స్థానాల నుంచి పోటీచేసి గెలుపొందాననీ, కానీ ఈ సారి కామారెడ్డి నుంచి పోటీ చేయాలని అక్కడి ప్రజలు, నాయకుల నుంచి వచ్చిన వత్తిడి నేపథ్యంలో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా తాను పోటీచేస్తున్నానని అన్నారు. పూర్తి వడపోత తర్వాతే ఈ జాబితాను ప్రకటించామన్నారు. కంటోన్మెంట్ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే జీ సాయన్న కుమార్తె లాస్య నందితకు కేటాయించామన్నారు. హుజూరా బాద్ నుంచి పాడి కౌశిక్‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావు పోటీ చేస్తారని తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అభ్యర్థన మేరకు ఆ స్థానాన్ని ఆయన కుమారుడు సంజరుకి కేటాయించి నట్టు వివరణ ఇచ్చారు.
ఈ ఎన్నికలు అయ్యాక దేశమంతా పర్యటించి, బీఆర్‌ఎస్‌ను మరింత పటిష్టం చేస్తామన్నారు. దేశంలో రాజకీయ మార్పుకు తాము కట్టుబడే ఉన్నామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో తాము సాధించిన అభివృద్ధే తమని మరోసారి గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అతి తక్కువ కాలంలో దేశంలో ఏ రాష్ట్రం సాధించలేని ప్రగతిని సాధించి, ఆదర్శంగా నిలిచామన్నారు. తమది పక్కా రాజకీయపార్టీనే అనీ, సన్యాసుల మఠం కాదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కమ్యూనిస్టులతో పొత్తు గురించి అడిగిన మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ…అన్ని చోట్లా అభ్యర్థుల్ని ప్రకటించాక ఇక పొత్తులు ఏంటి? అని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీ గురించి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా… పాముకు పాలుపోసి పెంచినట్టు రాష్ట్రంపై విష ప్రచారం చేసే పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులకు మినహా మిగిలిన వారికి ఇస్తామని చెప్పారు. రుణ మాఫీపై కొన్ని పత్రికలు అడ్డగోలుగా రాసాయని, ఒకేసారి రుణమాఫీ చేశాక ఇప్పుడు వాళ్లు తలలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. న్యూస్ ఉంటే ఫర్వాలేదు…వ్యూస్‌ను కూడా న్యూస్‌లాగే ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించం
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని సహించబోమని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. ‘యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. వాళ్లు ఎంత పెద్దవారైనా సరే, వారిని పార్టీ నుంచి బయటకు పంపుతాం. క్రమశిక్షణ చర్యలు చిన్నచిన్నగా ఉండవు. వంద శాతం చర్యలు ఉంటాయి. పీకి అవతల పడేస్తాం. వాళ్ల ఖర్మ వారు పడతారు…’ అని ఆయన హెచ్చరిం చారు. ‘శ్రావణమాసం.. ఇవాళ మంచి ముహుర్తం. ధనుర్ లగంలో పండితులు, వేద పండి తులు నిర్ణయిం చిన మేరకు కరెక్ట్‌గా 2:38 తర్వాత, అదే సమయం తర్వాత జాబితా విడుదల చేశాం. తప్పకుండా పార్టీ ఘన విజయం సాధించి, తెలంగాణ ను ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ ఒక్కసారి తెలంగాణ ప్రజానీ కానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇతర పార్టీలకేమో ఎన్నికలు ఒక పొలిటికల్ గేమ్. కానీ బీఆర్‌ఎస్ పార్టీకి టాస్క్. ఒక పవిత్ర యజ్ఞం లా, కర్తవ్యంలా ముందుకు తీసుకుని పోతున్నాం. అన్ని సర్దుబాటు చేసుకుని, మంచి అవగాహనతో ఈ నిర్ణయానికి వచ్చాం. భూపాలపల్లిలో వెంకటరమణా రెడ్డికి మాజీ స్పీకర్ మధుసూదనాచారి మద్దతు ఇస్తున్నారు. తాండూరులో కూడా పట్నం మహేందర్ రెడ్డి కూడా రోహిత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు. ఇలా ఉన్నంతలో అన్ని సర్దుబాటు చేసుకుని, ఈ లిస్ట్ విడుదల చేశాం…’ అని కేసీఆర్ వివరించారు.
