పాటల్లేవ్‌..! మాటల్లేవ్‌..!!

– నేటితో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తెర
– ఖమ్మంలో సాయంత్రం 6, భద్రాద్రిలో 4 గంటలకు క్లోజ్‌
– సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌కు వీలుగా వీడియోలు
– రాజకీయ వ్యూహాల్లో పార్టీలు…పంపిణీకి ఏర్పాట్లు
– ఓటుకు రూ.500 చొప్పున
– ఇప్పటికే మొదలైన పంపకాలు
‘పట్టుకో కాంగిరేసు జెండా…ఎట్టుకో నీ గుండెల నిండా.. జగమే జై కొట్టిన జెండా..జనమే జై కొట్టిన జెండా…’ అంటూ హౌరెత్తిన కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల పాటలకు..
‘మాయదారి కాంగిరేసురో రాజన్న…మన బతుకుల మన్నుపోసెరో రాజన్న…మళ్లీ మొదటికొచ్చినాది తెలంగానమూ..’ అంటూ వినిపించిన బీఆర్‌ఎస్‌ గేయాలకు…నేతల విమర్శలు, ప్రతివిమర్శల ఉపన్యాసాలకు శనివారం సాయంత్రానికి తెరపడనుంది.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మార్చి 19వ తేదీన లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఆ రోజు నుంచి మొదలైన పార్లమెంట్‌ ఎన్నికల సందడి మరో రెండు రోజుల్లో ముగియనుంది. దాదాపు నెలన్నర రోజులుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ఖమ్మం జిల్లాలో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 గంటలకు ముగియనుంది. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఎన్నికల ప్రచార హౌరు ఊపందుకుంది. ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ప్రకటించడంలో కాంగ్రెస్‌ తాత్సారం చేసింది. నామినేషన్ల ముగింపునకు ముందురోజు ఏప్రిల్‌ 24వ తేదీన ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. 25వ తేదీ నామినేషన్ల ఘట్టానికి చివరి రోజు ఆయన నామపత్రాలు సమర్పించిన మరుక్షణం నుంచే ప్రచారం ప్రారంభించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ముందుగానే తాండ్ర వినోద్‌కుమార్‌, నామ నాగేశ్వరరావును అభ్యర్థులుగా ప్రకటించడంతో మార్చి చివరి వారం నుంచే వారు ప్రచారం మొదలు పెట్టారు. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ప్రచారం ముమ్మరం చేశారు. కాంగ్రెస్‌ సీపీఐ(ఎం), సీపీఐ, జనసేన మద్దతు తీసుకోవడంలోనూ ఆలస్యమైంది. ఏప్రిల్‌లో 20వ తేదీ నాటికి వీరి మద్దతుపై స్పష్టత వచ్చింది. కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించే నాటికే బీఆర్‌ఎస్‌, బీజేపీ ఖమ్మం లోక్‌సభ పరిధిలో దాదాపు రెండు విడతల ప్రచారాన్ని పూర్తి చేశాయి.
లేటుగా మొదలైనా లేటెస్టుగా కాంగ్రెస్‌…
కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం లేటుగా మొదలైనా లేటెస్టుగా సాగుతోంది. ముగ్గురు మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రేణుకాచౌదరి ప్రచార బాధ్యతను భుజస్కంధాలపై వేసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరికి సీపీఐ(ఎం) నుంచి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు, రెండు జిల్లాల కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, సీపీఐ నుంచి రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, సాబీర్‌పాషా, పోటు ప్రసాద్‌ తోడయ్యారు. వీరితో పాటు సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌, టీడీపీలోని మెజార్టీ గ్రూపులు కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఖమ్మం పార్లమెంట్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుడు ప్రసాద్‌రెడ్డి పూర్తి బాధ్యతలు తీసుకొని ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గంటున్నారు. వేర్వేరు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నప్పటికీ మంత్రులు తుమ్మల, భట్టి సైతం సొంత నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. వీరితో పాటు వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు రాందాస్‌నాయక్‌, మట్టా రాగమయి, జారె ఆదినారాయణ సైతం ప్రచారంలో తీవ్రంగా నిమగమయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలోని కొత్తగూడెం నియోజకవర్గంలో ఈనెల 4వ తేదీన నిర్వహించిన జనజాతర సభ ఊపు తీసుకు వచ్చింది. 7వ తేదీన అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి వియ్యంకుడు, సినీ హీరో దగ్గుబాటి వెంకటేశ్‌ ఖమ్మంలో నిర్వహించిన రోడ్‌షో, కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశం హైలెట్‌గా నిలిచాయి. ఇక అన్నింటికీ మించి ‘మా మామ మంచోడు..కోడళ్లైన మమ్మల్నే ఎంతో ప్రేమగా చూసుకుంటారు…ఆయన్ను గెలిపిస్తే మిమ్మల్ని మాకన్నా బాగా చూస్తారు..’ అంటూ మంత్రి పొంగులేటి కూతురు సప్నిరెడ్డి, వెంకటేశ్‌ కూతురు ఆశ్రితరెడ్డి, అలాగే చిన్నకుమారుడు అర్జున్‌రెడ్డి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు మంచి స్పందన వస్తోంది.
