ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన బందోబస్తు

– పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌
నవతెలంగాణ-ఖమ్మం
శాంతియుత వాతావరణంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ తెలిపారు. శుక్రవారం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తదితర ఎన్నికల విధులపై సిబ్బందికి పోలీస్‌ కమిషనర్‌ దిశా నిర్దేశం చేశారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలులో ఉండటంతో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాలపై పోలీస్‌ సిబ్బందితో వీడియో కన్ఫరెన్స్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ఎన్నికల్లో తమకు కేటాయించిన విధులను సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రెండు రోజుల్లో పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రలోభాలకు సంబంధించిన ఏమైనా సంఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రూట్‌ మొబైల్‌ పార్టీలు, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ అప్రమత్తంగా వుండాలని, ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే స్పందించి పరిష్కారించాలని సూచించారు. పోలింగ్‌ రోజు ఓటర్లు క్యూ లైనులో ఉండేలా చూసుకోవాలని, నిషేధిత వస్తువులు పోలింగ్‌ బూత్‌ లోనికి తీసుకెళ్లకుండా, మర్యాదగా నడుచూకోవాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ఎన్నికల విధి విధానాలు, నియమ నిబంధనలు, సంబంధిత చట్టాలు తదితర అంశాలపై పోలీస్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిస్థాయిలో ముగిసే వరకు పోలీస్‌ అధికారులు, సిబ్బంది కేటాయించిన ప్రాంతాల నుండి వెళ్లకుండా ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఆడిషనల్‌ డీసీపీ లా అండ్‌ ఆర్డర్‌ ప్రసాద్‌రావు, ఆడిషనల్‌ డీసీపీ నరేష్‌ కుమార్‌, ఏఎస్పీ అవినాష్‌ కుమార్‌, ఏసీపీ ప్రసన్న కుమార్‌ పాల్గొన్నారు.

Spread the love