1 .సిర్పూర్ – కోనేరు కోనప్ప
2. చెన్నూరు (ఎస్సీ)- బాల్క సుమన్
3. బెల్లంపల్లి (ఎస్సీ)- దుర్గం చిన్నయ్య
4. మంచిర్యాల్ – నడిపెల్లి దివాకర్ రావు
5. అసిఫాబాద్ (ఎస్టీ) – కోవా లక్ష్మీ
6. ఖానాపూర్ (ఎస్టీ) – భూక్యా జాన్సన్ రాథోడ్‌నాయక్
7. ఆదిలాబాద్ – జోగు రామన్న
8. బోథ్ (ఎస్టీ) – అనిల్ జాదవ్
9. నిర్మల్ – అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
10. ముథోల్ – విఠల్ రెడ్డి
11. ఆర్మూర్ – ఆశన్నగారి జీవన్ రెడ్డి
12. బోధన్ – మహమ్మద్ షకీల్ ఆమిర్
13. జుక్కల్ (ఎస్సీ) – హన్మంత్ శిందే
14. బాన్స్‌వాడ – పోచారం శ్రీనివాస్ రెడ్డి
15. ఎల్లారెడ్డి- జాజుల సురేందర్
16. కామారెడ్డి – కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్)
17. నిజామాబాద్ అర్బన్ – బిగాల గణేశ్ గుప్తా
18. నిజామాబాద్ రూరల్ – గోవర్దన్ బాజిరెడ్డి
19. బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి
20. కోరుట్ల – డాక్టర్ కల్వకుంట్ల సంజరు
21. జగిత్యాల్ – డాక్టర్ సంజరు కుమార్
22. ధర్మపురి (ఎస్సీ) – కొప్పుల ఈశ్వర్
23. రామగుండం – కోరుకంటి చందర్
24. మంథని – పుట్టా మధు
25. పెద్దపల్లి – దాసరి మనోహర్‌రెడ్డి
26. కరీంనగర్ – గంగుల కమలాకర్
27. చొప్పదండి (ఎస్సీ)- సుంకె రవిశంకర్
28. వేములవాడ -చల్మెడ లక్ష్మీనరసింహారావు
29. సిరిసిల్ల – కే తారకరామారావు
30. మానకొండూరు (ఎస్సీ) – రసమయి బాలకిషన్
31. హుజూరాబాద్ – పాడి కౌశిక్ రెడ్డి
32. హుస్నాబాద్ – సతీశ్ కుమార్
33. సిద్దిపేట – హరీశ్‌రావు
34. మెదక్ – పద్మా దేవేందర్‌రెడ్డి
35. నారాయణఖేడ్ – మహారెడ్డి భూపాల్ రెడ్డి
36. ఆంథోల్ (ఎస్సీ) – చంటి క్రాంతి కిరణ్
37. జహీరాబాద్ (ఎస్సీ) – కె.మాణిక్ రావు
38. సంగారెడ్డి – చింతా ప్రభాకర్
39. పటాన్‌చెరు – గూడెం మహిపాల్‌రెడ్డి
40. దుబ్బాక- కొత్త ప్రభాకర్ రెడ్డి
41. గజ్వేల్- కేసీఆర్
42. మేడ్చల్- చామకూర మల్లారెడ్డి
43. మల్కాజ్‌గిరి- మైనంపల్లి హనుమంతరావు
44. కుత్బుల్లాపూర్- వివేకానంద
45. కూకట్‌పల్లి-మాధవరం కష్ణారావు
46. ఉప్పల్ -బండారు లక్ష్మారెడ్డి
47. ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి కిషన్ రెడ్డి
48. ఎల్బీనగర్ – దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
49. మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి
50. రాజేంద్రనగర్ – ప్రకాశ్ గౌడ్
51. శేరిలింగంపల్లి – అరెకపూడి గాంధీ
52. చేవెళ్ల (ఎస్సీ)- కాలే యాదయ్య
53. పరిగి – కొప్పుల మహేశ్ రెడ్డి
54. వికారాబాద్ (ఎస్సీ)- డా. మెతుకు ఆనంద్
55. తాండూరు – పైలట్ రోహిత్ రెడ్డి
56. ముషీరాబాద్ – ముఠా గోపాల్
57. మలక్‌పేట – తీగల అజిత్ రెడ్డి
58. అంబర్‌పేట్ – కాలేరు వెంకటేశ్
59. ఖైరతాబాద్ – దానం నాగేందర్
60. జూబ్లీహిల్స్ – మాగంటి గోపీనాథ్