శ్రమిస్తున్న సీపీఐ(ఎం)…
ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన సీపీఐ(ఎం) ఆ పార్టీ గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తోంది. కాంగ్రెస్‌ నేతలతో కలిసి, విడిగానూ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఎంత అవసరమో సీపీఐ(ఎం) నేతలు వివరిస్తు న్నారు. పార్టీ రెండు జిల్లాల కార్యదర్శివర్గ సభ్యులతో పాటు జిల్లా కమిటీ సభ్యులు, గ్రామశాఖల వరకు బీజేపీ ప్రమాదాన్ని గుర్తెరిగి కాంగ్రెస్‌ గెలుపును భుజస్కంధాలపై ఎత్తుకున్నారు. గతనెల 29వ తేదీన ఖమ్మం ఎస్‌ఆర్‌ గార్డెన్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, కార్యచరణ చేపట్టారు.
వియ్యంకునికి అన్నీ తామై…
వియ్యంకునికి అన్నీ తామై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుడు ప్రసాదరెడ్డి అలుపెరుగకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. చెరొక నియోజకవర్గానికి వెళ్లి అక్కడి ఎమ్మెల్యేలతో కలిసి ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మధ్యలో ప్రసాద్‌రెడ్డి సతీమణి శ్రీలక్ష్మి సైతం ప్రచారం నిర్వహించారు. రఘురాంరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ఆలస్యమయ్యే సరికి ఉన్న కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకు నేందుకు పొంగులేటి కుటుంబం, ఆయన అనుచరులు, యావత్‌ కాంగ్రెస్‌ శ్రేణులు చేమటోడుస్తున్నారు. టీడీపీ, సీపీఐ(ఎంఎల్‌) మద్దతు కూటగట్టడంలోనూ పొంగులేటి సక్సెస్‌ అయ్యారు.
ప్రచారంలో ‘కారు’..జోరు…
ప్రచారంలో ‘కారు’ జోరు చూపింది. అభ్యర్థిగా నామ నాగేశ్వరరావు పేరు రెండు నెలల ముందే ఖరారు కావడంతో ఆ పార్టీ శ్రేణులు వెంటనే కార్యాచరణ మొదలు పెట్టాయి. ఎంపీ గాయిత్రి రవి, మాజీ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌, జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్‌, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, బాణోత్‌ మదన్‌లాల్‌, చంద్రావతి, మెచ్చా నాగేశ్వరరావు, కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్‌ లింగాల కమలరాజ్‌ తదితరులు ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గొంటున్నారు. పార్లమెంట్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు భారీగా ఉన్నా మొక్కవోని విశ్వాసంతో నామ ఎక్కడ కూడా ఆ లోటు కనిపించకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతనెల 29న ఖమ్మం, 30న కొత్తగూడెంలో మాజీ సీఎం కేసీఆర్‌ నిర్వహించిన రోడ్‌షోలు, కార్నర్‌ మీటిం గ్‌లకూ స్పందన బాగా రావడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపింది. నామ నాగేశ్వరరావు నామినేషన్‌ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు, ఎంపీగా తన సక్సెస్‌ అంశాలను నామ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లగలిగారు.
‘కమలం’…విఫలం…
ఇక బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు ఎన్నికల ప్రచారానికి ఆశించిన స్పందన రాలేదు. డబ్బులు భారీగా ఖర్చు పెట్టినా…తగిన ప్రచారం రాకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. గౌరవప్రదమైన ఓట్లైనా సాధించడం సాధ్యకాదేమోనన్న భయాందోళనతో ఆంధ్రప్రదేశ్‌లో పొత్తును సాకుగా చూపి టీడీపీలోని ఓ గ్రూపును తమ వైపు తిప్పుకుంటోంది. సోషల్‌మీడియా, మీడియాల్లో హౌరెత్తిస్తున్నా…జనం నుంచి స్పందన మాత్రం లేకపోవడంతో ఆ పార్టీలో నిస్తేజం అలుముకుంది.
సోషల్‌ మీడియా వీడియోలు..డబ్బుల పంపిణీకి ఏర్పాట్లు…
నేటితో ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో మరో రెండురోజుల కోసం సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకునేందుకు అభ్యర్థులు, నేతలు సన్నద్ధమయ్యారు. ఇక పంపకాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ ఓటుకు రూ.500 చోప్పున పంపిణీ చేసేందుకు సన్నద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్నిచోట్ల పంపకాలు మొదలయ్యాయని సమాచారం. ఖమ్మం లోక్‌సభ పరిధిలో 16.32 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎందరికి పంపిణీ చేయాలి…తదనుగుణమైన ప్రణాళికలపై ఆయా పార్టీల నేతలు ప్రత్యేకంగా రెండు, మూడురోజులుగా సమావేశమై చర్చిస్తున్నారు.

Spread the love