భువనగిరి బరిలో సీపీఐ(ఎం)

భువనగిరి బరిలో సీపీఐ(ఎం)– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య
– ప్రజల భవిష్యత్తు ఈ ఎన్నికలపైనే
– ఆధారపడి ఉంది : చెరుపల్లి, జూలకంటి
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వెన్నెల కళాశాలలో నిర్వహించిన సీపీఐ(ఎం) జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. కుల, మతాల పేరుతో ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి వైషమ్యాలను రెచ్చగొట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.
నవతెలంగాణ-భువనగిరి
భారతదేశంలో 100 కోట్ల మందికి పైగా పౌష్టికాహారం అందడం లేదని ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని, కానీ దేశ ప్రధాని 80 కోట్ల మందికి మాత్రమే అందడం లేదని అబద్ధాలు చెప్పడం దారుణమని వీరయ్య అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించడం, ప్రభుత్వ రంగంలో ప్రయివేటు వ్యక్తుల వాటాలు పెంచడం ద్వారా ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో బడా బూర్జువా పెట్టుబడు దారులు మోడీని కొనసాగించాలని కోరుకుంటు న్నారే కానీ సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రం బీజేపీని విమర్శిస్తున్నారన్నారు. ఎలక్టోరల్‌ బాండ్స్‌ పేరుతో బీజేపీకి వేల కోట్ల రూపాయల విరాళాలు అందాయని తెలిపారు. పాలకవర్గ స్వభావాన్ని తక్కువగా అంచనా వేయవద్దని, ప్రజా సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మూడుసార్లు కలిసామని, నేటికీ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని అన్నారు.
సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రజల భవిష్యత్తు ఈ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా సమస్యలే తమ ఎజెండాగా నిరంతరం ప్రజల తరపున పనిచేసే సీపీఐ(ఎం) అభ్యర్థికి ఓటువేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ అనుసరిస్తు న్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా 1100 మంది రైతులు మృతి చెందితే తప్ప ప్రధాని వెనకడుగు వేయలేదని విమర్శించారు. దేశాన్ని అప్పుల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు. దేశంలో కార్పొరేట్‌ శక్తులు.. ఆర్‌ఎస్‌ఎస్‌, మోడీ అమిత్‌ షా త్రయంలో త్రిబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నడుస్తుందన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నరసింహులు, మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, దోనూరు నర్సిరెడ్డి, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, సిరిపంగి స్వామి, మాయ కృష్ణ, బొల్లు యాదగిరి, ఎండి.పాషా, బబ్బురి పోశెట్టి, గంగదేవి సైదులు, బొడ్డుపల్లి వెంకటేష్‌, బండారు నరసింహ, బొలగాని జయరాములు, అవ్వారు రామేశ్వరి, గడ్డం వెంకటేష్‌, ఎంఏ.ఇక్బాల్‌, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love