పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌
– పోలింగ్‌ అనంతరం ఈవిఎం యంత్రాల తరలింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
– పోలింగ్‌ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక అలా వీడియో కాన్ఫరెన్స్‌
నవతెలంగాణ-పాల్వంచ
లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు లోక్‌ సభ సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రియాంక అలా అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌తో కలిసి సమీకృత కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ గడువు శుక్రవారం ముగిసినందున పార్లమెంటు నియోజకవర్గం పోస్టల్‌ బ్యాలెట్‌లను ఎక్స్‌చెంజ్‌ చేసుకొని, మే 12 నాటికి ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి నుంచి జారీ చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌, నమోదైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల వివరాల రిపోర్ట్‌ అందజేయాలని, పోస్టల్‌ ఓట్ల నమోదు సంబంధిత సమాచారం వివిధ రాజకీయ పక్షాలకు తెలియజేయాలని, పోస్టల్‌ బ్యాలెట్‌లను పార్లమెంటు నియోజకవర్గం కౌంటింగ్‌ కేంద్రాల స్ట్రాంగ్‌ రూములకు కట్టుదిట్టంగా తరలించి భద్రపర్చాలని అన్నారు.
ఎన్నికల పోలింగ్‌ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి సైలెన్స్‌ పీరియడ్‌ ప్రారంభమవుతుందని, సైలెన్స్‌ పీరియడ్‌లో పాటించాల్సిన నిబంధనలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అభ్యర్థులకు సమాచారం అందించాలని, ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు వెళ్లేలా చూడాలని అన్నారు.
పోలింగ్‌ రోజు, పోలింగ్‌ ముందు రోజు వార్త పత్రికలలో జారీ చేసే ప్రకటనలకు తప్పని సరిగా జిల్లా ఎంసీఎంసీ కమిటీ ఆమోదం తీసుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రచార సమయం ముగిసిన తరువాత ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, డబ్బు, మద్యం పంపిణీ కాకుండా చూడాలని, వాటిపై సీ విజల్‌, 1950 టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. పోలింగ్‌ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలలో తనిఖీలు ముమ్మరం చేయాలని, ముఖ్యమైన కూడలీలలో, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలలో నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉంచాలని అన్నారు. పోలింగ్‌ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు, రిసెప్షన్‌ కేంద్రాల వద్ద పోలింగ్‌ సిబ్బందికి అవసరమైన వసతులు కల్పించాలని, పోలింగ్‌ బృందాలకు పోలింగ్‌ సామాగ్రి అందజేసి వాహనాల ద్వారా పోలింగ్‌ కేంద్రాలకు మే 12 సాయంత్రం నాటికి చేరుకోవాలని అన్నారు.
మే 13న ఉదయం మాక్‌ పోల్‌ నిర్వహించాలని, మాక్‌ పోల్‌ అనంతరం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కావాలని, ప్రతి 2 గంటలకు పోలింగ్‌ శాతం వివరాల నివేదికను సమర్పించాలని అన్నారు. క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న పోలింగ్‌ కేంద్రాల వెబ్‌ క్యాస్టింగ్‌, సిసి కేమేరాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
సెక్టార్‌ అధికారులు రిజర్వ్‌ ఈవీఎం యంత్రాలతో సన్నద్ధంగా ఉండాలని, ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్‌ సమయంలో ఈవీఎం యంత్రాలు మరమ్మత్తుకు గురైతే వెంటనే రీప్లేస్‌ చేయాలని అన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థ ఉండాలని అన్నారు. పోలింగ్‌ అనంతరం రిసెప్షన్‌ కేంద్రాల నుంచి కౌంటింగ్‌ కేంద్రంలోని స్ట్రాంగ్‌ రూమ్‌ వరకు ఈవీఎం యంత్రాల తరలింపు కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లో ఈవిఎం యంత్రాలను భద్రపరిచి సీల్‌ చేయాలని అన్నారు. వీడియో సమావేశం అనంతరం కలెక్టర్‌ ప్రియాంక అలా అధికారులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్‌ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఉదయం నిర్వహించే మాక్‌ పోల్‌ నివేదిక, ప్రతి రెండు గంటలకు పోలింగ్‌ శాతం నివేదికలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్‌ నిర్వహణకు డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ కేంద్రాలలో, విధులు నిర్వహించే పోలింగ్‌ సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో సహాయ రిటర్నింగ్‌ అధికారులు మధు, దామోదర్‌ రావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కాశయ్య, ఎన్నికల సూపర్డెంట్‌ ధారా ప్రసాద్‌, సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love