61. సనత్‌నగర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్
62. కార్వాన్ – ఐందల కష్ణయ్య
63. చార్మినార్ – ఇబ్రహీం లోడీ
64. చాంద్రాయణ గుట్ట- ఎమ్ సీతారాం రెడ్డి
65. యాకుత్ పుర- సామ సుందర్ రెడ్డి
66. బహుదూర్‌పుర- అలీ బక్రీ
67. సికింద్రాబాద్ – టి పద్మారావు
68. సికింద్రాబాద్ కంటోన్మోంట్ (ఎస్సీ) లాస్య నందిత
69. కొడంగల్- పట్నం నరేందర్ రెడ్డి
70. నారాయణపేట్- రాజేందర్ రెడ్డి
71. మహబూబ్‌నగర్ – వీ శ్రీనివాస్‌గౌడ్
72. జడ్చర్ల – చర్లాకోలా లక్ష్మారెడ్డి
73. దేవరకద్ర- ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి
74. మక్తల్- చిట్టెం రామ్మోహన్ రెడ్డి
75. వనపర్తి- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
76. గద్వాల్- బండ్ల కష్ణమోహన్ రెడ్డి
77. అలంపూర్ (ఎస్సీ)- వీఎం అబ్రహం
78. నాగర్‌కర్నూల్- మర్రి జనార్దన్ రెడ్డి
79. అచ్చంపేట (ఎస్సీ)- గువ్వల బాలరాజు
80. కల్వకుర్తి- జీ జైపాల్ యాదవ్
81. షాద్‌నగర్ – ఏ అంజయ్య యాదవ్
82. కొల్లాపూర్- బీరం హర్షవర్దన్ రెడ్డి
83. దేవరకొండ (ఎస్టీ)-
రవీంద్ర కుమార్ రమావత్
84. నాగార్జున సాగర్- నోముల భగత్
85. మిర్యాలగూడ- నల్లమోతు భాస్కర రావు
86. హుజూర్ నగర్- శానంపూడి సైదిరెడ్డి
87. కోదాడ- బొల్లం మల్లయ్య యాదవ్
88. సూర్యపేట- జగదీశ్ రెడ్డి
89. నల్లగొండ- కంచర్ల భూపాల్ రెడ్డి
90. మునుగోడు- కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
91. భువనగిరి – పైళ్ల శేఖర్‌రెడ్డి
92. నకిరేకల్ (ఎస్సీ) – చిరుమర్తి లింగయ్య
93. తుంగతుర్తి (ఎస్సీ)- జీ కిశోర్‌కుమార్
94. ఆలేరు – గొంగిడి సునీత
95. స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ) కడియం శ్రీహరి
96. పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్ రావు
97. డోర్నకల్ – డీఎస్ రెడ్యా నాయక్
98. మహబూబాబాద్ (ఎస్టీ) – బానోతు శంకర్ నాయక్
99. నర్సంపేట – పెద్ది సుదర్శన్ రెడ్డి
100. పరకాల – చల్లా ధర్మా రెడ్డి
101. వరంగల్ వెస్ట్ – దాస్యం వినరు భాస్కర్
102. వరంగల్ ఈస్ట్ – నన్నపునేని నరేందర్
103. వర్ధన్నపేట (ఎస్సీ) – ఆరూరి రమేశ్
104. భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి
105. ములుగు (ఎస్టీ) – బడే నాగజ్యోతి
106. పినపాక (ఎస్టీ) – రేగా కాంతారావు
107. ఇల్లందు (ఎస్టీ) – బానోతు హరిప్రియ నాయక్
108. ఖమ్మం – పువ్వాడ అజరు కుమార్
109. పాలేరు – కందాల ఉపేందర్‌రెడ్డి
110. మధిర (ఎస్సీ) – లింగాల కమల్‌రాజు
111. వైరా (ఎస్టీ) – బానోతు మదన్‌లాల్
112. సత్తుపల్లి (ఎస్సీ) – సండ్ర వెంకట వీరయ్య
113. కొత్తగూడెం – వనమా వెంకటేశ్వరరావు
114. అశ్వారావుపేట (ఎస్టీ) మెచ్చా నాగేశ్వరరావు
115. భద్రాచలం (ఎస్టీ) – తెల్లం వెంకటరావు
16న బీఆర్‌ఎస్ మేనిఫెస్టో : సీఎం కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోను అక్టోబర్ 16న వరంగల్ వేదికగా జరగబోయే సింహాగర్జన సభలో విడు దల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సోమవారం హైదరా బాద్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సారి తప్పకుండా 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
పెండింగ్ స్థానాల్లో..!
– నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి
– నాంపల్లి నుంచి మహమూద్ అలీ…
– కారెక్కితే గోషామహల్‌లో రాజాసింగ్
– జనగామలో ఎటూ తేల్చుకోలేని స్థితి
సోమవారం బీఆర్‌ఎస్ ప్రకటించిన తొలి జాబితాలో నర్సాపూర్, నాంపల్లి, గోషా మహల్, జనగాం స్థానాలను పెండింగ్‌లో ఉంచిన సీఎం కేసీఆర్…ఆయా సీట్లలో నర్సాపూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి స్థానంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి అవకాశమి వ్వాలని ఆయన యోచిస్తున్నారు. ఆ మేరకు వారిద్దరితో ఈ క్రమంలో ఆమెతోపాటు మదన్‌రెడ్డితో సీఎం చర్చలు జరపనున్నారు. ఒకవేళ మదన్‌రెడ్డికే టక్కెట్ ఇవ్వాలనుకుం టే సునీతకు మెదక్ నుంచి ఎంపీగా అవకాశమివ్వనున్నారు. ఇక హైదరాబాద్‌లోని నాంపల్లి నియోజకవర్గం నుంచి తనకు అత్యంత సన్నిహితుడు, హోం మంత్రి మహమూద్ అలీని బరిలోకి దించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఆయనతోపాటు జీహెచ్‌ఎమ్‌సీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పేరును కూడా సీఎం పరిశీలిస్తున్నారు. గోషా మహల్ నుంచి బలమైన అభ్యర్థిని నిలపాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అయితే అక్కడ బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ కారు పార్టీలోకి రాను న్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన వస్తే… బీఆర్‌ఎస్ నుంచి ఆయనే బరిలోకి దిగుతారు. రాకపోతే ఆయనకు ధీటుగా మరొకరికి టిక్కెట్ ఇస్తారు. వీటితోపాటు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న జనగాం టిక్కెట్‌పై గులాబీ బాస్ మరింత లోతుగా చర్చలు జరుపుతున్నారు. అక్కడి సిట్టింగ్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కాదని… ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి టిక్కెట్ ఇస్తారనే ప్రచారం జరిగినా… దానికి కారు సారు చెక్ పెట్టారు. 115 మంది జాబితాలో జనగాం పేరు లేకుండా చూసుకున్నారు. అక్కడ ఇస్తే… ముత్తిరెడ్డికి లేదా కేటీఆర్ అనుచరుడు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నట్టు తెలిసింది. అయితే తనకు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ ముత్తిరెడ్డి సీఎంను అభ్యర్థించారు. ఈ మేరకు సోమవారం ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎంను కలిశారు. దీనిపై కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.